close

ప్రధానాంశాలు

మార్చి 3.. ఉదయం 6..

 నిర్భయ దోషుల ఉరికి తాజా ముహూర్తం
 మరోసారి వారెంట్లు జారీచేసిన దిల్లీ న్యాయస్థానం
 ఇంకా ఆలస్యమైతే బాధితుల హక్కు అపవిత్రమవుతుంది: కోర్టు

దిల్లీ: నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమెను హతమార్చిన దోషులను మార్చి 3న ఉదయం ఆరు గంటలకు ఉరి తీసేందుకు ముహూర్తం ఖరారైంది. దిల్లీ అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి ధర్మేందర్‌ రాణా సోమవారం ఈ మేరకు తాజాగా వారెంట్లు జారీ చేశారు. ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ (32), పవన్‌గుప్తా (25), వినయ్‌కుమార్‌ శర్మ (26), అక్షయ్‌కుమార్‌ (31)ల ఉరితీతకు వారెంట్లు ఇవ్వడం ఇది మూడోసారి. చట్టపరమైన అన్ని అవకాశాలనూ వారు ఇంకా వినియోగించుకోనందువల్ల తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఉరితీతపై స్టే విధిస్తున్నట్లు న్యాయస్థానం గత నెల 31న ప్రకటించిన విషయం తెలిసిందే. ఉరి అమలు ఉత్తర్వుల కోసం విచారణ న్యాయస్థానాన్ని ఆశ్రయించే స్వేచ్ఛను సుప్రీంకోర్టు ఇచ్చిన దరిమిలా తాజా వారెంట్లు జారీ చేయాలంటూ నిర్భయ తల్లిదండ్రులు, దిల్లీ ప్రభుత్వం చేసిన అభ్యర్థనలపై వాదనల్ని న్యాయస్థానం ఆలకించింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఉరి శిక్ష అమలును ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా అది బాధితులకున్న ‘సత్వర న్యాయ హక్కు’ను అపవిత్రం చేయడమే అవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. దోషుల మెడకు ఉరితాళ్లు బిగించి, చనిపోయేవరకు ఉరి తీయాలని స్పష్టంగా తెలిపింది.

న్యాయవాదిని మార్చుకున్న ముకేశ్‌
న్యాయవాది వృందాగ్రోవర్‌ తనకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకోవడం లేదని నిందితుల్లో ఒకడైన ముకేశ్‌ తెలపడంతో ఆమె బదులు రవి ఖాజి అనే న్యాయవాదిని న్యాయస్థానం నియమించింది. తిహార్‌ కారాగారంలో వినయ్‌కుమార్‌ శర్మ నిరాహార దీక్షకు దిగి, తర్వాత దానిని విరమించుకున్నాడని అతని తరఫు న్యాయవాది న్యాయస్థానంలో చెప్పారు. కారాగారంలో అతనిపై దాడి జరగడంతో తలకు గాయాలయ్యాయని, తీవ్రమైన మానసిక అనారోగ్యంతో ఉన్నాడని, ఉరిశిక్ష అమలుకు వీల్లేదని వాదించారు. దానిపై న్యాయమూర్తి స్పందిస్తూ- మానసిక ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు నివేదిక ఇచ్చిన దరిమిలా సుప్రీంకోర్టు ఇదివరకే ఆ వాదనను తోసిపుచ్చిందని చెప్పారు.

క్యూరేటివ్‌ పిటిషన్‌ వేయనున్న పవన్‌
దోషులు నలుగురిలో ఇప్పటివరకు పవన్‌ ఒక్కడే సుప్రీంకోర్టులో క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేయలేదు. రాష్ట్రపతి నుంచి క్షమాభిక్షకూ అభ్యర్థించలేదు. ఆ రెండు అవకాశాలనూ పవన్‌ వినియోగించుకోవాలనుకుంటున్నట్లు అతని తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుతో సంతృప్తి చెందడం వల్లనో, కోర్టు విచారణను జాప్యం చేయాలన్న ఉద్దేశంతోనో పవన్‌ ఇంతవరకు పిటిషన్‌ వేసినట్లు లేదని కోర్టు వ్యాఖ్యానించింది. (పవన్‌) సోమరిపోతులా వ్యవహరిస్తూ న్యాయాన్ని ఓడించాలని చూస్తే అనుమతించేది లేదని స్పష్టం చేసింది. దోషులకు రాజ్యాంగం కల్పించిన హక్కుల విషయంలో ఎలాంటి వివాదం లేదంది.
* రాష్ట్రపతి నుంచి క్షమాభిక్ష కోసం అక్షయ్‌ మరోసారి పిటిషన్‌ సిద్ధం చేసినట్లు అతని తరఫు న్యాయవాది తెలిపారు. పేదరికం, అవగాహన లేమి కారణంగా మొదటిసారి ‘పూర్తి వాస్తవాల’ను రాష్ట్రపతి దృష్టికి తన క్లయింట్‌ తీసుకువెళ్లలేకపోయినట్లు చెప్పారు. దీనిని కోర్టు తోసిపుచ్చింది. తాజాగా అభ్యర్థన దాఖలు చేయబోతుండడం... ఉరితీత వాయిదాకు ప్రాతిపదిక కాజాలదని తేల్చిచెప్పింది.
* తాజా ఉత్తర్వులతోనైనా దోషులకు ఉరిశిక్ష పడుతుందని నిర్భయ తల్లి ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయం కోసం ఏడేళ్లుగా తాము చేస్తున్న పోరాటానికి ముగింపు లభించిందంటూ అభినందన సందేశాలు అందుతున్నాయని నిర్భయ తండ్రి చెప్పారు. ఉరి అమలయ్యేవరకు పోరాటం కొనసాగుతుందన్నారు.

ఈ సారైనా అమలయ్యేనా..
ఉరి ఈసారైనా అమలు జరుగుతుందా అనే మీమాంస పూర్తిగా తొలగిపోలేదు. సుప్రీంకోర్టులో క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలు, రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరడం అనే అవకాశాలను వినియోగించుకోనున్నట్లు పవన్‌గుప్తా తరఫు న్యాయవాది చెప్పడం దీనికి కారణం. క్షమాభిక్ష అభ్యర్థన తిరస్కరణకు గురైతే అప్పటి నుంచి 14 రోజులు ఆగాకే ఉరి తీయాలని సుప్రీంకోర్టు తీర్పు చెబుతోంది. అయితే- ఇటీవల దిల్లీ హైకోర్టు ఇచ్చిన వారం రోజుల గడువులోగా క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోని పవన్‌కు ఇప్పుడు దానిని దాఖలు చేసే హక్కు లేదని నిర్భయ తల్లిదండ్రుల తరఫు న్యాయవాది జితేందర్‌ ఝా చెప్పారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.