close

ప్రధానాంశాలు

కొత్తగా 120 ఐసీయూ పడకలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో అదనంగా ఐసీయూ పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఎంజీఎం(వరంగల్‌), ఉస్మానియా(హైదరాబాద్‌), సిద్దిపేట, రిమ్స్‌(ఆదిలాబాద్‌), నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ బోధనాసుపత్రుల్లో ఒక్కో దాంట్లో రూ.2.40 కోట్ల వ్యయంతో వీటిని నెలకొల్పడానికి ప్రభుత్వం ఇప్పటికే అనుమతివ్వడంతో త్వరలో ప్రారంభించనున్నారు. ఆయా ఆసుపత్రుల్లో ప్రస్తుతమున్న అత్యవసర చికిత్స పడకలకు అదనంగా ఒక్కో దాంట్లో 20 చొప్పున కొత్తగా 120 ఐసీయూ పడకలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

బోధనాసుపత్రుల్లో ఐసీయూల ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరోగ్యశ్రీ నిల్వ నిధుల నుంచి వీటి కోసం ఖర్చు చేయడానికి సమ్మతిస్తూ గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెసులుబాటు కల్పించింది. సర్కారు ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఐసీయూల ఏర్పాటుకు అవసరమైన పరికరాల కొనుగోలు ప్రక్రియను ఇటీవలే పూర్తిచేసింది. ఇప్పటికే సర్వం సిద్ధంగా ఉన్న నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లా ఆసుపత్రుల్లో వారం రోజుల్లోపే అదనపు ఐసీయూ పడకలను ప్రారంభించడానికి వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మిగతా వాటిలోనూ వచ్చే నెలాఖరులోగా అందుబాటులోకి తీసుకొస్తామని వైద్య వర్గాలు తెలిపాయి.

ఇవీ ఉపయోగాలు
* ఐసీయూ పడకలు సరిపోకపోవడంతో.. అత్యవసర పరిస్థితుల్లో రోగులు ప్రైవేటుకు వెళ్లడమో.. లేదా మరో ప్రభుత్వ ఆసుపత్రి కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సి రావడమో జరుగుతోంది. దీంతో బాధితుల్లో అధిక శాతం మృత్యువాత పడుతున్నారు. ఇప్పుడు అదనపు ఐసీయూ పడకలను ఏర్పాటుచేయడం ద్వారా ప్రజలకు మరింతగా అత్యవసర సేవలు అందుబాటులోకి వస్తాయి.
* ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్తే అత్యవసర సేవలకు రూ.లక్షల్లో చెల్లించాల్సిన పరిస్థితి. ఆ ఆర్థిక భారం సామాన్యుడికి తప్పుతుంది.

అధునాతన పరికరాలు
* కొత్తగా ఏర్పాటుచేస్తున్న ఐసీయూల్లో కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా అత్యాధునిక పరికరాలను సమకూర్చుతున్నారు. వీటిలో కేంద్ర పర్యవేక్షక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.
* పడకలు, వెంటిలేటర్లు, మల్టీ ఛానెల్‌ మానిటర్లు, పల్స్‌ ఆక్సిమీటర్లు, సక్షన్‌ పంపులు, ఎక్స్‌రే, ఈసీజీ, డీఫిబ్రిలేటర్‌, అల్ట్రాసౌండ్‌ కలర్‌ డాప్లర్‌, ఎలక్ట్రోలైట్‌ అనలైజర్‌, ఏబీజీ అనలైజర్‌ తదితర అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉంచుతున్నారు. 


ఫీవర్‌ ఆసుపత్రిలో నూతన ఓపీ భవనం
రూ.10.5 కోట్లతో నిర్మాణం
త్వరలో పనులు ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా జ్వర రోగుల చికిత్సలకు ప్రసిద్ధిగాంచిన హైదరాబాద్‌లోని ‘ఫీవర్‌ ఆసుపత్రి’లో ఓపీ సేవలకు నూతన భవనం అందుబాటులోకి రానుంది. ఐదంతస్తుల భవన నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. తొలుత రూ.10.5 కోట్లతో ఒక అంతస్తుతో భవనాన్ని నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన అనుమతులకు ప్రభుత్వం ఇటీవలే పచ్చజెండా ఊపడంతో.. తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ టెండరు ప్రక్రియను తాజాగా పూర్తిచేసింది. త్వరలోనే నూతన భవన నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి.

ఒకే చోట ఓపీ, పరీక్షలు
* ప్రస్తుతం సూపరింటెండెంట్‌ కార్యాలయం, దానికి ఆనుకుని ఉన్న పాత భవనాల స్థానంలో నూతన భవనాన్ని నిర్మించనున్నారు.
* గ్రౌండ్‌ ఫ్లోర్‌ను పూర్తిగా ఓపీ సేవల కోసమే వినియోగించుకోనున్నారు. ఇందులో 10 గదులు మహిళలకు, మరో 10 గదులు పురుషుల ఓపీ సేవలకు కేటాయిస్తారు.
* మొదటి అంతస్తులో ఒకవైపు నిర్ధారణ పరీక్షల కేంద్రాన్ని నెలకొల్పి, పరీక్షలన్నీ అక్కడే చేయనున్నారు. ఇదే అంతస్తులో మరోవైపు సూపరింటెండెంట్‌ కార్యాలయంతోపాటు ఇతర పరిపాలనపరమైన గదులను తీర్చిదిద్దుతారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.