close

ప్రధానాంశాలు

గాలమెయ్‌.. తాయిలమియ్‌!

  నేటితో ముగియనున్న పుర ప్రచారం
  ప్రలోభాల పర్వానికి శ్రీకారం
  గంపగుత్తగా ఓట్లు కొనేందుకు పలు చోట్ల నేతల ప్రణాళికలు
  రాజధాని శివారుల్లో మరింత జోరు.. 6 ఓట్లుంటే ద్విచక్ర వాహనం!
  ఒక డివిజన్‌లో బస్తీ సంక్షేమ సంఘానికి 150 గజాల స్థలం

ఈనాడు, హైదరాబాద్‌: పురపాలక ఎన్నికల హోరాహోరీ ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఇప్పటికే సర్వశక్తులొడ్డిన నేతలు తర్వాత అస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. సోమవారం సాయంత్రం నుంచి మలిదశ వ్యూహాలను అమలు చేయనున్నారు. ప్రలోభాల పర్వానికి శ్రీకారం చుట్టనున్నారు. వరుస విజయాల పరంపర కొనసాగిస్తున్న తెరాస పురపాలక ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని ఆరంభం నుంచి పక్కాగా ఎన్నికల ప్రచార వ్యూహాన్ని అమలు చేయగా కాంగ్రెస్‌, భాజపాలు సత్తాచాటాలని తమ ప్రయత్నాలు కొనసాగించాయి. రాష్ట్రంలో ఈ నెల 22న 120 పురపాలక సంఘాలు, 9 నగరపాలక సంస్థల్లో ఎన్నికలు జరగనున్న విషయం విదితమే. గడువు సమీపిస్తుండటంతో ఓ వైపు ప్రచారం హోరెత్తుతుండగా ప్రలోభాలు అదే స్థాయిలో ఉంటున్నాయి.

గతంలో ఇంటింటికి తిరిగి డబ్బు, మద్యం, ఇతర సామగ్రి అందించేవారు. ఇప్పుడు ప్రచారానికి, ఎన్నికలకు మధ్య సమయం తక్కువగా ఉండటంతో గంపగుత్తగా ఓటర్లను బుట్టలో వేసుకోవాలనే ప్రణాళికలో అభ్యర్థులున్నారు. యువజన, బస్తీ, మహిళా సంఘాలతో పాటు సామాజికవర్గం పరంగా ఏర్పాటైన కమిటీలపై దృష్టి సారించారు. ఈ సంఘాల అధ్యక్ష, కార్యదర్శుల సమక్షంలో తమకే ఓటు వేసేవిధంగా తీర్మానం చేయించుకుంటున్నారు. భారీ ప్రలోభాలకు ఎర వేస్తున్నారు. హైదరాబాద్‌ శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇలాంటి ఎత్తుగడలు జోరుగా సాగుతున్నాయి.
* బండ్లగూడ జాగీర్‌లోని ఓ డివిజన్‌ నుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీ అభ్యర్థి తన డివిజన్‌ పరిధిలోని బస్తీలో ఎక్కువగా ఉన్న ఓ సామాజికవర్గం ఓటర్లను మచ్చిక చేసుకోవాలన్న ఉద్దేశంతో ఓటుకు రూ.10 వేల వరకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తనకు ఉన్న 150 గజాల స్థలాన్ని బస్తీ సంక్షేమ సంఘానికి రాసిచ్చారు. ఆ స్థలం విలువ సుమారు రూ.75 లక్షలు ఉంటుందని అంచనా. దాన్ని విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్మును పంచుకొని తనకే ఓటు వేయాలని షరతు పెట్టినట్లు సమాచారం.
* బండ్లగూడ జాగీర్‌లోని మరో డివిజన్‌లో ఆరు ఓట్లుండే ఇంటికి ఓ ద్విచక్రవాహనాన్ని ఇవ్వాలని ఓ అభ్యర్థి నిర్ణయించారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన రోజునే వంద ద్విచక్ర వాహనాలు బుక్‌ చేశారని తెలిసింది.
* పీర్జాదిగూడలో ప్రధాన పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి ఇప్పటికే రూ.10 కోట్లు ఖర్చుపెట్టినట్లు అంచనా. యువజన, మహిళా సంఘాలకు రూ.30 వేలు చొప్పున అందిస్తున్నట్లు తెలిసింది. ప్రత్యర్థులను మచ్చిక చేసుకునేందుకు రూ.లక్షలిచ్చినట్లు సమాచారం.
* ఆదిభట్ల మున్సిపాలిటీలోని ప్రధాన పార్టీ అభ్యర్థి ఒకరు రూ.లక్షలు ఖర్చు పెట్టి ఓటర్లను విహారయాత్రలకు పంపించారు. కాలనీవాసులందరి ఓట్లను   వేయించుకోవాలన్నది ప్రణాళిక. రెండుకు పైగా ఓట్లున్న ఇంటికి తులం బంగారం ఇవ్వాలని మరో అభ్యర్థి నిర్ణయించుకుని.. ఆ మేరకు బంగారం వ్యాపారులతో ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది.
* పోచారంలో కనీస వసతులు లేని ఓ వార్డులో గుడి, బడి కట్టిస్తానని ఓ అభ్యర్థి డబ్బులు జమ చేసినట్లు తెలిసింది.
* మా అబ్బాయి పుట్టిన రోజు అంటూ కరీంనగర్‌ జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో అభ్యర్థులు ధూంధాంగా దావత్‌లిస్తున్నారు.
* మహిళలను ఆకట్టుకునేందుకు కొందరు అభ్యర్థులు ఆదిభట్ల, నిజాంపేట, పోచారం, ఇబ్రహీంపట్నంలో మిక్సీలు, గ్రైండర్ల పంపిణీ చేపట్టారు.
* సూర్యాపేటలో 10 ఓట్లున్న ఇంటికి విలువైన గృహోపకరణాలిస్తామని హామీ ఇస్తున్నారు. బోధన్‌లో ఇంటింటికి 25 కేజీల బియ్యం బస్తా ఇస్తున్నారు.

