close

ప్రధానాంశాలు

పెట్టుబడులకు దివ్య ఔషధం

  తెలంగాణ అత్యంత లాభదాయకం
  బయో ఆసియా సదస్సులో కేటీఆర్‌
ఈనాడు - హైదరాబాద్‌

తెలంగాణ ఫార్మా రంగం విలువను ఈ దశాబ్దంలో రూ. 7 లక్షల కోట్లకు పెంచడం, నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన మా లక్ష్యం. రాష్ట్రంలో జీవశాస్త్రాలు, ఔషధ రంగాల అభ్యున్నతి కోసం బయోటెక్‌ హబ్‌ (బి-హబ్‌)ను నెలకొల్పుతాం. త్వరలో ఔషధనగరికి శంకుస్థాపన చేస్తాం. భూముల కేటాయింపులు ప్రారంభిస్తాం.

హైదరాబాద్‌లో సెంటర్‌ ఫర్‌ సెల్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) భాగస్వామ్యంతో ప్రపంచస్థాయి వ్యాధుల చికిత్స (క్యూరేటివ్‌ థెరపీ) సంస్థ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. భారత్‌తో పాటు అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలకు సంబంధించిన వ్యాధుల నివారణకు ఆధునిక చికిత్స విధానాలైన సెల్‌, జీన్‌ థెరపీల అభివృద్ధికి ఇది కృషి చేస్తుందని చెప్పారు. దీని కోసం పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌ భారత్‌లో తమ ప్రాంగణాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోందని చెప్పారు. ఈ ప్రాంగణంలోని పరిశోధనలు, డేటా, అనలిటిక్స్‌ విధానాలను అమలు చేయడం ద్వారా తెలంగాణ ప్రజారోగ్య పరిశోధనల కేంద్రంగా గుర్తింపు పొందుతుందని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పెట్టే పెట్టుబడుల విలువ మున్ముందు ఎన్నో రెట్లు పెరుగుతుందని, పెట్టుబడులకు తెలంగాణ అత్యంత లాభదాయకం, విశ్వసనీయమైన గమ్యస్థానమని వివరించారు. సోమవారం హెచ్‌ఐసీసీలో 17వ బయో ఆసియా అంతర్జాతీయ సదస్సును ప్రారంభించిన సందర్భంగా కేటీఆర్‌ ప్రసంగించారు. ‘రాష్ట్రంలో 800 కంటే ఎక్కువ ఔషధ, బయోటెక్‌, వైద్యసాంకేతిక కంపెనీలతో తెలంగాణ ఇప్పటికే రూ. 3.5 లక్షల కోట్ల విలువైన మార్కెట్‌ విలువను కలిగి ఉంది. నగరానికి చెందిన భారత్‌ బయోటెక్‌ ఆరు నెలల పైబడి వయసున్న పిల్లల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి టైఫాయిడ్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌ను తయారు చేయగా, దాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించింది. ఈ రోజు కూడా బయోలాజికల్‌-ఇ సంస్థ అభివృద్ధి చేసిన కొత్త తరం టైఫాయిడ్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించాం.

ఔషధనగరితో మరింత ప్రగతి
జీవశాస్త్ర రంగానికి ఊతమిచ్చేలా త్వరలోనే ఔషధనగరి కార్యరూపం దాలుస్తుంది. దేశంలోనే అతిపెద్ద వైద్య పరికరాల పార్కు 276 ఎకరాల్లో అమీన్‌పూర్‌లో ప్రారంభించాం. సహజానంద మెడికల్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఆసియాలో అతిపెద్ద స్టెంట్‌ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఆసియాలో అతిపెద్దదైన ఔషధ సమూహాల్లో ఒకటైన జీనోమ్‌ వ్యాలీని విస్తరించి రెండో దశను ఏర్పాటు చేశాం. అందులో రూ. 170 కోట్ల పెట్టుబడితో సింజీన్‌ ఏర్పాటవుతుంది. దీని ద్వారా హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి రంగం మరింత బలోపేతమవుతుంది. ఆరోగ్యసంరక్షణలో డిజిటల్‌ సేవల అభివృద్ధి దిశగా నోవార్టిస్‌ సంస్థ పనిచేస్తోంది. జీనోమ్‌ వ్యాలీ కేంద్రంగా బి-హబ్‌ పనిచేస్తుంది. దీనిపై కేంద్ర బయోటెక్నాలజీ శాఖతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని పనిచేస్తోంది’ అని కేటీఆర్‌ చెప్పారు.

తెలంగాణ విధానాలు ఆకర్షణీయం
భారత్‌లోని స్విట్జర్లాండ్‌ రాయబారి అండ్రూస్‌బామ్‌ మాట్లాడుతూ, తెలంగాణ జీవశాస్త్రాలు, ఔషధ రంగాల్లో ఉజ్వల భవిష్యత్తుగల రాష్ట్రమని, ఇక్కడి పారిశ్రామిక విధానాలు ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు.  జీనోమ్‌వ్యాలీలోని సింజీన్‌ అభివృద్ధి, పరిశోధన కేంద్రం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌ సంస్థ కూడా తమ ప్రాంగణం ఏర్పాటు కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ సంచాలకుడు పీటర్‌ పియోట్‌, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌లు దీనిపై సంతకాలు చేశారు. అమెరికా పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ పాథాలజీ లాబొరేటరీలో ప్రొఫెసర్‌ ఆంకాలజిసు,్ట ఇమ్యూనాలజిస్టు కార్ల్‌ హెచ్‌ జూన్‌కు జీనోమ్‌వ్యాలీ ప్రతిభా పురస్కారాన్ని కేటీఆర్‌ బహూకరించారు. బయోకాన్‌ సీఎండీ కిరణ్‌ మజుందార్‌ షా, జీవశాస్త్రాల సంచాలకుడు శక్తినాగప్పన్‌, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. అనంతరం బయో ఆసియాలో ప్రదర్శనను కేటీఆర్‌ ప్రారంభించారు.


బాసెల్‌ విశ్వవిద్యాలయంతో వి-హబ్‌ ఒప్పందం

ఆరోగ్య, ఔషధ, జీవశాస్త్రాల రంగాల్లో అంకుర పరిశ్రమల అభివృద్ధి కోసం స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌ విశ్వవిద్యాలయంతో తెలంగాణ ప్రభుత్వ మహిళా పారిశ్రామికవేత్తల కేంద్రం (వి-హబ్‌) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హెచ్‌ఐసీసీలో మంత్రి కేటీఆర్‌, భారత్‌లోని స్విట్జర్లాండ్‌ రాయబారి అండ్రూస్‌బామ్‌ల సమక్షంలో వి-హబ్‌ సీఈవో రావుల దీప్తి, బాసెల్‌ విశ్వవిద్యాలయ ఆవిష్కరణలు, పారిశ్రామిక విభాగాధిపతి క్రిస్టియన్‌ ఎలియాస్‌ స్నెడర్‌లు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో దక్షిణ భారత రాష్ట్రాల్లోని స్విట్జర్లాండ్‌ కాన్సుల్‌ జనరల్‌ సెబాస్టియన్‌ హగ్‌, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌లు పాల్గొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల పారిశ్రామిక శిక్షణ, అంకుర పరిశ్రమల బదలాయింపు, విలీనం, పర్యావరణ వ్యవస్థల  అధ్యయనం, వ్యాపార నైపుణ్య, సాంకేతిక సహకారానికి కోసం ఈ ఒప్పందం జరిగింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.