close

ప్రధానాంశాలు

రైతు నేతలకే పట్టం

డీసీసీబీ పదవులపై తెరాస అధిష్ఠానం దృష్టి
నేతల్లో పెరిగిన పోటీ.. జాబితాలో మాజీ ఎమ్మెల్యే,
మహిళా ఎమ్మెల్యేల భర్తలు, పోచారం తనయుడు

ఈనాడు, హైదరాబాద్‌: సమర్థ రైతు నేతలకే సహకార పీఠాలను అప్పగించడంపై తెలంగాణ రాష్ట్రసమితి అధిష్ఠానం దృష్టి పెట్టింది. హైదరాబాద్‌ మినహా తొమ్మిది పాత జిల్లాల్లో జిల్లా సహకార బ్యాంకు(డీసీసీబీ) డైరెక్టర్లు, ఛైర్మన్‌ అభ్యర్థుల ఎంపికలు జరగనున్నాయి. మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి, సభాపతి పోచారం తనయుడు భాస్కర్‌రెడ్డి, మహిళా ఎమ్మెల్యేలు సునీతా మహేందర్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డిల భర్తలు, ఇతర నేతల బంధువులు బరిలో ఉన్నారు. దీంతో ఛైర్మన్‌ పదవులపై ఉత్కంఠ ఏర్పడింది. ప్రతి డీసీసీబీలో 20 డైరెక్టర్‌, డీసీఎమ్మెస్‌ల 10 డైరెక్టర్‌ (సభ్యుల) పదవులుంటాయి. సహకార సంఘాల ఛైర్మన్లు వారిని ఎన్నుకుంటారు. తర్వాత డైరెక్టర్లంతా.. డీసీసీబీల, డీసీఎంఎస్‌ల ఛైర్మన్లను, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. సహకార సంఘాల్లో 95 శాతానికి పైగా ఛైర్మన్‌ పదవులు గెలిచినందున అన్ని డైరెక్టర్లు, ఛైర్మన్‌ పదవులు తెరాస మద్దతుదారులకే దక్కనున్నాయి. అధికశాతం స్థానాలను ఏకగ్రీవం చేయాలని తెరాస అధిష్ఠానం భావిస్తోంది. వ్యవసాయదారులు, వారి సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న నాయకులకు డీసీసీబీ పదవులు ఇవ్వాలని తెరాస అధిష్ఠానం నిర్ణయించింది. ఉద్యమ నేపథ్యమున్న వారికి ప్రాధాన్యం ఇవ్వనుంది. అర్హుల ఎంపిక కోసం గురువారం నుంచి జిల్లాల్లో అభ్యర్థులపై అభిప్రాయ సేకరణలకు సర్వేలు చేపట్టింది. ఈ నివేదికలు శనివారం నాటికి అధిష్ఠానానికి చేరనున్నాయి.

సామాజిక సమీకరణాలు పాటిస్తే..
అధికశాతం ఛైర్మన్‌ స్థానాలకు జనరల్‌ అభ్యర్థులు ఆశావహులుగా ఉన్నారు. ఒకటి, రెండు జిల్లాల్లో బీసీలు పోటీ పడుతున్నారు. తొమ్మిది స్థానాల్లో సామాజిక సమీకరణాలను పాటిస్తే కొత్త అభ్యర్థులు తెరమీదికి వచ్చే వీలుంది. డీసీసీబీ ఛైర్మన్‌ పదవులకు పోటీ అనివార్యమైతే ఉపాధ్యక్ష పదవి ద్వారా సర్దుబాటు చేస్తారు. మరోవైపు డీసీఎమ్మెస్‌ ఛైర్మన్‌, ఉపాధ్యక్ష పదవులకు అవకాశం ఇస్తారు. పలు జిల్లాల్లో నేతలు డీసీఎమ్మెస్‌ పదవులను పొందేందుకు యత్నిస్తున్నారు.

ఆశావహులు వీరే
డీసీసీబీ ఛైర్మన్‌ పదవులకు తీవ్రమైన పోటీ నెలకొంది. నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల పరిధిలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయుడు భాస్కర్‌రెడ్డి, ఆర్మూర్‌ అంకాపూర్‌ రైతు నాయకుడు మారె గంగారెడ్డి, బోధన్‌కు చెందిన పార్టీ సీనియర్‌ నేత గిర్దావర్‌ గంగారెడ్డి మంత్రి ప్రశాంత్‌రెడ్డి సన్నిహితుడు కుంట రమేశ్‌రెడ్డి.
* ఆదిలాబాద్‌ జిల్లాలో సహకార సంఘాల ఛైర్మన్లు బోజారెడ్డి, దామోదర్‌రెడ్డి, హరీశ్‌రావు (నిర్మల్‌).
* కరీంనగర్‌ జిల్లాలో ప్రస్తుత డీసీసీబీ, టెస్కాబ్‌ ఛైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు ఎంపిక ఖాయం.
* మహబూబ్‌నగర్‌ డీసీసీబీ ఛైర్మన్‌ పదవిని మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి పొందనున్నారు. ఇప్పటికే ఆయన కేసీఆర్‌, కేటీఆర్‌ల నుంచి ఆమోదం పొందారు.
* వరంగల్‌ జిల్లాలో రైతు నాయకుడు మార్నేని రవీందర్‌రావు, పార్టీ నేత చల్లా లింగారెడ్డి.
* నల్గొండ జిల్లాలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత భర్త మహేందర్‌రెడ్డితో పాటు సుంకరి మల్లేశ్‌గౌడ్‌, ఏసురెడ్డి దయాకర్‌రెడ్డి, పల్లా ప్రవీణ్‌రెడ్డి.
* మెదక్‌ జిల్లాలో ఎమ్మెల్యే పద్మ భర్త దేవేందర్‌రెడ్డి, సినీ నిర్మాత మల్కాపురం శివకుమార్‌, ప్రస్తుత డీసీసీబీ ఛైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, సీనియర్‌ నేత అంజిరెడ్డి.
* రంగారెడ్డి జిల్లాలో పార్టీ నేత బి.మనోహర్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. పార్టీఆవిర్భావం నుంచి పనిచేస్తున్న రైతు విభాగం అధ్యక్షుడు పోలీసు రాంరెడ్డి, మాజీ డీసీసీబీ ఛైర్మన్లు పెంటారెడ్డి, లక్ష్మారెడ్డిల నుంచి ఆయనకు పోటీ ఉంది.
* ఖమ్మం జిల్లాలో 13 మందికి పైగా నేతలు డీసీసీబీ ఛైర్మన్‌ పీఠాన్ని ఆశిస్తున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మద్దతుదారు బొర్రా రాజశేఖర్‌, కూరాకుల నాగభూషణం, డీసీసీబీ ఛైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు, సుధాకర్‌, శేషగిరిరావు, బ్రహ్మయ్య, నాగచంద్రారెడ్డి, కె.శ్రీనివాసరావు ఉన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.