close

ప్రధానాంశాలు

31న కోర్టుకు రావాల్సిందే

ప్రతివారం ఏదో ఒక కారణం చెబుతారు
ఈసారి హాజరు కాకపోతే తగిన ఉత్తర్వులిస్తాం
ఈడీ కేసులోనూ ఏపీ సీఎం జగన్‌కు చుక్కెదురు
సహనిందితుణ్ని అనుమతించాలన్న పిటిషన్‌ కొట్టివేత
జగన్‌ డిశ్చార్జి పిటిషన్‌పై వాదనలు
సీబీఐ కోర్టులో విచారణ

ఈనాడు, హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 31న కోర్టుకు హాజరుకావాలని శుక్రవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది. హాజరుకాకపోతే తగిన ఉత్తర్వులు జారీచేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. శుక్రవారం హాజరు నుంచి సీఆర్‌పీసీ సెక్షన్‌ 317 కింద మినహాయింపు కోరుతూ జగన్‌ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ముఖ్యమంత్రిగా ముఖ్యమైన సమావేశంలో పాల్గొనాల్సి ఉన్నందున జగన్‌ వ్యక్తిగత మినహాయింపునకు అనుమతించాలని కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన సీబీఐ కోర్టు న్యాయమూర్తి బి.ఆర్‌.మధుసూదన్‌రావు హాజరు మినహాయింపునకు ప్రతి వారం ఏదో ఒక కారణం చెబుతుంటారని, ఈనెల 31న హాజరుకావాలని, లేదంటే తగిన ఉత్తర్వులు జారీచేయాల్సి ఉంటుందన్నారు.

అక్రమాస్తుల వ్యవహారంలో మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాఖలుచేసిన కేసుల్లోనూ నిందితుడైన జగన్‌ వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని ఈడీ ప్రత్యేకహోదా ఉన్న సీబీఐ కోర్టు స్పష్టంచేసింది. ఈడీ కేసుల్లో తన తరఫున సహ నిందితులైన బ్రహ్మానందరెడ్డి, రాంగంగిరెడ్డి హాజరయ్యేందుకు అనుమతించాలంటూ జగన్‌ దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టేస్తూ ఉత్తర్వులిచ్చింది. తీవ్రమైన ఆర్థికనేరాల కేసుల్లో నిందితుడు హాజరుకావాలని, ఇతర నిందితులను అనుమతించరాదన్న ఈడీ వాదనతో ఏకీభవించింది.

మన్మోహన్‌సింగ్‌పై విచారణకు అనుమతి
వాన్‌పిక్‌ కేసులో 7వ నిందితుడైన ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ను అవినీతి నిరోధక చట్టం కింద విచారించడానికి కేంద్రప్రభుత్వం అనుమతి మంజూరుచేసింది. వాన్‌పిక్‌ కేసులో ఇతర నిందితులతో కలిసి మన్మోహన్‌సింగ్‌ కుట్రలో భాగస్వామి అయ్యాడని, వాన్‌పిక్‌ ప్రాజెక్టును, విమానాశ్రయ నిర్మాణాలను వాన్‌పిక్‌కు అప్పగించడంలో కీలకపాత్ర పోషించారని, రాయితీ ఒప్పందంలోని కీలకాంశాలను మంత్రిమండలి దృష్టికి ఉద్దేశపూర్వకంగా తీసుకెళ్లలేదని కేంద్రానికి సీబీఐ నివేదించింది. సీబీఐ రాసిన లేఖను పరిశీలించిన కేంద్రప్రభుత్వం మన్మోహన్‌సింగ్‌ను విచారించడానికి అనుమతి మంజూరుచేసింది. అయితే రాష్ట్రప్రభుత్వం అనుమతి నిరాకరించిందని, అందువల్ల దీన్ని విచారణకు పరిగణనలోకి తీసుకోరాదంటూ మన్మోహన్‌సింగ్‌ తరఫు న్యాయవాది తెలిపారు. ఐఏఎస్‌ల ప్రాసిక్యూషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా కేంద్రం నిర్ణయమే అంతిమమని సీబీఐ స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కె.సురేందర్‌ పేర్కొన్నారు. ఈ వాదనతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ మన్మోహన్‌సింగ్‌పై అవినీతి నిరోధక చట్టం కింద ఉన్న అభియోగాలను విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకున్నారు.

ఈశ్వర్‌ సిమెంట్స్‌ పిటిషన్‌ కొట్టివేత
దాల్మియా కేసులో నిందితుల జాబితా నుంచి తొలగించాలంటూ సజ్జల దివాకర్‌రెడ్డి కుటుంబానికి చెందిన ఈశ్వర్‌ సిమెంట్స్‌ దాఖలుచేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. కడప జిల్లా మైలవరం మండలం తలమంచిపట్నం, నవాబ్‌పేట గ్రామాల్లో 407.05 హెక్టార్లలో సున్నపురాతి నిక్షేపాల నిమిత్తం జయా మినరల్స్‌కు లీజు మంజూరుకాగా ఆ లీజును సజ్జల దివాకర్‌రెడ్డి కుటుంబానికి చెందిన ఈశ్వర్‌ సిమెంట్స్‌కు బదలాయించారు. అనంతరం ఈశ్వర్‌ సిమెంట్స్‌ నుంచి దాల్మియా సిమెంట్స్‌కు బదిలీచేశారు. ఈశ్వర్‌ సిమెంట్స్‌లో వాటాలను దాల్మియా సిమెంట్స్‌ కొనుగోలు చేసి, దాన్ని విలీనం చేసుకుంది. దాల్మియా సిమెంట్స్‌ నిందితుల జాబితాలో ఉన్నందున, ఈశ్వర్‌ సిమెంట్స్‌ పేరును తొలగించాలని కోరారు. కంపెనీ లేకపోయినా నేరపూరిత ప్రక్రియలో కంపెనీ పాత్ర ఉన్నందున నిందితుల జాబితా నుంచి తొలగించలేమంటూ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

జగన్‌ డిశ్చార్జి పిటిషన్‌పై ఇన్‌కెమెరా విచారణ
జగతి పబ్లికేషన్స్‌లో బలవంతంగా, మోసపూరితంగా పెట్టుబడులు సేకరించారన్న ఆరోపణలతో దాఖలైన అభియోగపత్రంలో తనను కేసు నుంచి తొలగించాలంటూ ప్రధాన నిందితుడైన వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దాఖలుచేసిన డిశ్చార్జి పిటిషన్లపై సీబీఐ కోర్టు శుక్రవారం రహస్య విచారణ (ఇన్‌కెమెరా ప్రొసీడింగ్స్‌) చేపట్టింది. జగన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి.. ఈ వ్యవహారంలో జగన్‌ పాత్ర లేదని చెప్పారు. ఈ కేసు తదుపరి విచారణ ఈనెల 31కు వాయిదాపడింది. ఈ కేసులో ఇతర నిందితులైన ఎంపీ విజయసాయిరెడ్డి, ఐఏఎస్‌లు మన్మోహన్‌సింగ్‌, వై.శ్రీలక్ష్మి తదితరులు హాజరయ్యారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.