close

ప్రధానాంశాలు

నెక్స్ట్‌... రెండుసార్లు

2022-23 నుంచి అమలు చేయాలి..
జాతీయ నిష్క్రమణ పరీక్షపై వైద్య విద్యార్థుల జాతీయ సంఘం విజ్ఞప్తి
ఈనాడు - హైదరాబాద్‌

వైద్యవిద్యలో ‘జాతీయ నిష్క్రమణ పరీక్ష (నేషనల్‌ ఎగ్జిట్‌ ఎగ్జామ్‌ - నెక్స్ట్‌)’ను రెండుసార్లు నిర్వహించాలని వైద్య విద్యార్థుల జాతీయ సంఘం విజ్ఞప్తి చేసింది. 2022-23 వైద్య విద్య సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురావాలని కోరింది. ఎంబీబీఎస్‌  విద్య అనంతరం ‘నెక్ట్స్‌’ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వైద్యవిద్యార్థులు.. తాజాగా భారతీయ వైద్య మండలికి అనుబంధంగా జాతీయ స్థాయిలో అన్ని వైద్యకళాశాలల విద్యార్థులతో (ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ మెడికల్‌ స్టూడెంట్స్‌ నెట్‌వర్క్‌) సంఘాన్ని స్థాపించారు. నెక్స్ట్‌ నిర్వహణపై అభిప్రాయాలు, సూచనలు కోరుతూ ఇటీవల జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ఉన్నతాధికారులు వేర్వేరు సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఈ సంఘం పలు అంశాలను ప్రతిపాదించింది.

ప్రస్తుతం ఎంబీబీఎస్‌ తుది సంవత్సరం విద్యార్థులు నెక్స్ట్‌లో ఉత్తీర్ణులైతే.. పీజీ వైద్యవిద్య ప్రవేశ పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదని, నేరుగా వైద్య మండలిలో తమ సమాచారాన్ని నమోదు చేసుకొని వైద్యవృత్తిని నిర్వహించుకోవచ్చని ఎన్‌ఎంసీ బిల్లులో పొందుపర్చారు. ఈ బిల్లులో పొందుపర్చిన అంశాల్లో కొన్నింటిని తప్పనిసరిగా మార్చాలని, లేదంటే వైద్యవిద్యార్థులపై ఒత్తిడి పెరిగిపోతుందని తెలంగాణ వైద్య విద్యార్థుల సంఘం సమన్వయకర్త డాక్టర్‌ జి.శ్రీనివాస్‌ తెలిపారు. అన్ని వర్గాలతో చర్చించి ఈ విషయంపై ఎన్‌ఎంసీ తుది నిర్ణయం వెల్లడిస్తుందని ఆయన చెప్పారు.


వైద్యకళాశాలల విద్యార్థుల సంఘం ప్రతిపాదనల్లో ముఖ్యమైనవి..

* ఎంబీబీఎస్‌ తుది సంవత్సరం పార్ట్‌ 2 పరీక్షలను వేర్వేరు విశ్వవిద్యాలయాల్లో వేర్వేరు తేదీల్లో నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఏకకాలంలో నిర్వహించే  నెక్స్ట్‌కు సన్నద్ధమవడం వైద్యవిద్యార్థులకు కష్టం. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పార్ట్‌ 2 పరీక్షలను ఒకే తేదీల్లో (జనవరి రెండో వారంలో) నిర్వహించేలా ఆదేశాలివ్వాలి. సప్లిమెంటరీ పరీక్షలను దేశవ్యాప్తంగా ఫిబ్రవరిలో నిర్వహించాలి.
* పార్ట్‌ 2 ఫలితాల వెల్లడి అనంతరం మార్చిలో నెక్స్ట్‌-1 నిర్వహించాలి.
* నెక్స్ట్‌-1లో ఉత్తీర్ణులైన వైద్యవిద్యార్థులు ఏడాది పాటు ‘అనుభవపూర్వక శిక్షణ (ఇంటర్న్‌షిప్‌)’కు అర్హులవుతారు.
* ఇంటర్న్‌షిప్‌ను విజయవంతంగా పూర్తిచేసుకున్న విద్యార్థులకు ఏటా ఏప్రిల్‌లో ‘నెక్స్ట్‌-2’నిర్వహించాలి.
* నెక్స్ట్‌-2 పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే.. పీజీ వైద్యవిద్య ప్రవేశాలకు అర్హత సాధించడంతో పాటు ఎంబీబీఎస్‌ అర్హతతో వైద్యవృత్తిని కొనసాగించడానికి వైద్య మండలిలో నమోదుకు అవకాశం కల్పించాలి.
* అయితే పీజీ వైద్యవిద్యలో ప్రవేశాలకు అర్హతగా నెక్స్ట్‌-1 మార్కులనే పరిగణనలోకి తీసుకోవాలి. నాలుగున్నరేళ్ల వైద్యవిద్యాభ్యాసం అనంతరం నిర్వహించే నెక్స్ట్‌-1 పరీక్షలో విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి.
* నెక్స్ట్‌-1లో సాధించిన మార్కులను మూడేళ్ల పాటు పీజీ వైద్యవిద్య ప్రవేశాల్లో పాల్గొనడానికి పరిగణనలోకి తీసుకోవాలి.
* తొలిసారి సాధించిన నెక్స్ట్‌-1 మార్కుల కంటే తర్వాత సంవత్సరం (నెక్స్ట్‌-1లో) సాధించిన మార్కులు ఎక్కువగా ఉంటే.. ఆ ఎక్కువ మార్కులనే పరిగణనలోకి తీసుకోవాలి. ఒకవేళ తగ్గితే.. ఏ ఏడాది మార్కులు ఎక్కువగా ఉంటే వాటినే పీజీ ప్రవేశాలకు అర్హతగా పరిగణించాలి.
* ఇలా ఎంబీబీఎస్‌ అనంతరం ఏటా నెక్స్ట్‌-1 పరీక్ష రాసే అవకాశాన్ని వైద్యవిద్యార్థులకు కల్పించాలి.
* రెండు పరీక్షలు రాయడం విద్యార్థులకు ఇబ్బంది కలిగించేదే అయినా.. నెక్స్ట్‌లోని కాఠిన్యత దృష్ట్యా విద్యార్థుల సౌలభ్యానికి ఈ రెండు పరీక్షల విధానాన్ని తప్పనిసరి చేయాల్సిందే.
* నెక్స్ట్‌-1 పరీక్షను అఖిల భారత స్థాయిలో ఆన్‌లైన్‌లో నిర్వహించాలి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.