close

ప్రధానాంశాలు

నేడే ఓట్ల లెక్కింపు

తేలనున్న 12,926 మంది అభ్యర్థుల భవితవ్యం
  27న మేయర్‌, ఛైర్‌పర్సన్‌ల ఎన్నిక
  క్యాంపులు చట్టవిరుద్ధం
  నేటి సాయంత్రం నుంచి ‘పరోక్ష ఎన్నికల’ కోడ్‌ అమలు
ఈనాడు - హైదరాబాద్‌

పురపాలక ఎన్నికల ఉత్కంఠ నేడు వీడనుంది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 120 పురపాలక సంఘాలు, 9 నగరపాలక సంస్థల ఓట్ల లెక్కింపు శనివారం జరగనుంది. రాష్ట్రంలో 2,647 మంది వార్డు సభ్యులు, 324 కార్పొరేటర్లు ఎన్నిక కానున్నారు. మొత్తం 12,926 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇప్పటికే 80 మంది వార్డు సభ్యులు, ఒక కార్పొరేటర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 27న మేయర్‌లు, డిప్యూటీ మేయర్‌లు, ఛైర్‌పర్సన్‌లు, వైస్‌ఛైర్‌పర్సన్‌ల ఎన్నిక జరగనుంది. ఒక్కో వార్డుకు సగటున నలుగురు అభ్యర్థులు పోటీపడుతుండగా డివిజన్‌లలో ఈ సంఖ్య ఐదుగా ఉంది. శనివారం మధ్యాహ్నానికి దాదాపు ఫలితాలు వెల్లడికానున్నాయి. సుమారు 10 వేల మంది ఉద్యోగులు ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొంటున్నారు. పురపాలక సంఘాల్లో దాదాపు 30 లక్షల మంది, నగరపాలక సంస్థల్లో (కరీంనగర్‌ కాకుండా) సుమారు ఎనిమిది లక్షల మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓట్లలెక్కింపు, మేయర్‌, ఛైర్‌పర్సన్‌ల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ వి.నాగిరెడ్డి, పురపాలక ఎన్నికల అథారిటీ, పురపాలకశాఖ డైరెక్టర్‌ టి.కె.శ్రీదేవి రాష్ట్ర ఎన్నికల సంఘ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

బి-ఫారం ముందే అందజేయాలి
రాష్ట్రంలో పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ వి.నాగిరెడ్డి తెలిపారు. ‘‘శుక్రవారం పోలింగ్‌ జరిగిన కరీంనగర్‌ కార్పొరేషన్‌లో ఈ నెల 29న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మేయర్‌లు, డిప్యూటీ మేయర్‌లు, ఛైర్‌పర్సన్‌లు, వైస్‌ ఛైర్‌పర్సన్‌ల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎ- ఫారం, బి-ఫారంలను ఇవ్వాలి. ఎ- ఫారంలను 26వ తేదీ 11 గంటలలోపు సంబంధిత పురపాలక కమిషనర్‌కు అందించాలి. బి-ఫారంలను 27వ తేదీ ఉదయం 10 గంటలలోపు అందజేయాలి. మేయర్‌, ఛైర్‌పర్సన్‌ల ఎన్నిక నేపథ్యంలో ప్రత్యేక ఎన్నికల కోడ్‌ శనివారం సాయంత్రం నుంచి అమల్లోకి వస్తుంది. పురపాలక సంఘాల్లో 74.4 శాతం; నగరపాలక సంస్థల్లో 58.83 శాతం ఓట్లు పోలయ్యాయి.

విప్‌ వివరాలు ఇవ్వాలి
ఎవర్ని విప్‌గా నియమించారనే వివరాలను 26వ తేదీ ఉదయం 11 గంటలలోపు సంబంధిత పురపాలక కమిషనర్‌కు అందచేయాలి. విప్‌ ఏం చేశారనే అంశాన్ని 27వ తేదీ ఉదయం 11.30 గంటలలోపు విధిగా వివరాలు ఇవ్వాలి’’ అని నాగిరెడ్డి సూచించారు.

