close

ప్రధానాంశాలు

అంతకుమించి.. రైతులకు లబ్ధి

సీఆర్‌డీఏ రద్దు అంశం పరిశీలనకు రాలేదు
13 జిల్లాలతోపాటు అమరావతినీ అభివృద్ధి చేస్తాం
ఏపీ మంత్రి బొత్స వెల్లడి

ఈనాడు, అమరావతి: అమరావతిలోని రైతులతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం, అవసరమైతే అంతకుమించి రైతులకు లబ్ధి అందించాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ సూచించారని ఆ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ‘అమరావతిలో 25 శాతానికిపైగా పూర్తయిన భవనాల నిర్మాణాలన్నింటినీ పూర్తిచేసి వాడుకలోకి తీసుకువస్తాం. 13 జిల్లాలతోపాటు అమరావతినీ అభివృద్ధి చేస్తాం’ అని చెప్పారు. ఉన్నతస్థాయి కమిటీతో ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం సమావేశమయ్యారు. కమిటీ సభ్యులు ప్రజంటేషన్‌ ద్వారా తమ నివేదికను ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం మంత్రి కన్నబాబుతో కలిసి బొత్స సత్యనారాయణ విలేకరులతో మాట్లాడారు. ‘‘జీఎన్‌ రావు, బీసీజీ నివేదికలను ఉన్నతస్థాయి కమిటీ పరిశీలించింది. రాష్ట్రంలో ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని కమిటీ అభిప్రాయపడింది. నివేదికను మంత్రిమండలి ముందుంచుతాం. రాజధాని నిర్మాణాలకు అమరావతి అనువైన ప్రాంతం కాదని మద్రాస్‌ ఐఐటీ నివేదిక ఇవ్వలేదనడం పూర్తిగా అవాస్తవం. కావాలంటే మీరే (విలేకరులతో) స్వయంగా ఐఐటీ వాళ్లను కనుక్కోండి. సీఆర్‌డీఏ రద్దు అంశం కమిటీ పరిశీలనకు రాలేదు. అప్పట్లో చంద్రబాబు అఖిలపక్షాన్ని పిలిచి, ‘ఇదిగో ఇక్కడ రాజధాని ఏర్పాటు చేద్దామనుకుంటున్నాం, మీ అభిప్రాయమేంటి’ అని అడిగారా?, నేరుగా అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఆ రోజు అమరావతికి జగన్‌ అంగీకరించారని మాట్లాడుతున్నారు. కానీ, ఆ రోజున జగన్‌ ప్రసంగాన్ని పూర్తిగా వినండి. ‘ప్రభుత్వ భూములైతే బాగుండేది, ఇలా మూడు పంటలు పండే పొలాలను తీసుకోవడం సరికాదు’ అనే చెప్పారు. జోలెపట్టి వసూలు చేసిన డబ్బును చంద్రబాబు ఎవరికిచ్చారు? అంతకుముందు రాజధాని కోసం హుండీ పెట్టి సేకరించిన డబ్బు ఏమైంది’’ అని ప్రశ్నించారు.
భాజపా, జనసేన పొత్తు కుదిరిన అనంతరం జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ స్పందిస్తూ 2024లో అధికారంలోకి వస్తామని చెప్పడానికి పవన్‌ కల్యాణ్‌, కన్నా లక్ష్మీనారాయణ జ్యోతిష్యులా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.