close

ప్రధానాంశాలు

పుట్టినింట తెలుగు వెలుగు

 మైసూరు నుంచి నెల్లూరుకు ప్రాచీన  తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం
 ఉప రాష్ట్రపతి కృషి ఫలితం
ఈనాడు -  నెల్లూరు

తెలుగుభాషకు రెండు వేల సంవత్సరాలకు పైగా ఘనచరిత ఉన్నట్లు ఆధారాల ద్వారా తెలుస్తోంది. క్రీస్తుపూర్వమే ప్రజల వ్యావహారిక భాషగా తెలుగు ఉన్నట్లు నిరూపితమైంది. క్రీ.శ. 5వ శతాబ్దంలోనే గద్య శాసనాలు, క్రీ.శ. 8వ శతాబ్దం నుంచి కనిపిస్తున్న పద్య శాసనాలు తెలుగుభాషా పరిణామ క్రమాన్ని తెలియ జేస్తాయి. శాతవాహనుల పాలన గురించి బయటపడిన శాసనాలు, నాణేలు తెలుగు ప్రాచీనతకు ఆధారంగా నిలిచాయి. క్రీ.పూ. 3వ శతాబ్దం నుంచి లభ్యమవుతున్న శాసనాల్లో ఆంధ్రదేశంలోని గ్రామనామాలు, వ్యక్తుల పేర్లు కనిపిస్తాయి. మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మౌర్యులు, అశోకుని కాలం నాటి శాసనాలు, బౌద్ధ స్తూపాలు లభించాయి. అశోకుని 13వ ధర్మలిపి శిలాశాసనంలో (క్రీ.పూ.256-254) ఆంధ్ర, పుళింద జాతుల ప్రస్తావన ఉంది.  మనదేశంలో ఎక్కువమంది మాట్లాడే భాషల్లో తెలుగు మూడో స్థానంలో ఉంది. ప్రపంచంలో 15వ స్థానంలో ఉంది. ప్రపంచంలో రెండో అత్యుత్తమ లిపిగా తెలుగును ఇంటర్నేషనల్‌ ఆల్ఫాబెట్‌ అసోసియేషన్‌ 2012లో ఎంపిక చేసింది.

అయ్యదేవర కమిటీతో శ్రీకారం
భాషా ప్రాతిపదికపై 1956 నవంబరులో ఆంధ్రప్రదేశ్‌ అవతరించినప్పటి నుంచి తెలుగును అధికారిక భాషగా రూపొందించే ప్రయత్నాలు జరిగాయి. 1955లో అయ్యదేవర కాళేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పడిన కమిటీ ఈ ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. పదేళ్ల తర్వాత 1966 మే 14న తెలుగును అధికారభాషగా పరిగణిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీని అమలుకు తెలుగులో శాస్త్ర గ్రంథాలు, పారిభాషిక పదజాలం అవసరమయ్యాయి. వీటిని రూపొందించడానికి 1968లో తెలుగు అకాడమీ ఏర్పాటైంది. అధికార భాషను పటిష్ఠంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 1971లో అధికార భాషా సంఘాన్ని ఏర్పరచింది. 2004 అక్టోబరు 12న భారతదేశపు గెజిట్‌లో ‘ప్రాచీన భాషలు’ అనే పేరుతో కొత్త భాషా సముదాయాన్ని సృష్టిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం అదే సంవత్సరం సెప్టెంబరు 2న జరిగిన కేంద్ర సాహిత్య అకాడమీ సమావేశంలో తమిళానికి ప్రాచీన హోదా ఇవ్వాలని సిఫార్సు చేశారు. వెంటనే తమిళానికి ప్రాచీన హోదా దక్కింది. అదే సమయంలో తెలుగుకూ ప్రాచీన హోదా ఇవ్వాలనే డిమాండు మొదలైంది. తెలుగుకు ప్రాచీనహోదా ఇచ్చేందుకు కేంద్రం 2006లోనే సిద్ధమైంది. అనంతరం 2008 అక్టోబరు 31న తెలుగును ప్రాచీనభాషగా గుర్తిస్తున్నామనే కేంద్ర ప్రకటన వెలువడింది. 2005లో సంస్కృతానికి, 2008లో కన్నడానికి, 2013లో మలయాళానికి, 2014లో ఒడియా భాషలకు ప్రాచీన హోదా అందించారు. తెలుగు ప్రాచీన హోదా విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మద్రాసు హైకోర్టులో పిటిషన్లు దాఖలైనా కోర్టు వాటిని కొట్టేసింది.

