close

ప్రధానాంశాలు

విశ్వవేదికపై తెలంగాణ ఘనత

అయిదు సంస్థలతో భారీ ఒప్పందాలు
పెట్టుబడులు, ఉపాధి కల్పనకు ఉపయుక్తం
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సూచనలను రాష్ట్రంలో అమలు చేస్తాం
మున్ముందు మరిన్ని విదేశీ పర్యటనలు
‘ఈనాడు’ ప్రత్యేక ఇంటర్వ్యూలº కేటీఆర్‌
ఈనాడు - హైదరాబాద్‌

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పలు దేశాల ప్రధాన మంత్రులు, కేంద్ర మంత్రులు, మేధావులు, కంపెనీల అధిపతులు, పారిశ్రామిక దిగ్గజాలతో కలిసి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనడం గర్వకారణంగా, రాష్ట్రానికి దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. దీని ద్వారా  విశ్వవేదిక మీద రాష్ట్ర ఘనతను చాటే అవకాశం లభించిందని అన్నారు. వివిధ దేశాలకు రాష్ట్రంలోని సానుకూలతలను వివరించడంతో పాటు ప్రస్తుతం ఉన్న సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి, పెట్టుబడులను విస్తరించడానికి ఉపయోగపడిందన్నారు. వేదికలో అయిదు ప్రసిద్ధ సంస్థలతో పరిశ్రమల స్థాపనకు ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. మరిన్ని పరిశ్రమలు రాష్ట్రానికి రానున్నాయని చెప్పారు. సదస్సు ద్వారా తాను ఎంతో నేర్చుకున్నానని, వాటిని రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పారు. సదస్సుకు ఆహ్వానం ఒకెత్తు  కాగా... ప్రధానులు, కేంద్ర మంత్రులకు మాత్రమే ఉద్దేశించిన ప్రపంచ ఆర్థిక నాయకుల భేటీలో రాష్ట్ర మంత్రినైన తనకు పాల్గొనే అవకాశం దక్కడం నిజంగా అదృష్టమన్నారు.  ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ముగిసిన అనంతరం ఆయన శుక్రవారం దావోస్‌ నుంచి ‘ఈనాడు’కు ఫోన్‌లో ప్రత్యేక ఇంటర్య్వూ ఇచ్చారు.

దావోస్‌ పర్యటన ఎలా సాగింది?
అనుకున్న దాని కంటే గొప్పగా, విజయవంతంగా సాగింది. 30కి పైగా అంతర్జాతీయ సంస్థలతో ముఖాముఖి భేటీలు జరిగాయి. ప్రధానులు, మేధావులతో కలిసి చర్చాగోష్ఠుల్లో పాల్గొన్నాను. ఇందులో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్రతి సమావేశంలో ఏదో ఒక సందర్భంలో తెలంగాణ ప్రస్తావన వచ్చింది.

దావోస్‌ నుంచి పుర ఎన్నికలను పర్యవేక్షించారు. మీ అంచనాలేమిటి?
నగరపాలికలు, పురపాలికల్లో భారీ విజయాలను సాధిస్తాం. ప్రజలు మా వెంటే ఉన్నారు. కేసీఆర్‌ సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆదరించారు. మాపై పూర్తిస్థాయి నమ్మకంతో మరోసారి ఎన్నికల్లో పట్టం కట్టనున్నారని విశ్వసిస్తున్నా.

విదేశాల నుంచి తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి ఎలా ఉంది?
కేటీఆర్‌: సదస్సులో పిరమల్‌తో పాటు మరో నాలుగు సంస్థలతో భారీ పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాం. పిరమల్‌ వివరాలను ఇప్పటికే వెల్లడించాను. ఒకదాని తర్వాత ఒకటి చొప్పున ఫిబ్రవరిలో మిగిలిన నాలుగింటి వివరాలను తెలియజేస్తా. దీంతో పాటు ఇప్పటికే పరిశ్రమలను స్థాపించిన పలు సంస్థలు వాటిని విస్తరించడానికి నిర్ణయించాయి. మరికొన్ని పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను స్థాపించనున్నాయి. దాదాపు పది దేశాల మంత్రులు తెలంగాణకు రావడానికి ఆసక్తి చూపారు.

పెట్టుబడులు కాక సదస్సు ద్వారా ఇతర ప్రయోజనాలేమైనా ఉన్నాయా?
పెట్టుబడులు అనేది ఒక అంకం మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత పరిణామాలపై లోతైన చర్చ జరిగింది. సాంకేతిక విప్లవంగా భావించే కృత్రిమ మేధ పైనే 20 సమావేశాలు జరిగాయి.  సింథటిక్‌ బయాలజీ. క్వాంటమ్‌ కంప్యూటింగు వంటివాటిపైనా చర్చించారు. వాతావరణ మార్పులు, భవిష్యత్తులో మానవాళికి ముప్పుగా పరిణమించే అంశాలు ప్రస్తావనకొచ్చాయి. ఈ విషయాల్లో ప్రపంచ దేశాల పరస్పర సహకారంపై  విస్తృత చర్చలు జరిగాయి. వాతావరణ మార్పు అందరినీ ఆందోళన పరుస్తోంది. ఒకవైపు సముద్రాలు వేడెక్కుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో చలే లేదు. ఎండాకాలం మాదిరిగా ఉంది. వీటన్నింటిపై పరిశోధకులు, మేధావులు, పాలకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

