close

ప్రధానాంశాలు

కరెంటుకూ కరోనా కష్టాలు

చైనా నుంచి నిలిచిన పరికరాల దిగుమతి
  సదరన్‌ డిస్కంలో ట్రాన్స్‌ఫార్మర్ల కొరత
  ముంచుకొస్తున్న వేసవి విద్యుత్తు డిమాండ్‌ నేపథ్యంలో ఆందోళన

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) ప్రభావం విద్యుత్తు రంగంపైనా పడింది. చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే పలురంగాలు ఆర్థికంగా నష్టపోతుండగా.. తాజాగా విద్యుత్తు పరికరాల తయారీ పరిశ్రమకూ ఆ సెగ తాకింది. ట్రాన్స్‌ఫార్మర్ల(డీటీఆర్‌) తయారీలో వినియోగించే కోర్‌ మాగ్నటిక్‌ ప్లేట్లను ఎక్కువభాగం చైనా నుంచి తయారీదారులు దిగుమతి చేసుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో దిగుమతులపై నిషేధం కొనసాగుతుండటంతో కొన్నాళ్లుగా వాటికి కొరత ఏర్పడింది. దీంతో ట్రాన్స్‌ఫార్మర్ల సరఫరా తగ్గింది. వేసవిలో పెరిగే విద్యుత్తు డిమాండ్‌ను తట్టుకుని పంపిణీ చేసేందుకు వీలుగా డిస్కంలు ఏటా ముందస్తుగా అదనంగా ట్రాన్స్‌ఫార్మర్లను సిద్ధంచేసి ఉంచుతాయి. లోడ్‌ పెరిగే చోట సంబంధిత అధికారులు వాటిని ఏర్పాటు చేస్తారు. ముడి సరకు కొరతతో అవసరమైన మేరకు డీటీఆర్‌లను తయారీదారులు సరఫరా చేయలేకపోతున్నారని డిస్కంలు చెబుతున్నాయి.  మరోవైపు వేసవి సమీపిస్తుండటంతో రాష్ట్రంలో కరెంటుకు డిమాండ్‌ క్రమంగా పెరుగుతోంది. సోమవారం రాష్ట్రచరిత్రలోనే అత్యధికంగా డిమాండ్‌ 12,137 మెగావాట్లకు చేరింది.
గ్రేటర్‌ పరిధిలో వేసవిలో 160కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. అయితే, అందుకనుగుణంగా ప్రస్తుతం నిల్వలు లేవు. నగరంలోని అపార్ట్‌మెంట్లలో విద్యుత్‌ సరఫరా కోసం వాటి యాజమానులు సదరన్‌ డిస్కంకు డీడీల రూపంలో డీటీఆర్‌ల కోసం సొమ్ము చెల్లిస్తున్నారు. ముడి సరకు కొరత కారణంగా డీటీఆర్‌లను తయారీదారులు సమయానికి డిస్కంకు అందజేయకపోవడంతో.. వాటి కోసం తాము రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని యాజమానులు పేర్కొంటున్నారు. దీంతో అందుబాటులో ఉన్నవాటినే సర్దుబాటు చేసే విషయమై డిస్కం మల్లగుల్లాలు పడుతోంది. అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్లు అందుబాటులో లేకపోవడానికి కొద్దినెలలుగా చైనా నుంచి కోర్‌మాగ్నటిక్‌ ప్లేట్ల దిగుమతి ఆగిపోవడమే కారణం. మొన్నటివరకు ఆ దేశంలోని పరిశ్రమలకు సెలవు. అక్కడ ఏడాదిలో 11 నెలలే పరిశ్రమలు పనిచేస్తాయి. అనంతరం ధరల పెరుగుదల మూలంగా సరఫరా నిలిచిపోయింది. ఇప్పుడు కరోనా వైరస్‌తో మొత్తంగా దిగుమతే ఆగిపోయింది. ట్రాన్స్‌ఫార్మర్ల తయారీలో కోర్‌ మాగ్నటిక్‌ ప్లేట్లు కీలకం. ఎక్కువ వోల్టేజీతో ప్రవహించే విద్యుత్తును ఇవి తక్కువగా వోల్టేజీగా మార్చి వినియోగానికి వీలుగా పంపిణీ చేస్తాయి. ఈ కోర్‌ మాగ్నటిక్‌ ప్లేట్లను జపాన్‌ నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నా ఖరీదు ఎక్కువ. దీంతో డీటీఆర్‌ తయారీదారులు ఇన్నాళ్లుగా చైనా దిగుమతులపైనే ఆధారపడ్డారు. ‘‘డీటీఆర్‌ల కొరత ఉన్నా వేసవిలో గ్రేటర్‌లో కరెంట్‌ ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. 100 కేవీఏ సామర్థ్యం కలిగిన డీటీఆర్‌పై లోడ్‌ పెరిగితే అక్కడ 160కేవీఏను ఏర్పాటు చేసి.. అవసరమైన చోట 100కేవీఏను సర్దుబాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డీటీఆర్‌లను డీడీలు చెల్లించినవారికి ప్రాధాన్య క్రమంలో అందిస్తున్నాం’’ అని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ డైరెక్టర్‌ జె.శ్రీనివాస్‌రెడ్డి ‘ఈనాడు’తో చెప్పారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.