close

ప్రధానాంశాలు

నింగిలోకి సగర్వంగా జీశాట్‌-30

ఫ్రెంచ్‌ గయానా నుంచి  విజయవంతంగా ప్రయోగం
సమాచార ఉపగ్రహాల చరిత్రలో  మైలురాయి: ఇస్రో

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: భారీ ఉపగ్రహ ప్రయోగాల్లో మనదేశం మరో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం(ఇస్రో) రూపొందించిన జీశాట్‌-30 ఉపగ్రహం శుక్రవారం ఉదయం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 2:35గంటలకు ఫ్రెంచ్‌ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్‌ 5 వీఏ-251 వాహకనౌక ద్వారా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఇది కేవలం 38నిమిషాల 25సెకన్ల వ్యవధిలో వాహకనౌక పైభాగం నుంచి విడిపోయి నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశించింది. భారతీయ సమాచార ఉపగ్రహాల చరిత్రలో ఇదో మైలురాయి అని ఇస్రో అభివర్ణించింది. దాదాపు 3,357కిలోల బరువున్న జీశాట్‌-30 ఇస్రో గతంలో ప్రయోగించిన ఇన్‌శాట్‌, జీశాట్‌, ఇన్‌శాట్‌-4ఏ శ్రేణి ఉపగ్రహాలకు ఆధునిక రూపమని ఇస్రో అధిపతి డా.కె.శివన్‌ పేర్కొన్నారు. స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌, టెలీపోర్ట్‌ అప్‌లింకింగ్‌, డీటీహెచ్‌, ఏటీఎంల వీశాట్‌ అనుసంధానం, ఇ-గవర్నెన్స్‌ అప్లికేషన్లు, డిజిటల్‌ శాటిలైట్‌ వార్తల సేకరణ వంటి సేవలను సమర్థమంతంగా అందించగలదన్నారు. వాహకనౌక నుంచి వేరుపడిన వెంటనే హాసన్‌లోని మాస్టర్‌ కంట్రోల్‌ కేంద్రం(ఎంసీఎఫ్‌) నుంచి జీశాట్‌-30 పనితీరును పరిశీలించగా అంతా సవ్యంగా ఉందని శివన్‌ చెప్పారు. క్రమంగా కక్ష్య పెంపు ప్రక్రియను చేపడుతూ 36 వేల కిలోమీటర్ల దూరంలోని భూస్థిర కక్ష్యలోకి చేర్చి ఈ ఉపగ్రహంలోని వ్యవస్థలను సేవలకు ఉపక్రమించేలా చేస్తామన్నారు. జీశాట్‌-30 2020లో ఇస్రో ప్రయోగించిన తొలి ఉపగ్రహం కావడం విశేషం. ఈ ఏడాది మొత్తం 25 ఉపగ్రహాలను నింగిలోకి పంపాలని ఇస్రో లక్ష్యంగా నిర్ణయించుకుంది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.