close

ప్రధానాంశాలు

గజం రూ.77వేలు

  ఉప్పల్‌ భగాయత్‌లో తొలిరోజు ఈ-వేలానికి భారీ స్పందన
  హెచ్‌ఎండీఏకు రూ.155 కోట్ల ఆదాయం

ఈనాడు, హైదరాబాద్‌: తొలిరోజే జోరు కొనసాగింది. హెచ్‌ఎండీఏ పంట పండింది. శనివారం నిర్వహించిన ఈ-వేలానికి భారీ స్పందన లభించింది. ప్లాట్లను దక్కించుకునేందుకు కొనుగోలుదారులు తీవ్రంగా పోటీపడ్డారు. 52 ప్లాట్ల(విస్తీర్ణం 31311.5 గజాలు)ను విక్రయించగా రూ.155 కోట్ల ఆదాయం సమకూరింది. అత్యధికంగా గజం రూ.77వేలు, అత్యల్పంగా రూ.30,200 పలికింది. సగటున గజం రూ.53,520 పలికినట్లుగా హెచ్‌ఎండీఏ అధికారులు పేర్కొన్నారు.
* భూసమీకరణ(ల్యాండ్‌ పూలింగ్‌)లో భాగంగా నాగోల్‌ మెట్రోస్టేషన్‌కు సమీపంలోని ఉప్పల్‌ భగాయత్‌లో ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి సుమారు 750 ఎకరాల భూములను హెచ్‌ఎండీఏ గతంలో సేకరించింది. ఫేజ్‌-1, ఫేజ్‌-2 కింద అన్ని సౌకర్యాలతో లేఅవుట్లను అభివృద్ధి చేసింది. భూములు అప్పగించిన రైతులకు ఫేజ్‌-1 లేఅవుట్‌లో ప్లాట్లను కేటాయించింది. అభివృద్ధి ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు సొంతంగానే నిధులను సమకూర్చుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్థిరాస్తి వ్యాపారం జోరు మీద ఉండటంతో ఫేజ్‌-2లోని మొత్తం 67కు 64 ప్లాట్లను గతంలో విక్రయించగా రూ.677 కోట్ల(సగటున గజం రూ.51,516) ఆదాయం సమకూరింది. శని, ఆది, సోమవారాల్లో ఫేజ్‌-1 లేఅవుట్‌లోని 124 ప్లాట్లు, ఫేజ్‌-2లోని 3 ప్లాట్లను విక్రయించేందుకు ఏర్పాట్లు చేసింది.  ఈ-వేలం నిర్వహణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీకి అప్పగించింది. తొలిరోజు 58 ప్లాట్లను అమ్మకానికి ఉంచారు. కనీస ధర గజానికి రూ.30వేలుగా నిర్ణయించారు.

హోరా హోరీగా వేలం
* తొలిదశలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 29 ప్లాట్ల(విస్తీర్ణం 150 నుంచి 300 గజాల వరకు)కు నిర్వహించిన వేలం హోరాహోరీగా సాగింది. చిన్నసైజ్‌ ప్లాట్లను దక్కించుకునేందుకు అనేకమంది పోటీ పడ్డారు. 166 గజాల ప్లాట్‌ రూ.1.27 కోట్లు(గజం రూ.77వేలు) పలికిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 6623.5 గజాలను విక్రయించగా రూ.40.04 కోట్ల ఆదాయం సమకూరింది.
* రెండో దశలో(మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు) పెద్ద సైజ్‌ ప్లాట్లకు తీవ్ర పోటీ ఏర్పడింది. 29 ప్లాట్ల(విస్తీర్ణం 300 గజాల నుంచి 2482 వరకు)ను విక్రయానికి ఉంచారు. రెండింటికి  బిడ్లు దాఖలు కాలేదు. మరో నాలుగింటికి ఒకటే బిడ్‌రావడంతో రద్దుచేశారు.  23 ప్లాట్ల (24688 గజాలు)ను విక్రయించగా రూ.115 కోట్లు సమకూరింది. 822 గజాల ప్లాట్‌ రూ.6.29 కోట్లు (ఒక్కో గజం రూ.76,600) పలకడం గమనార్హం.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.