close

ప్రధానాంశాలు

ఒక పుస్తకం అంటే లక్ష..!

తెలంగాణ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ అంటే ‘వై’
మావోయిస్టుల్లోకి ముగ్గురి రిక్రూట్‌మెంట్‌
కాశీం మామ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు
రిమాండ్‌ నివేదికలో పోలీసుల వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలతో సిద్దిపేట జిల్లా ములుగు పోలీసులు ఈ నెల 18న అరెస్టు చేసిన ఓయూ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ చింతకింది కాశీం అలియాస్‌ కార్తిక్‌ రిమాండ్‌ నివేదికలో పోలీసులు సంచలన అంశాలు నమోదుచేశారు. రహస్య(కోడ్‌) భాషలో మావోయిస్టులకు సమాచారం చేరవేయడం దగ్గర్నుంచి, నిధుల వసూళ్లు, యువతను మావోయిస్టు పార్టీలో చేరే దిశగా ప్రేరేపిండం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వాటిలోని ముఖ్యాంశాలివీ..

118 డాక్యుమెంట్లు.. 163 సీడీల స్వాధీనం
‘‘ఉస్మానియా వర్సిటీలోని కాశీం ఇంట్లో సోదాల విషయమై రిజిస్ట్రార్‌ గోపాల్‌రెడ్డికి ముందే సమాచారం అందించాం. సోదాల్లో 118 డాక్యుమెంట్లు, 163 సీడీలు, 5 డిజిటల్‌ వీడియో క్యాసెట్లు, 44 జీబీల సామర్థ్యం గల నాలుగు పెన్‌డ్రైవ్‌లు, 8జీబీ మెమొరీ కార్డులు స్వాధీనం చేసుకున్నాం.

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో సమావేశాలు
తెలంగాణలో ప్రస్తుతం పనిచేస్తున్న 19 ప్రజాసంఘాలు మావోయిస్టు పార్టీకి ఫ్రంటల్‌ ఆర్గనైజేషన్లుగా పనిచేస్తున్నాయి. వీటికి కాశీం సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టు సెంట్రల్‌ రీజినల్‌ బ్యూరో కార్యదర్శి మల్లోజుల వేణుగోపాల్‌, కేంద్ర కమిటీ సభ్యులు కట్కం సుదర్శన్‌, పుల్లూరి ప్రసాదరావు, రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్‌తో  సంబంధాలు కలిగి ఉన్నారు. ఫ్రంటల్‌ ఆర్గనైజేషన్ల నిర్వాహకులు వ్యాపారుల నుంచి విరాళాలు సేకరించి మావోయిస్టు పార్టీకి పంపుతున్నారు. ఆర్నెల్లకోసారి మావోయిస్టు నేతలతో సమావేశాలు జరుపుతున్నారు. ములుగు సమీపంలో 2016లో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మరణానికి కారకుడై పోలీసులకు పట్టుబడిన మందమర్రి మండలం మామిడిగట్టుకు చెందిన వ్యాపారి శ్యాంసుందర్‌రెడ్డి, కాశీం మావోయిస్టు పార్టీకి అవసరమైన కంప్యూటర్లు, ఆయుధాలు సమకూరుస్తున్నారు. సికింద్రాబాద్‌ పీజీ కళాశాల ఆచార్యుడొకరు కాశీంకు కొరియర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఉపా నిందితుల జాబితాలో కాశీం భార్య
చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద పోలీసులు తాజాగా నమోదు చేసిన కేసులో 54 మంది నిందితులున్నారు. వీరిలో పలు ప్రజాసంఘాలకు చెందిన 44 మంది, పది మంది మావోయిస్టు అగ్రనేతలున్నారు. కాశీం భార్య స్నేహలత ఈ జాబితాలో మూడో నిందితురాలు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి ఆమె తండ్రి. ఆమె సంపాదకురాలిగా ఉన్న ‘నడుస్తున్న తెలంగాణ’ మేగజైన్‌కు మావోయిస్టు పార్టీ నిధులు సమకూరుస్తోంది.

ఎన్‌క్రిప్టెడ్‌ విధానంలో సమాచారం చేరవేత
ప్రజాసంఘాల నేతలు మావోయిస్టు పార్టీ అగ్రనేతలకు లేఖలు, మెయిళ్లను ఎన్‌క్రిప్టెడ్‌ విధానంలో కొరియర్ల ద్వారా పంపిస్తున్నారు. విరాళాల తాలూకూ సమాచారంలో రూ.లక్షను ఒక పుస్తకంగా పేర్కొన్నారు. తెలంగాణ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌కు ‘వై’ అనే పేరుపెట్టారు. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టున్న నార్ల రవిశర్మ అలియాస్‌ రాహుల్‌ ఎక్కువగా సమాచారాన్ని చేరవేసేవాడు. ఆయన్ని, ఆయన భార్య బెల్లపు అనురాధ అరెస్టయిన తర్వాత ఆ బాధ్యతను కాశీం తీసుకున్నారు. పోలీసులు గుర్తించకుండా ఆయన, తన పేరును డాక్యుమెంట్లలో కార్తిక్‌గా పేర్కొన్నారు.

మావోయిస్టు పార్టీకి కేడర్‌ రిక్రూట్‌మెంట్‌
మావోయిస్టుల నియామకాల్లో కాశీం సహా ఇతర ఫ్రంటల్‌ ఆర్గనైజేషన్ల నిర్వాహకులు  కీలకపాత్ర పోషిస్తున్నారు. సూర్యాపేటకు చెందిన కొదమగండ్ల వివేక్‌ అలియాస్‌ రఘు(2015 జూన్‌ 12న ఎన్‌కౌంటర్‌లో మృతి), నారాయణపేట జిల్లాకు చెందిన అనిల్‌కుమార్‌ అలియాస్‌ సుదర్శన్‌, జగిత్యాల జిల్లాకు చెందిన రాజ్‌కుమార్‌ వీరి ప్రోద్బలంతోనే మావోయిస్టు పార్టీలో చేరారు. కాశీంపై వివిధ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఐదు కేసులున్నాయి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.