close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
శత్రుదుర్భేద్య సౌధం.. పర్యావరణహితం

ఎన్నో ప్రత్యేకతల సమాహారం అమెరికా కాన్సులేట్‌ నూతన భవనం
వచ్చే ఏడాది చివరికల్లా సిద్ధం
ఈనాడు, హైదరాబాద్‌

అదో అద్భుత సౌధం.. శత్రుదుర్భేద్యం.. పర్యావరణహితం.. అమెరికా ప్రభుత్వం హైదరాబాద్‌లో కాన్సులేట్‌ నిర్మాణాన్ని వినూత్నంగా చేపడుతోంది. సైబరాబాద్‌లోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో 12.3 ఎకరాల విస్తీర్ణంలో వేగంగా జరుగుతున్న ఈ నిర్మాణం..  2021 చివరినాటికి పూర్తి కానుంది. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన సుమారు వెయ్యి మంది పనివారు ఈ మహా భవంతి నిర్మాణ క్రతువులో తలమునకలుగా ఉన్నారు.


రూ.2600 కోట్లతో..

ఈ ప్రాంగణం నిర్మాణానికి చేస్తున్న వ్యయం సుమారు రూ.2600 కోట్లు (350.50 మిలియన్‌ డాలర్లు). 2,500 మంది వీసా అభ్యర్థుల ఇంటర్వ్యూకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కాన్సులేట్‌ ఉన్న బేగంపేటలోని పాయిగా ప్యాలెస్‌లో 16 వీసా ఇంటర్వ్యూ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. నూతన ప్రాంగణంలో 54 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచంలోని అన్ని అమెరికా రాయబార కార్యాలయాలకు సంబంధించిన కళాఖండాలు, కళాకృతులతో శాశ్వత ఆర్ట్‌ గ్యాలరీని కూడా నిర్మిస్తున్నారు. రెండు దేశాల సంస్కృతులను ప్రతిబింబించేలా ఓ గ్యాలరీనీ ఏర్పాటు చేస్తున్నారు.


అన్నింటినీ తట్టుకునేలా..

ఎంతటి ప్రకృతి విపత్తు సంభవించినా.. ఎంతటి అధునాతన ఆయుధాలను ప్రయోగించినా.. చెక్కు చెదరకుండా ఉండేలా కాన్సులేట్‌ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. భవనంలోని అధిక శాతం ప్రాంతాల్లో బయటకు ఒక గోడ మాదిరిగా కనిపించినా.. అవి రెండు గోడలు. రెండింటి మధ్య కూడా అత్యంత నాణ్యమైన స్టీల్‌ రాడ్లను అమర్చుతున్నారు. హైదరాబాద్‌ చారిత్రక విలువలకు ఎలాంటి విఘాతం కలగకుండా, జీవవైవిధ్యం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ప్రాజెక్టును ‘అమెరికా గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ ఫర్‌ లీడర్‌షిప్‌ ఇన్‌ ఎనర్జీ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ జోన్‌’గా నమోదు చేశారు. అమెరికాకు చెందిన ఆర్కిటెక్ట్‌ రిచర్డ్‌ కెనడీ సంస్థ పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. 798 ఫొటోవోల్టాయిక్‌ మాడ్యూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వ్యవస్థ ద్వారా ఏడాదికి 455 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇక్కడ వినియోగించే నీటిలో 75 శాతాన్ని శుద్ధి చేసి మొక్కలు, ఇతర అవసరాలకు వాడుకుంటారు.


అన్నీ ఒకేచోట

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలకు హైదరాబాద్‌లోని కాన్సులేట్‌ సేవలను అందిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో అమెరికాకు చెందిన కంపెనీలు పెద్ద సంఖ్యలో పని చేస్తున్నాయి. మరోవైపు ప్రస్తుత కాన్సులేట్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న పాయిగా ప్యాలెస్‌లో చాలినంత స్థలం లేకపోవటంతో అమెరికాకు చెందిన వివిధ విభాగాలు హైదరాబాద్‌లోని వేరువేరు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ(యూఎస్‌ఏఐడీ…), యూఎస్‌-ఇండియా ఎడ్యుకేషనల్‌ ఫౌండేషన్‌(యూఎస్‌ఐఈఎఫ్‌) ఇలా పలు సంస్థలన్నింటినీ నూతన ప్రాంగణంలోకి మార్చే అవకాశం ఉంది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.