close

ప్రధానాంశాలు

తెలంగాణకు ఉజ్వల భవిత

పెట్టుబడులకు అద్భుత అవకాశాలు
ఆవిష్కరణలు, సుస్థిర ప్రగతి, మౌలిక వసతుల సూత్రంతో దేశం, రాష్ట్రాలు బలోపేతం
దావోస్‌ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా తెలంగాణకు  ఉజ్వల భవిష్యత్తు ఉందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. పెట్టుబడులకు అద్భుత అవకాశాలున్నాయని, పలు రంగాలు పురోగతిని సాధిస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో తాము పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా చక్కటి ప్రోత్సాహకాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. దావోస్‌ పర్యటనలో భాగంగా మంగళవారం ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సీసీఐ, సీఎన్‌బీసీటీవీ18 ఆధ్వర్యంలో ‘పెట్టుబడులు, ఆవిష్కరణల దేశాలు-భారత్‌’ అంశంపై; కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌- ఏఐ) నాయకత్వం అంశంపై జరిగిన చర్చాగోష్ఠులలో ఆయన మాట్లాడారు.  భారత్‌తో పాటు అన్ని రాష్ట్రాలు బలోపేతం కావడానికి ఆవిష్కరణలు, సుస్థిర వృద్ధి, మౌలిక వసతులు అనే మూడు సూత్రాలను పాటించాలని కేటీఆర్‌ సూచించారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో చక్కటి వ్యాపార అవకాశాలున్నాయని వివరించారు. ‘‘ఆవిర్భవించిన ఆరేళ్లలోనే తెలంగాణ చరిత్రను సృష్టించింది. సరళతర వాణిజ్య నిర్వహణలో అగ్ర స్థానంలో నిలిచింది. ఔషధ, వైమానిక రంగాల్లో ప్రథమ స్థానంలో, ఐటీలో ద్వితీయ స్థానంలో ఉంది. జీవశాస్త్రాలు, ఔషధ రంగాలలో దేశానికి కేంద్ర స్థానంగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఔషధ నగరిని నిర్మిస్తున్నాం. వైద్య పరికరాల ఉత్పత్తి పార్కును ప్రారంభించాం. రాష్ట్ర పారిశ్రామిక విధానం, అందులోని టీఎస్‌ఐపాస్‌ అత్యుత్తమమైనవిగా గుర్తింపు పొందాయి. దిగ్గజ సంస్థలు అమెరికా తర్వాత తమ ప్రాంగణాలను తెలంగాణలోనే ఏర్పాటు చేస్తున్నాయి. నివాసానికి అత్యుత్తమ నగరంగా గత అయిదేళ్లుగా హైదరాబాద్‌ గుర్తింపు పొందుతోంది. ప్రపంచంలోని 130 నగరాల్లో అత్యంత డైనమిక్‌ నగరంగా హైదరాబాద్‌ని స్థిరాస్తి దిగ్గజ సంస్థ జేఎల్‌ఎల్‌ ఎంపిక చేసింది. నైపుణ్యం కలిగిన మానవ వనరులను వినియోగిస్తున్నాం. ప్రపంచస్థాయి ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నాం. అంకురాల అభివృద్ధి కోసం దేశంలోనే అతి పెద్ద ఇంక్యుబేటర్‌ టీహబ్‌.. భారతదేశపు అతిపెద్ద హార్డ్‌వేర్‌ ప్రోటోటైపింగ్‌ కేంద్రం టీవర్క్స్‌.. నైపుణ్య శిక్షణ కోసం టాస్క్‌.. ఉపగ్రహ సమాచార మార్పిడి, సమాచార సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి సాఫ్ట్‌ నెట్‌... ప్రతి ఇంటికి ఇంటర్‌నెట్‌ సౌకర్యానికి ఫైబర్‌గ్రిడ్‌ వంటి భారీ ప్రాజెక్టులను నిర్వహిస్తున్నాం. ఆవిష్కరణలను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నాం.

కృత్రిమ మేధ.. ఆధునిక సాంకేతిక విప్లవం
ఆధునిక సాంకేతిక విప్లవమైన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇప్పుడు ప్రభుత్వాలకు, పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు తప్పనిసరిగా మారింది. ఇది లేకుండా ఏ వ్యాపారం జరగదు. ప్రతి వ్యూహానికి ఇది అవసరమే. దీని ప్రాధాన్యాన్ని గుర్తించి 2020ని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ నామ సంవత్సరంగా గుర్తించాం. ప్రపంచంలోని 25 ఏఐ కేంద్రాల్లో అగ్రస్థానం పొందేందుకు కార్యాచరణ చేపట్టాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మార్చే శక్తి కృత్రిమ మేధకు ఉంది. పౌరసేవలు, వస్తు పంపిణీ, రద్దీ నియంత్రణ, నేరగాళ్ల పట్టివేత, శాంతిభద్రతల నియంత్రణకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది’’ అని కేటీఆర్‌ వివరించారు.


పారిశ్రామిక సంస్థల అధిపతులు, సీఈవోలతో భేటీ


ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంగళవారం తెలంగాణ పెవిలియన్‌ను కేటీఆర్‌ ప్రారంభించారు. సింగపూర్‌ ఐటీ, వాణిజ్య వ్యవహారాల మంత్రి ఈశ్వరన్‌, పారిశ్రామిక సంస్థల అధిపతులు, సీఈవోలు తదితరులతో ఆయన భేటీ అయ్యారు. ప్రముఖ ఔషధ సంస్థ పిరమిల్‌ గ్రూపు ఛైర్మన్‌ అజయ్‌ పిరమిల్‌ను కలిశారు. మరో ప్రముఖ ఔషధ సంస్థ రోచె ఛైర్మన్‌ క్రిస్టోఫర్‌ ఫ్రాంజ్‌తో భేటీ అయ్యారు. ఔషధనగరిలో పెట్టుబడుల గురించి చర్చించారు. అపోలో టైర్స్‌ ఉపాధ్యక్షుడు, ఎండీ నీరజ్‌ కన్వర్‌ను తెలంగాణలో పెట్టుబడులకు కేటీఆర్‌ ఆహ్వానించారు. కార్ల్స్‌ బెర్గ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ప్లెమింగ్‌ బెసెన్‌ బాచర్‌, హెచ్‌పీ సంస్థ సీవోవో విశాల్‌లాల్‌,  పీఅండ్‌జీ దక్షిణాసియా సీఈవో, ఎండీ మాగేశ్వరన్‌ సురంజన్‌ తదితరులతో భేటీ అయ్యారు. ఔషధ, జీవశాస్త్రాలు, ఆహారశుద్ధి, ఎలక్ట్రానిక్స్‌, జౌళి తదితర రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను కేటీఆర్‌ వారికి వివరించారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.