నేటి సాయంత్రంలోపు ఎంచుకోవాలి: శ్రీదేవి
మేయర్‌, ఛైర్‌పర్సన్‌ల ఎన్నికలో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శనివారం సాయంత్రంలోపు పురపాలక సంఘం లేదా నగరపాలక సంస్థను ఎంపిక చేసుకోవాలని పురపాలకశాఖ డైరెక్టర్‌ శ్రీదేవి సూచించారు. ‘‘ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో ఒకే పురపాలక సంఘం ఉంటే ఆ ఎమ్మెల్యే ఆ పురపాలక సంఘాన్ని ఎంచుకోవాలి. ఎమ్మెల్యే పరిధిలో రెండు.. అంతకంటే ఎక్కువ పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు ఉంటే దేన్నో ఒక దాన్ని ఎంపిక చేసుకోవాలి’’ అని ఆమె వివరించారు.
* రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేల చేత ఎన్నికైన ఎమ్మెల్సీలు, నామినేటెడ్‌ ఎమ్మెల్సీలు రాష్ట్రంలో ఒక పురపాలక సంఘంలో లేదా ఒక నగరపాలక సంస్థలో సభ్యుడిగా ఉండేందుకు ఆప్షన్‌ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది.
* ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల పరిధిలోని నగరపాలక సంస్థ లేదా పురపాలక సంఘంలో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఓటు వేయవచ్చు. ఒకటి కంటే ఎక్కువ స్థానాలుంటే ఒకదాన్ని ఎంచుకోవాలి.
* పట్టభద్ర, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల నియోజకవర్గాల వారు మాత్రం వారి జిల్లాల పరిధిలో ఒకదానిలో ఓటు వేయాలి.
* లోక్‌సభ సభ్యులు తమ నియోజకవర్గ పరిధిలోని ఏదో ఒక పురపాలక సంఘాన్ని ఎంచుకోవాలి.

తొలి ఎన్నికలు కావడంతో మార్చుకునే అవకాశం
ఇప్పటికే పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో ఒక వేళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఆప్షన్‌ ఇచ్చి ఉంటే ఇప్పుడు మార్చుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న తొలి పురపాలక ఎన్నికలు కావడంతో ఈ వెసులుబాటు ఉంది. 27వ తేదీ ఓటు వేయాలనుకునేవారు వారు ఎంచుకున్నది ఏ పురపాలక సంఘమో లేదా ఏ నగరపాలక సంస్థో స్పష్టం చేయాలి. ఇప్పుడు ఆప్షన్‌ ఇవ్వని వాళ్లు 30 రోజుల్లో ఎక్కడో ఒక పట్టణ స్థానిక సంస్థలో సభ్యుడు కావాలి. లేదంటే 30 రోజుల తర్వాత ఏదో ఒక పురపాలక సంఘం లేదా నగరపాలక సంస్థను కలెక్టరే నిర్ణయించి ప్రకటిస్తారు.


మంత్రి గంగుల వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: కరీంనగర్‌ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కోడ్‌ను ఉల్లంఘించేలా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడారని భాజపా, కాంగ్రెస్‌ నాయకులు జిల్లా ఎన్నికల అధికారితోపాటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. శుక్రవారం కరీంనగర్‌లో ఓటు వేసిన అనంతరం గంగుల ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పోలింగ్‌ కేంద్రం వెలుపల  మంత్రి ‘నేను కారు గుర్తుకు ఓటేశాను’ అని చెప్పడం చట్టరీత్యా నేరమని, ఇది ఓటర్లను మభ్యపెట్టడమేనని పేర్కొన్నారు. కమలాకర్‌పై క్రిమినల్‌ కేసును నమోదు చేయాలని, ఆయన వేసిన ఓటును పరిగణనలోకి తీసుకోవద్దని కోరారు. ఇదే విషయమై మంత్రిపై భాజపా జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.


కమలాకర్‌ అంశం పరిశీలిస్తాం
ఎన్నికల సంఘం కమిషనర్‌

మంత్రి గంగుల కమలాకర్‌ ఓటు వేసినతర్వాత తాను తెరాసకు ఓటేశానని మీడియా ముందు మాట్లాడటంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ వి.నాగిరెడ్డి స్పందించారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఓటు అంశంలో గోప్యత పాటించాలని, ఎవరు దీన్ని పాటించకున్నా ఓటు రద్దు కావడంతో పాటు క్రిమినల్‌ చర్యలు ఉంటాయన్నారు.


 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.