కేంద్ర పరిశ్రమల మంత్రి పియూష్‌ గోయల్‌తో చర్చించిన అంశాలేమిటి?
వేదికకు నేరుగా హాజరైనా నేను భారతదేశ ప్రతినిధినే. పియూష్‌తో కలిసి సమావేశాలు, చర్చల్లో పాల్గొన్నాను. భారతీయులుగా దేశ ప్రయోజనాల కోసం వివిధ అంశాలపై సానుకూలంగా చర్చించాం. వచ్చే కేంద్ర బడ్జెట్‌లో చేపట్టాల్సిన అంశాల గురించి సూచనలు ఇచ్చాను. ‘‘తెలంగాణ ప్రభుత్వం 20 వేల ఎకరాల్లో ఔషధనగరిని, దేశంలోనే భారీదైన మెగా జౌళి పార్కును ఏర్పాటు చేస్తోంది. వీటికి సంబంధించిన విధానాలు కేంద్రం వద్ద లేవు. వాటిని వెంటనే రూపొందించి, రాష్ట్రాలకు అవకాశాలివ్వాలి. చైనాలో పారిశ్రామిక పార్కులు 70 వేల ఎకరాల్లో ఉంటాయి. అన్ని పరిశ్రమలు ఒకే చోట ఉండడం అన్ని విధాలా మేలు. మా ఔషధనగరి అలాంటిదే. వాటిని ప్రోత్సహించాలి’’ అని పియూష్‌కు వివరించాను. హైదరాబాద్‌-వరంగల్‌ పారిశ్రామిక కారిడార్‌కు నిధులివ్వాలని అభ్యర్థించాను.

తెలంగాణలో ఎన్నికల కోడ్‌ ముగుస్తోంది. కొత్త ప్రాజెక్టులు ఎప్పుడు ప్రారంభిస్తారు?
ఔషధనగరికి అతి త్వరలో శంకుస్థాపన చేస్తాం. మెగా జౌళిపార్కులో త్వరలోనే పరిశ్రమలు ప్రారంభమవుతాయి. టీవర్క్స్‌, ఇమేజ్‌ సౌధం సిద్ధమవుతోంది. 2020ని కృత్రిమ మేధ నామ సంవత్సరంగా ప్రకటించాం. దీని కార్యక్రమాలను ప్రారంభిస్తాం.

సదస్సులోని అంశాలను ఏమైనా రాష్ట్రంలో ఆచరించవచ్చా?
వాతావరణ మార్పులకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన హరితహారం, మిషన్‌ కాకతీయ గురించి చెప్పాను. సదస్సులో వచ్చిన మిషన్‌ పానీ నినాదంలో మన మిషన్‌ భగీరథ స్ఫూర్తి ఉంది. ఇవిగాక మరిన్ని ఆచరణలో పెడతాం. పర్యావరణ పరిరక్షణ ఇతర అంశాలను ఔషధనగరి, జౌళి పార్కు ప్రాజెక్టుల్లో అమలు చేస్తాం.

మున్ముందు మరిన్ని విదేశీ పర్యటనలకు ప్రణాళిక ఏమైనా ఉందా?
రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్‌, జౌళి, ఆహారశుద్ధి, జీవశాస్త్రాలు, ఐటీ రంగాల్లో విస్తృతంగా ఉపాధి అవకాశాలున్నాయి. వీటికి సంబంధించిన పరిశ్రమలు, పెట్టుబడులను సాధించడానికి ఆయా రంగాల్లోని సంస్థలను రాష్ట్రానికి ఆహ్వానించాలి. ఇందుకోసం మరిన్ని దేశాలలో పర్యటిస్తా.

ఆర్థిక మాంద్యం నేపథ్యంలో పారిశ్రామిక రంగం భవిష్యత్తుపై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి?
మాంద్యాన్ని అధిగమించే మార్గాలను సదస్సు తెలియజెప్పింది. భారత్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇందుకోసం ప్రస్తుత విధానాల్లో సంస్కరణలు, మార్పులు చేపట్టాలని అంతా సూచించారు. సరళతర వ్యాపార నిర్వహణలో చైనా కంటే భారత్‌ వెనుకంజలో ఉండడానికి కారణాలను నేను ఈ సందర్భంగా చెప్పాను. దేశంలో క్రియాశీలంగా ఉండే రాష్ట్రాలకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని సూచించాను. ‘‘పరిశ్రమల నిర్మాణ వ్యయాన్ని తగ్గించాలి. రైల్వే లైన్లు, జాతీయ రహదారులు, విమానాశ్రయాలు పెరగాలి. వివిధ పద్దుల కింద గల నగదు నిల్వలను దేశంలో మౌలిక వసతులకు వినియోగించాలి. ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని చెప్పా.


ముగిసిన దావోస్‌ పర్యటన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ అయిదు రోజుల దావోస్‌ పర్యటనను ముగించుకొని శుక్రవారం రాత్రికి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ నెల 20న దావోస్‌కు వెళ్లిన ఆయన 21 నుంచి 24 వరకు జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్నారు. అనేక కంపెనీల అధిపతులు, సీఈవోలు, వివిధ దేశాల మంత్రులతో సమావేశమయ్యారు. సదస్సులో తెలంగాణ ప్రత్యేక పెవిలియన్‌ని ఏర్పాటు చేశారు. మంత్రి వెంట ఈ బృందంలో పరిశ్రమలు, ఐటీశాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌ దిలీప్‌ కొణతం, టీహబ్‌ సీఈవో రవి నారాయణ్‌లు పాల్గొన్నారు.


ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.