close

ప్రధానాంశాలు

సంప్రదాయం వీడని త్రివర్గాలు  

పీజీ కోర్సుల్లో అత్యధికులు బడుగులే
ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీలలో 91.65 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలే
వీటిలో అగ్రవర్ణాల విద్యార్థులు 8.35 శాతమే
వృత్తి, సాంకేతిక కోర్సులపైనే ఓసీల ఆసక్తి
ఈనాడు, హైదరాబాద్‌

ఉద్యోగ విపణి మారుతోంది. ఉత్పత్తి, సేవలు, సాంకేతిక రంగాలు అనూహ్యంగా ప్రభావితం అవుతున్నాయి. వీటిని గమనిస్తున్న ఉన్నత వర్గాల విద్యార్థులు తమ చదువుల రూటు మార్చుకుంటున్నారు. వృత్తి, వ్యాపార నిర్వహణ విభాగాల కోర్సులను అందిపుచ్చుకుంటున్నారు. అదేసమయంలో గతంతో పోలిస్తే ఉన్నత చదువుల రంగంలోకి  బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థులు అధికంగా అడుగిడుతున్నారు. అయితే పేదరికం, గ్రామీణ నేపథ్యం తదితర కారణాలతో సంప్రదాయ కోర్సుల వైపే మొగ్గు చూపుతున్నారు. విశ్వ విద్యాలయాల్లోని పోస్టు  గ్రాడ్యుయేట్‌(పీజీ) కోర్సుల్లో ప్రతి 100 మంది విద్యార్థుల్లో 92 మంది ఈ మూడు వర్గాల వారే ఉండటం గమనార్హం. ఈ తీరుపై  ‘ఈనాడు’ ప్రత్యేక కథనం....

తెలంగాణలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, జేఎన్‌టీయూ-హెచ్‌ విశ్వవిద్యాలయాల్లోని కోర్సుల్లో ప్రస్తుత విద్యా సంవత్సరం(2019-20) ప్రవేశాలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష(సీపీగేట్‌) నిర్వహించింది. వీటిల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఈడీ తదితర పీజీ కోర్సులు ఉన్నాయి. పరీక్ష నిర్వహణ, ప్రవేశాల భర్తీ ప్రక్రియ బాధ్యతను ఉస్మానియా (ఓయూ)కి అప్పగించారు. ప్రవేశాల ప్రక్రియ ముగిసిన తర్వాత ఓయూ రూపొందించిన నివేదికను ‘ఈనాడు’ పరిశీలించగా... సంప్రదాయ కోర్సుల్లో చేరిన విద్యార్థుల్లో అత్యధికులు బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారు. ఓపెన్‌ కేటగిరీ సీట్లనూ చాలావరకు ఈ మూడు వర్గాలకు చెందిన వారే సాధించారు. ఓసీ విద్యార్థులు వర్సిటీల అనుబంధ ప్రైవేట్‌ కళాశాలలతోపాటు విశ్వవిద్యాలయాల ప్రాంగణ కళాశాలల్లోనూ స్వల్ప సంఖ్యలోనే చేరడం విశేషం.


భర్తీ 23,219... ఓసీలు 1,939 మంది

రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాలకు చెందిన పీజీ సీట్లలో చేరడానికి 90,344 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. వాటిలో ఓసీల నుంచి 9,971 మంది మాత్రమే ఉండటం గమనార్హం. ప్రవేశ పరీక్ష నిర్వహించిన తర్వాత సీట్లను వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా ఓయూ భర్తీ చేసింది. మొత్తం 31,753 సీట్లుండగా 23,219 భర్తీ అయ్యాయి. వీటిలో ఓపెన్‌ కేటగిరీలో 1,939 మంది ఓసీలు మాత్రమే చేరారు. ఇది 8.35 శాతమే. వారిలోనూ 80%పైగా ఎమ్మెస్సీ, ఎంకాం కోర్సుల్లోనే చేరినట్లు ఓయూ ప్రవేశాల సంచాలకుడు ఆచార్య ఎన్‌.కిషన్‌ తెలిపారు. ఎంఏ కోర్సుల ఆర్ట్స్‌ కళాశాలలో ఓసీ విద్యార్థులను వేళ్లపై లెక్కించవచ్చన్నారు.


స్థిర’త్వానికే వారి ప్రాధాన్యం

ఉద్యోగావకాశాలు మెండుగా ఉండి... విపణిలో డిమాండ్‌ ఉన్న కోర్సుల వైపు ఓసీ విద్యార్థులు ఎక్కువగా మరలుతున్నారు. జీవితంలో త్వరగా స్థిరపడటానికి, ఉన్నత అవకాశాలు అందుకోవడానికి వీరు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే రాష్ట్రంలో ఓసీ జనాభా తక్కువగానే ఉన్నా... ఇతర వృత్తి విద్యా కోర్సులైన బీటెక్‌, ఎంబీఏ, ఫార్మా తదితర కోర్సుల్లº చేరిన వారి శాతం అధికంగా ఉంది. ఇది ఇంజినీరింగ్‌లో 28.45%, బీఫార్మసీ/ఫార్మా-డిలో 14.43%, ఎంబీఏలో 21.32%గా ఉండటం గమనార్హం. ‘ఈ తీరుపై నాలుగేళ్ల క్రితం కొంతమంది ఆచార్యులం కలిసి పరిశీలించాం. ఓసీ విద్యార్థులు ఉద్యోగావకాశాలు ఉన్న కోర్సుల వైపే అధికంగా వెళ్తున్నారు. ఒకవేళ సంప్రదాయ పీజీ కోర్సుల్లో చేరాలనుకుంటే కేంద్రీయ, డీమ్డ్‌, ప్రైవేట్‌ వర్సిటీలు, ఎన్‌ఐటీలు, ఐఐటీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకవేళ స్థితిమంతులైతే విదేశాలకు సైతం వెళ్తున్నారు’ అని ఓయూలో ప్రభుత్వ పాలనాశాస్త్ర ఆచార్యుడు వై.పార్థసారథి వివరించారు.


ఆర్థిక స్థోమతే అన్నింటికీ కారణం

అగ్రవర్ణాలే కాదు... మిగిలిన సామాజిక వర్గాల్లోనూ ఆర్థిక స్థోమత ఉన్న వారు సంప్రదాయ పీజీ కోర్సుల్లో చేరడం లేదని, వాటిల్లో చేరితే కొలువులు దక్కవని, జీవితంలో త్వరగా స్థిరపడలేమంటూ వారు భావిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి విశ్లేషించారు. ఈ కోర్సుల్లో చేరుతున్న వారిలో(ఓసీ యేతర) అధిక శాతం మంది మొదటి తరం విద్యార్థులు(తల్లిదండ్రులు నిరక్షరాస్యులు), పేదలు, గ్రామీణ ప్రాంతాల వారే ఉంటున్నారని గుర్తుచేశారు.


అమ్మాయిలు: గుణాత్మకమున్నా వివక్షే

పీజీ కోర్సుల్లో ఇటీవల అమ్మాయిలే ఎక్కువ మంది చేరుతున్నారు. అబ్బాయిలతో పోలిస్తే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. గుణాత్మకంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామమైనా తల్లిదండ్రులు వారి కొడుకులను అధిక రుసుంలు ఉండే వృత్తి విద్యా కోర్సుల్లో చేర్పిస్తున్నారని, అమ్మాయిలకు మాత్రం తక్కువ ఖర్చయ్యే వాటిల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారని ఓయూ ఆచార్యులు విశ్లేషిస్తున్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.