close

ప్రధానాంశాలు

అభినందనం.. హరితశోభితం

 ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ
 రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు, గవర్నర్ల అభినందనలు
 మొక్కలు నాటి వేడుకలు చేసుకున్న కార్యకర్తలు, నేతలు

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోమవారం ఆయన 66వ పుట్టినరోజు సందర్భంగా సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా అభినందనల్లో ముంచెత్తారు. మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ‘హరిత స్ఫూర్తి’ వెల్లివిరిసింది. పెద్దసంఖ్యలో మొక్కలు నాటడంతోపాటు రక్తదాన శిబిరాలు, పేదలకు సామగ్రి పంపిణీ వంటి కార్యక్రమాలను కేసీఆర్‌ అభిమానులు విరివిగా ఏర్పాటుచేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సీఎం కేసీఆర్‌కు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సుఖసంతోషాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో నిండు జీవితం గడపాలని ఆకాంక్షించారు. కేసీఆర్‌ చిరకాలం ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలంటూ ప్రధాని మోదీ సందేశం పంపించారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఫోన్‌లో సీఎంకు అభినందనలు తెలిపారు. కేసీఆర్‌కు దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, తమిళనాడు, మేఘాలయా సీఎంలు పళనిస్వామి, సీకే సంగ్మా, ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌ గవర్నర్లు ఉయికే, వీపీ సింగ్‌ బద్నోర్‌, తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు సీఎం కేసీఆర్‌కు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కేసీఆర్‌ పాలన దేశానికే ఆదర్శం: పోచారం
కేసీఆర్‌ పాలన దేశానికే ఆదర్శమని.. ఉద్యమకారునిగా తెలంగాణను సాధించిన ఆయన ఉత్తమ పరిపాలకునిగా ఖ్యాతిపొందుతున్నారని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. శాసనసభ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద స్పీకర్‌తోపాటు మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి,  ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌, భాజపా ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తదితరులు మొక్కలు నాటారు. వ్యాయామశాలను ప్రారంభించారు. ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రధాని కావాలని, మరో 30 ఏళ్లు ప్రజలకు సేవ చేయాలన్నారు. సిద్దిపేటలో ఆర్థికమంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. మడమతిప్పని పోరాటంతో రాష్ట్రం సాధించిన కేసీఆర్‌ అతితక్కువ వ్యవధిలో జల, హరిత తెలంగాణ సాకారం చేశారన్నారు. దేశం ఆశ్చర్యపోయేలా రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు తీయించారని కొనియాడారు.

తల్లిని కన్న తనయుడు కేసీఆర్‌
తెలంగాణ తల్లిని కన్న తనయుడు కేసీఆర్‌ అని, ఆయనను నాన్న అని పిలవడం తనకెంతో గర్వంగా ఉంటుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ‘‘నాకు తెలిసిన బహుముఖ ప్రజ్ఞాశాలి, ధైర్యవంతుడు, దయామయుడు, ప్రజాకర్షణ కలిగిన క్రియాశీల వ్యక్తి, నేను నాన్న అని గర్వంగా పిలిచే వ్యక్తి.. ఆయన దీర్ఘకాలం జీవించాలి. ముందుచూపుతో, నిబద్ధతతో మాలో ఇలాగే స్ఫూర్తిని నింపాలని కోరుకుంటున్నా’’ అని కేటీఆర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. సీఎం పుట్టినరోజును పురస్కరించుకొని ప్రగతిభవన్‌లోని నివాసంలో ఆయన కుటుంబసభ్యులు మొక్కలు నాటారు. కేసీఆర్‌ సతీమణి శోభ, కేటీఆర్‌, శైలిమ దంపతులు, మాజీ ఎంపీ కవిత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన పిలుపునకు స్పందించి, రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది మొక్కలు నాటారంటూ కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లి దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజల్లో పాల్గొనడంతోపాటు బాలసదన్‌లో కార్యక్రమంలో పాల్గొన్నాడు.


ప్రగతి భవన్‌లో..

పలువురు ప్రముఖులు ప్రగతిభవన్‌లో సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులు, వివిధ సంఘాల నాయకులు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. సంజీవయ్య పార్కులో హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేసిన ‘హరితహారం’లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ముఖ్యసలహాదారు రాజీవ్‌శర్మ మొక్కలు నాటారు.


తెలంగాణ భవన్‌లో..

* తెలంగాణభవన్‌లో కేక్‌ కట్‌ చేసి అందరికీ పంపిణీ చేశారు. భవన్‌ ప్రాంగణంలో మొక్కలునాటారు. రక్తదాన శిబిరం నిర్వహించారు. దివ్యాంగులకు వీల్‌ఛైర్లు, వస్త్రాలు పంపిణీ చేశారు. శాసనసభ విప్‌ బాల్కసుమన్‌, ఎమ్మెల్సీలు ఎం.శ్రీనివాస్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి  పాల్గొన్నారు.
* మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డులోని జలవిహార్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోలాటం, బతుకమ్మ, ఒగ్గుడోలు, గుస్సాడి, కొమ్ముకోయ, యక్షగానం తదితర ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్యమంత్రి బాల్యం నుంచి ఇప్పటివరకు వివిధ సందర్భాల సమాహారంతో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పేదలకు ఉచిత వైద్య శిబిరం, అన్నదానం ఏర్పాటుచేశారు. స్పీకర్‌ పోచారం, మండలి ఛైర్మన్‌ గుత్తా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, రాజ్యసభ సభ్యులు కేకే, జోగినపల్లి సంతోష్‌కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 66 కిలోల కేక్‌ను కోసి పంచిపెట్టారు.
* హైదరాబాద్‌ శివారులోని దండు మల్కాపూర్‌ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల హరిత పార్కులో టీఎస్‌ఐఐసీ, పారిశ్రామికవేత్తల సమాఖ్యల ఆధ్వర్యంలో పదివేల మొక్కలు నాటారు. రాష్ట్రంలోని పారిశ్రామికవాడల్లో సోమవారం 50 వేల మొక్కలు నాటారని టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ బాలమల్లు తెలిపారు.
* మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నేతృత్వంలో టీజీవో, టీఎన్‌జీవో నేతలు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.


పోలీసు శాఖ.. 56,872 మొక్కలు

* పోలీసుశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 56,872 మొక్కల్ని నాటారు. హైదరాబాద్‌ పేట్లబుర్జులో హోంమంత్రి మహమూద్‌ అలీ, పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కోలేటి దామోదర్‌గుప్తా, డీజీపీ కార్యాలయంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, అనిశా ప్రధాన కార్యాలయంలో ఆ శాఖ డీజీ పూర్ణచందర్‌రావు మొక్కలు నాటారు.
* రాష్ట్రవ్యాప్తంగా తమ సంఘం సభ్యులు 80 వేల మొక్కలు నాటారని పీఆర్‌టీయూ టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.కమలాకర్‌రావు తెలిపారు.
సిద్దిపేట జిల్లాలో 1.10 లక్షల మొక్కలు
* ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకలను సిద్దిపేట జిల్లాలో ప్రజలు ఉత్సాహంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 1.10 లక్షల మొక్కలు నాటారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు.. ముఖ్యమంత్రికి జన్మదిన కానుకగా శార్వరీ ఉద్యానాన్ని ప్రారంభించారు. గజ్వేల్‌ పట్టణంలో 66 కిలోల కేక్‌ను మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కట్‌ చేశారు.

 

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.