close

ప్రధానాంశాలు

తెరాసకే దక్కనున్న డీసీసీబీలు!

 800 సొసైటీల ఛైర్మన్‌ పదవులు ఆ పార్టీకే
 కాంగ్రెస్‌కు 68; ఇతరులకు 33
 డీసీసీబీ ఎన్నికల ప్రకటన 20కి వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: ‘జిల్లా సహకార కేంద్ర బ్యాంకు’ (డీసీసీబీ)ల్లోని పాలకవర్గ పదవులన్నీ తెరాస పార్టీకే దక్కనున్నాయి. అన్ని జిల్లాల్లో సహకార సంఘాల ఛైర్మన్‌ పదవుల్లో అత్యధికంగా ఆ పార్టీకే దక్కడంతో డీసీసీబీ ఎన్నికల్లోనూ ఆ పార్టీనే పాగా వేయనుంది. ఈ ఎన్నికకు ప్రకటన గురువారం (20న) జారీ కానుంది. సోమవారమే ప్రకటన జారీ చేస్తామని తొలుత సహకార శాఖ తెలిపింది. కానీ జిల్లాలవారీగా ఓటర్ల జాబితాలు తయారు కాకపోవడంతో వాయిదా వేసింది. ‘ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల’(ప్యాక్స్‌)కు ఛైర్మన్లుగా ఎన్నికైన వారే డీసీసీబీ పాలకవర్గాల ఎన్నికల్లో ఓటు వేయాలి. రాష్ట్రవ్యాప్తంగా 80 సొసైటీల ఛైర్మన్‌ ఎన్నికలు సోమవారం జరిగాయి. వాటి పూర్తి వివరాలు అందలేదని సహకార శాఖ తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 905 సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ కాగా 901 సంఘాల ఛైర్మన్‌ ఎన్నికలు పూర్తయ్యాయి. వీటిలో తెరాసకు 800, కాంగ్రెస్‌కు 68, ఇతరులకు 33 ఛైర్మన్‌ పదవులు దక్కాయి.

డీసీసీబీ ఎన్నికలు ఇలా...
సొసైటీల ఛైర్మన్ల నుంచి ప్రతి డీసీసీబీకి 16 మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఆ డైరెక్టర్లు బ్యాంకు ఛైర్మన్‌ను ఎన్నుకోవాలి. కొత్తగా ఏర్పడిన జిల్లాలకు బ్యాంకులను ఏర్పాటు చేయలేదు. పాత ఉమ్మడి తొమ్మిది జిల్లాలకే డీసీసీబీలున్నాయి. హైదరాబాద్‌-రంగారెడ్డి జిల్లాలకు కలిపి ఒకటే ఉంది. సొసైటీల ఛైర్మన్‌ పదవుల్లో అత్యధికం తెరాస మద్దతుదారులే దక్కించుకోవడంతో డీసీసీబీ పదవుల కోసం ఆ పార్టీలో తీవ్రమైన పోటీ నెలకొంది. తమకే పదవి ఇప్పించాలని జిల్లా మంత్రులు, ఎమ్యెల్యేలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. డీసీసీబీలకు పాలకవర్గాల ఎన్నికలు పూర్తయిన తరవాత మార్చి 5న మొత్తం తొమ్మిది బ్యాంకుల ఛైర్మన్లు కలసి ‘రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు’ (టీఎస్‌క్యాబ్‌) ఛైర్మన్‌ను ఎన్నుకుంటారు.

ఇతర సంఘాల మాటేమిటి?
ప్రతి డీసీసీబీలో 16 మంది డైరెక్టర్లు ప్యాక్స్‌ ఛైర్మన్ల నుంచి ఎన్నికవుతారు. ఇక గ్రామాల్లో ఉండే చేనేత, మత్స్య, గొర్రెల కాపరులు, పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల నుంచి నలుగురు డైరెక్టర్లు ప్రతి బ్యాంకు పాలకవర్గంలో ఉండాలి. ఈ సంఘాల పాలకవర్గాల పదవీకాలం ఎప్పుడో పూర్తయింది. వీటికి ఎన్నికలు జరగనందున పాతవారినే ఇన్‌ఛార్జులుగా కొనసాగిస్తున్నారు. అలా ఇన్‌ఛార్జులుగా ఉన్నవారికి డీసీసీబీ ఎన్నికల్లో ఓటర్లుగా అవకాశం ఇవ్వరాదని, వాటికి కూడా ఎన్నికలు పూర్తయ్యేదాకా బ్యాంకుల ఎన్నికలు వాయిదా వేయాలని రాష్ట్ర గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘ ప్రధాన కార్యదర్శి ఉడుతా మల్లేశం సహకార కమిషనర్‌ వీరబ్రహ్మయ్యకు వినతిపత్రం అందజేశారు. దీనిపై కమిషనర్‌ను వివరణ అడగ్గా డీసీసీబీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ తేదీ నాటికి ఏ సంఘానికి ఎవరు ఛైర్మన్‌గా ఉంటే వారే ఓటరుగా నమోదవుతారని, వారితోనే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఇతర సంఘాలకు ఎన్నికలు జరగలేదన్న కారణంతో డీసీసీబీ ఎన్నికలను వాయిదా వేయలేమని స్పష్టం చేశారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.