1500 ఏళ్ల సాహితీ ఆధారాలతో..
తెలుగును ప్రాచీనభాషగా చెప్పడానికి నన్నయ రాసిన ఆంధ్ర మహా భారతాన్ని ఆధారంగా చూపారు. ప్రాచీన హోదా పొందాలంటే ఆ భాషకు వెయ్యేళ్లకు పైగా సాహిత్య చరిత్రతోపాటు.. 1500 ఏళ్ల భాషా చరిత్ర, స్వతంత్రమైందనే పేరు కావాలి. ఈ నేపథ్యంలో క్రీ.శ.931లో నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన పంపన రచించిన ఆది పురాణం, విక్రమార్జున విజయం చూపించి మన భాషాసాహిత్యానికి 1,070 సంవత్సరాల ప్రాచీనచరిత్ర ఉన్నట్లు నిరూపించారు. పురావస్తుశాఖ తవ్వకాల్లో కరీంనగర్‌ జిల్లాకు చెందిన కోటిలింగాలలో లభించిన ఆధారాలు క్రీ.పూ.2, 3 శతాబ్దాలకు చెందినవని.. పెద్దపల్లి సమీపంలోని ధూళికట్టలో కనుగొన్న బుద్ధుడి స్తూపం క్రీ.పూ. రెండో శతాబ్దానికి చెందినదని, వీటిని బట్టి మన భాషాచరిత్రకు 1500 ఏళ్లకు పైగానే చరిత్ర ఉందని గట్టి ఆధారాలు చూపించగలిగాం. ఫలితంగా తెలుగు ప్రాచీన హోదాకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది.


ఉపరాష్ట్రపతి చొరవతో...

రాష్ట్ర విభజనకు ముందే తెలుగుకు విశిష్ట భాష హోదా దక్కడంతో ఇందుకు సంబంధించిన జాతీయ కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. అంతలో రాష్ట్రవిభజన కారణంగా ఈ విషయం మరుగున పడింది. ఈ సమయంలో కేంద్రప్రభుత్వం జాతీయకేంద్రాన్ని మైసూరులో ఏర్పాటుచేసింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మైసూరు వెళ్లినప్పుడు దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేంద్ర మానవ వనరులశాఖ మంత్రితో మాట్లాడారు. ఈ కేంద్రాన్ని త్వరగా ఏర్పాటు చేయాలన్న ఆయన సూచనతో ప్రాచీన భాషా కేంద్రాన్ని నెల్లూరులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నెల్లూరులోని స్వర్ణభారత్‌ ట్రస్టు ఈ కేంద్రానికి అద్దె లేకుండా భవనాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఫలితంగా ఈ కేంద్రం స్థాపనకు మార్గం సుగమమైంది.


ఫలప్రద నిర్ణయాలతో రండి

వెంకటాచలం, న్యూస్‌టుడే: తెలుగు భాషాభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యల గురించి  చర్చించి ఫలప్రదమైన నిర్ణయాలతో ముందుకు రావాలని భాషావేత్తలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. తెలుగు వెలుగుల విస్తృతి కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భాషావేత్తలు, నిపుణులు, అభిమానులతో నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం లోని బీఎంపీటీసీ భవనంలో సోమవారం జరిగిన చర్చాగోష్ఠికి ఆయన హాజరయ్యారు. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని మైసూరు నుంచి నెల్లూరుకు తీసుకొచ్చిన నేపథ్యంలో తెలుగు భాష అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై వారితో చర్చించారు. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం పరంగా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. తర్వాత పండితులతో సహపంక్తి భోజనం చేశారు. అనంతరం అక్కడే తెలుగు సంస్కృతికి అద్దం పట్టేలా ప్రదర్శించిన భువనవిజయం నాటకాన్ని ఉపరాష్ట్రపతి తిలకించారు. కార్యక్రమంలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, శలాక రఘునాథశర్మ, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు పాల్గొన్నారు. మంగళవారం వెంకయ్యనాయుడు తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సందర్శించనున్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.