close

ప్రధానాంశాలు

భాషా పరిరక్షణ.. అందరి బాధ్యత

ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపాలి
నెల్లూరు కార్యగోష్ఠి ముగింపు సభలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఈనాడు, నెల్లూరు, వెంకటాచలం, న్యూస్‌టుడే: ‘‘భాషా పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ఆ దిశగా భాషావేత్తలు, అభిమానులు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపాలి. అప్పుడే అమ్మభాషను అభివృద్ధి చేయడానికి.. బతికించుకోవడానికి వీలవుతుంది’’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. నెల్లూరు జిల్లాలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం అక్షర విద్యాలయంలో విద్యార్థులతో మమేకమై ఆరోగ్యం-క్రమశిక్షణ ఆవశ్యకతను వివరించారు. తరువాత సరస్వతీనగర్‌లోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేష్‌ పొఖ్రియాల్‌, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో కలిసి సందర్శించారు.అనంతరం స్వర్ణభారత్‌ ట్రస్టులో ఏర్పాటు చేసిన అధ్యయన కేంద్ర అభివృద్ధి కార్యగోష్ఠి ముగింపు సభలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. తెలుగు భాషా ప్రాచుర్యం కోల్పోకుండా, దాని ఔన్నత్యాన్ని పరిపుష్టం చేయడం కోసమే అధ్యయన కేంద్రం మైసూరు నుంచి నెల్లూరుకు తరలించినట్లు వివరించారు. అధ్యయన కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలంఇచ్చిందని..భవన నిర్మాణాలకు సమయం పట్టే అవకాశముండటంతో తాత్కాలికంగా ఇక్కడ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎవరైనా ఇంతకంటే మెరుగైన భవనాలు చూపితే అక్కడికి తరలించడానికి సిద్ధమన్నారు. రాజ్యసభలోనే మాతృభాషలో మాట్లాడేందుకు అవకాశమివ్వడం.. రాజకీయాలకు అతీతంగా సభ్యుల్లో సంతోషాన్ని నింపిందని గుర్తుచేశారు. అధ్యయన కేంద్రం ఏర్పాటుపై అభినందనలు తెలుపుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ లేఖ రాశారని.. తమకూ ఓ కేంద్రాన్ని ఇవ్వాలని కోరిన విషయాన్ని ప్రస్తావించారు. అధ్యయన కేంద్రం వెబ్‌సైట్‌ను ప్రారంభించి, పుస్తకాలను ఆవిష్కరించారు.

శబ్దాల్లోనే శక్తి: రమేష్‌ పోఖ్రియాల్‌
శబ్దాల్లోనే శక్తి ఉంటుందని.. మంచి, చెడుల్లో ఏది చెబితే అదే ప్రతిక్రియ వస్తుందని కేంద్ర మంత్రి రమేష్‌ పొఖ్రియాల్‌ అభిప్రాయపడ్డారు. కొత్త శిక్ష నీతి తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోందని.. మాతృభాషల్లోనే శిక్షణ ఉండాలన్నది దాని లక్ష్యమన్నారు. ప్రాచీన అధ్యయన కేంద్రం అభివృద్ధికి, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఎన్‌ఐఓటీ, ఎన్‌సీఈఆర్టీ నెలకొల్పేందుకు కృషి చేస్తామని చెప్పారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ మాట్లాడుతూ.. మాతృభాష పరిరక్షణకు నడుం కట్టడం శుభపరిణామమన్నారు. ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం తెలుగుజాతి విశిష్టతపై పాట పాడారు. కార్యక్రమంలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, మండలి బుద్ధప్రసాద్‌, జొన్నవిత్తుల, భువనచంద్ర, వెన్నెలకంటి, దీపావెంకట్‌, ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.


తెలుగు వెలుగులు విరాజిల్లాలంటే ..

‘తెలుగు వెలుగులు విరాజిల్లాలంటే అమ్మ భాషకు ఆధునిక హంగులు అద్దాలి. కన్నడ నేలపై ఉన్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం తిక్కన నడయాడిన సింహపురి గడ్డపైకి తీసుకురావడం చరిత్రాత్మకం. ఇందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన కృషి ప్రశంసనీయం. ఈ తెలుగు కేంద్రం మరింత అభివృద్ధి చెందాలంటే కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని పలువురు భాషా ప్రముఖులు నివేదించారు. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం చేపట్టాల్సిన కార్యక్రమాలపై  నెల్లూరులో నిర్వహించిన ప్రత్యేక కార్యగోష్ఠిలో వారు అభిప్రాయాలను వెల్లడించారు. దీనిపై నివేదికను మంగళవారం ఉపరాష్ట్రపతికి అందించారు.

* దేశంలోని తెలుగు పండితుల వివరాలు సేకరించాలి. ప్రాచీన తెలుగు రచయితల వివరాలతో కూడిన పట్టిక తయారుచేసి అంతర్జాలంలో అందుబాటులో ఉంచాలి. దేశంలోని గ్రంథాలయాల్లో ఉన్న తెలుగు గ్రంథాల వివరణాత్మక పట్టికలను తయారుచేయాలి. ప్రాచీన తెలుగు సాహిత్యాభిరుచిని పెంపొందించేందుకు శిక్షణ శిబిరాలు ఏర్పాటుచేసి విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకుల్లో అవగాహన కలిగించాలి. ప్రాచీన రచయితల గురించి డాక్యుమెంటరీ తయారుచేయాలి. ముఖ్యమైన ప్రాచీన గ్రంథాలన్నింటినీ సరళానువాదం చేయించాలి. అముద్రిత ప్రాచీన సాహిత్యాన్ని వెలుగులోకి తేవాలి. సమగ్ర తెలుగు నిఘంటువు నిర్మాణానికి పూనుకోవాలి. ప్రాచీన తాళపత్రాలు, రాత పత్రాల్లో ఉన్న సాహిత్యాన్ని వెలుగులోకి తేవాలి.
* మాతృ భాషలో తెలుగు అధ్యయన సంస్థను రూపొందించుకోవాలి. నుడికారాలపై ప్రత్యేక అధ్యయనం, నిఘంటునిర్మాణంపై దృష్టిపెట్టాలి.
* ప్రాచీన భాష పద విశ్లేషిణి, ఆధునిక తెలుగులో పరివర్తనం, పద్య, గద్య, వచన, శాసన, జానపద గ్రంథాల సేకరణ, పద ప్రయోగ సూచికలు అంతర్జాలంలో అందుబాటులో ఉండేలా చొరవ తీసుకోవాలి.


ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.