close

ప్రధానాంశాలు

సహకరించిన వారిపైనా కేసులు

మలుపు తిరుగుతున్న ‘ఆధార్‌’ వ్యవహారం

ఈనాడు, హైదరాబాద్‌: తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఆధార్‌కార్డులు పొందారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదంతం మరో మలుపు తిరుగుతోంది. వీరికి సహాయం చేసిన వారిపైనా తాజాగా కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధపడుతున్నారు.
భారత పౌరులు కానప్పటికీ అక్రమంగా, తప్పుడు పత్రాలతో ఆధార్‌కార్డులు పొందారని ఆరోపిస్తూ విశిష్ట గుర్తింపు ప్రాధికారక సంస్థ(యూఐడీఏఐ) హైదరాబాద్‌లోని 127 మందికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాము జరిపే విచారణకు హాజరై ఆధార్‌కార్డులు పొందేందుకు సమర్పించిన ధ్రువపత్రాలు తీసుకొచ్చి అవి నిజమైనవేనని నిరూపించుకోవాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారమే ఆధార్‌ పొందినప్పటికీ ధ్రువపత్రాలు సమర్పించాలని, జాతీయత నిరూపించుకోవాలని కోరడం దారుణమని నోటీసులు అందుకున్నవారు మండిపడుతున్నారు. దాంతో ఈ వ్యవహారం సంచలనం సృష్టించింది. వాస్తవానికి ఈ విచారణ గురువారం నుంచి జరగాల్సి ఉండగా అనూహ్యంగా మే నెలకు వాయిదా వేస్తూ యూఐడీఏఐ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే నగరంలో ఉన్న రోహింగ్యాలు ఆధార్‌కార్డు పొందడంపై పోలీసులు దృష్టి పెట్టారు. నోటీసులు అందుకున్న 127 మందిలో 124 మంది రోహింగ్యాలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. వీరు ఆధార్‌కార్డులు పొందడంలో స్థానికులు సహకరించారని, ఇందుకు అవసరమైన ధ్రువపత్రాలు వారే సమకూర్చారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆధార్‌కార్డు పొందేందుకు ఇలా ధ్రువపత్రాలు ఇచ్చి సహకరించడం నేరమని చెబుతున్న పోలీసులు వీరందరిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. తప్పుడు ధ్రువపత్రాలతో ఆధార్‌కార్డులు పొందితే దాన్ని గుర్తించడం యూఐడీఏఐ పని అని, కానీ అలా విదేశీయులకు ధ్రువపత్రాలు ఇచ్చి సహకరించడం భారతీయ శిక్షాస్మృతి కింద నేరమని పోలీసులు చెబుతున్నారు.  నోటీసులు అందుకున్న అందరిపైనా ఇప్పటికే పోలీసు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో వాటన్నింటినీ పోలీసులు వెలికి తీస్తున్నారు.

‘ఆధారం’ సరైనదేనా?
ఆధార్‌ నమోదు ధ్రువపత్రాలను ప్రభుత్వ అధికారి ధ్రువీకరించాలి.. లేకుండా నమోదు చేసే దరఖాస్తులను తిరస్కరించాల్సి వస్తుంది. ఆయా పత్రాలను ప్రభుత్వ లేదా బ్యాంకు అధికారి ధ్రువీకరించాలన్నది నిబంధన. ఈ నేపథ్యంలో ప్రైవేటు ప్రాంగణాల్లోని ఆధార్‌ నమోదు కేంద్రాలను తప్పనిసరిగా ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని యూఐడీఏఐ (ఆధార్‌) ప్రాంతీయాధికారి కార్యాలయం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు లేఖలు రాసింది. ధ్రువీకరణకు ఒకరు లేదా ఇద్దరు అధికారులను ప్రత్యేకంగా గుర్తించాలని కూడా పేర్కొంది. హైదరాబాద్‌లో తప్పుడు ధ్రువపత్రాలతో 127 మంది ఆధార్‌ కార్డులు పొందినట్లు పోలీసు శాఖ నివేదించటంతో ఆధార్‌ అధికారులు అప్రమత్తమయ్యారు.  తెలంగాణలో కొన్ని ఆధార్‌ నమోదు కేంద్రాలను ప్రభుత్వ భవనాల్లోకి మార్చారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.