close

ప్రధానాంశాలు

సమానత్వ సాధనకు సుప్రీం సాయం

ప్రగతిశీల తీర్పులతో సామాజిక మార్పునకు కృషి
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రశంస

దిల్లీ: సుప్రీంకోర్టు సానుకూల, ప్రగతిశీల ధోరణితో వ్యవహరిస్తూ స్త్రీ-పురుష సమానత్వం అనే లక్ష్య సాధనకు సహకరించిందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రశంసించారు. ‘న్యాయ వ్యవస్థ-మారుతున్న ప్రపంచం’ అనే అంశంపై ఇక్కడ జరుగుతున్న అంతర్జాతీయ న్యాయ సదస్సులో ఆదివారం రాష్ట్రపతి ప్రసంగించారు. సుప్రీంకోర్టు తన తీర్పుల ద్వారా సామాజిక పరివర్తనకు దోహదపడిందని చెబుతూ పనిస్థలాల్లో మహిళలను వేధించకుండా నిరోధించే ‘విశాక మార్గదర్శకాలు’, సైన్యంలో మహిళల ప్రవేశానికి సంబంధించిన తీర్పులను ఉదహరించారు. సుప్రీంకోర్టు తీర్పులను ఆరు ప్రాంతీయ భాషల్లో వెలువరిస్తున్నందుకు కూడా ఆయన అభినందనలు తెలిపారు. ‘‘న్యాయ వ్యవస్థ సామాన్యులకు అందుబాటులో ఉండేలా సుప్రీంకోర్టు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు అభినందించదగ్గవి. మైలురాళ్లులాంటి కొన్ని తీర్పులు రాజ్యాంగ, న్యాయ వ్యవస్థను పటిష్ఠపరిచాయి’’ అని అన్నారు. సుస్థిర అభివృద్ధిపైనా దృష్టి కేంద్రీకరించాలని, ఈ విషయమై ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాలు ఆలోచించాలని సూచించారు. ప్రపంచం ఊహించని విధంగా మార్పు చెందుతోందని, ఈ నేపథ్యంలో న్యాయవ్యవస్థ పాత్ర కీలకం కానుందని చెప్పారు.


సమానత్వ సాధన ఉమ్మడి సవాలు: సీజేఐ జస్టిస్‌ బోబ్డే

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే మాట్లాడుతూ స్త్రీ-పురుష సమానత్వ సాధనే ప్రపంచ న్యాయవ్యవస్థ ముందు ఉన్న ఉమ్మడి సవాలని చెప్పారు. మహిళలకు మరింతగా న్యాయవ్యవస్థలో చోటు కల్పించాల్సి ఉందని అన్నారు. పర్యావరణ సమస్యలపై అన్ని దేశాల్లోనూ ఒకే తరహా న్యాయ విధానం ఉండాలని అభిప్రాయపడ్డారు. పర్యావరణ సమస్యలకు జాతీయ, అంతర్జాతీయ సరిహద్దులంటూ ఉండవన్నారు.. భారత న్యాయవ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్న తీరును వివరించారు. పరిపాలనలో కృత్రిమ మేధను వినియోగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ‘‘ఒక సెకనుకు పది లక్షల అక్షరాలను చదివే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. సమాచార విశ్లేషణకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే దీన్ని ఉపయోగించే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కృత్రిమ మేధ ఎప్పుడూ మానవ మేధను అధిగమించలేదు’’ అని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నందువల్లనే వ్యక్తిగత గోప్యత హక్కు అనే నినాదం తెరపైకి వచ్చిందన్నారు.


గోప్యతకు మూడు వర్గాల నుంచి ముప్పు: జస్టిస్‌ చంద్రచూడ్‌

‘ఇంటర్నెట్‌ యుగంలో పౌరుల వ్యక్తిగత గోప్యత రక్షణ- న్యాయవ్యవస్థ పాత్ర’ అనే అంశంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ప్రసంగించారు. గోప్యతకు హ్యాకర్లు, ప్రైవేటు కంపెనీలు, ప్రభుత్వం అనే మూడు వర్గాల నుంచి ముప్పుందన్నారు. వ్యక్తిగత గోప్యత, ఇతర హక్కుల మధ్య సమతౌల్యాన్ని పాటించడం న్యాయ వ్యవస్థ ముందున్న పెద్ద సవాలన్నారు. డేటా చౌర్యం, వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ప్రభావం చూపేలా నిర్ణయాలు తీసుకోవడం సమస్యలుగా మారాయన్నారు. కృత్రిమ మేధ సాయంతో డేటాను విశ్లేషించి వ్యక్తుల రాజకీయ సిద్ధాంతాలు, ఆరోగ్యం, మతం తదితర వివరాలన్నీ అడగకుండానే తెలుసుకునే అవకాశం కలిగిందని చెప్పారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.