ఆదివారం వంట చేసుకోవద్దు
ఎన్నికల ముందు వచ్చిన ఆదివారం కావడంతో ఓటర్లకు ముక్క, మందు జోరుగా పంపిణీ చేశారు. పలు మున్సిపాలిటీల్లో బిర్యానీ ప్యాకెట్లు అందించడం కనిపించింది. నగర శివారు ప్రాంతాల్లో ఆయా పార్టీల అనుచరులు ఉదయాన్నే ఇంటింటికి తిరిగి వంట చేసుకోవద్దని సలహా ఇచ్చారు. మధ్యాహ్నం రెండు పూటలకు సరిపడా బిర్యానీ ప్యాకెట్లు, మందు సీసాలు పంపిణీ చేశారు. ఆదిభట్ల, దుండిగల్‌, నార్సింగి, మణికొండ, బండ్లగూడ, మీర్‌పేట, బడంగ్‌పేట, పెద్దఅంబర్‌పేట్‌, తూంకుంట, తుక్కుగూడ మున్సిపాలిటీలో ఈ తరహా వాతావరణం ఎక్కువగా కనిపించింది. ఆర్మూరు, కామారెడ్డిలలో ఇంటింటికి అర కేజీ చికెన్‌ ఇచ్చారు.

సాయంత్రం ఐదుగంటల తర్వాత ప్రచారం వద్దు: ఎన్నికల సంఘం
సోమవారం సాయంత్రం ఐదు గంటల నుంచి 22న ఎన్నికలు జరిగే పుర, నగరపాలక సంస్థల్లో ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయకూడదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 24న పోలింగ్‌ జరిగే కరీంనగర్‌ కార్పొరేషన్‌లో 22వ తేదీ సాయంత్రం ఐదుగంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుందని స్పష్టం చేసింది. ఎన్నికల సభలు, సమావేశాలు పెట్టడం, ర్యాలీలు నిర్వహించడం, టీవీలు, సినిమాహాళ్లలో ప్రచారం, ఎన్నికల ప్రచారంలో భాగంగా మ్యూజికల్‌నైట్‌ సహా ఎలాంటి వినోద కార్యక్రమాలు నిర్వహించకూడదని ఉత్తర్వుల్లో ఎన్నికల సంఘం పేర్కొంది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.