close

ప్రధానాంశాలు

సర్కారు బడి సంతోషాల ఒడి

దిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
విద్యాప్రగతికి ఆప్‌ ప్రభుత్వం విశేష కృషి
తరగతులను వీక్షించనున్న మెలనియా

అమెరికా ప్రథమ మహిళ మెలనియా ట్రంప్‌ దిల్లీలో ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించబోతున్నారు. ఇన్ని ప్రైవేటు పాఠశాలలు ఉండగా.. సర్కారు బడినే ఆమె ఎందుకు ఎంచుకున్నారు? మన ప్రభుత్వం ఈ పాఠశాలనే ఎందుకు చూపిస్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానం.. దిల్లీలో సర్కారు బడులు సాధిస్తున్న ప్రగతి, ఉత్తమ విద్యాలయాలుగా అవి రూపాంతరం చెందుతున్న తీరు. ప్రభుత్వాలు తలచుకుంటే, చిత్తశుద్ధితో పనిచేస్తే.. పాఠశాల విద్యను ఎంతగా తీర్చిదిద్దవచ్చో.. నాణ్యమైన చదువులను ఎంతలా ‘ఆమ్‌ ఆద్మీ’కి చేరువ చేయవచ్చో.. దిల్లీలోని ప్రభుత్వ బడులు నిరూపిస్తున్నాయి.


8వేల తరగతి గదులు

దిల్లీలోని 130 పాఠశాలల్లో కొత్తగా 8,000 తరగతి గదులను ప్రభుత్వం నిర్మించింది. 2015లో ఆప్‌ తన ఎన్నికల ప్రణాళికలో 250 కొత్త ప్రభుత్వ పాఠశాలల ఏర్పాటుకు హామీ ఇచ్చింది. వీటిలో 30 మాత్రమే ఏర్పాటయ్యాయి. దీన్ని అధిగమించేందుకు కొత్త తరగతి గదులను నిర్మించింది.


విద్యకే ఓటు

ప్రభుత్వ పాఠశాలల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టడంతో ఆప్‌కు అవే ఓటుబ్యాంకుగా మారాయన్నది నిపుణుల అంచనా.


సంతోష తరగతులు

ఆప్‌ ప్రభుత్వం 2015లో అధికారంలోకి వచ్చిన తర్వాత సర్కారు బడులకు కొత్తరూపునివ్వడానికి చర్యలు చేపట్టింది. మౌలిక వసతులను కల్పించడమే కాకుండా.. వినూత్న బోధన పద్ధతులను ప్రవేశపెట్టింది. ‘హ్యాపీనెస్‌ క్లాసెస్‌’ ప్రారంభించింది. విద్యార్థుల్లో మేధో వికాసానికి 45 నిమిషాల పాటు యోగ, ధ్యానం వంటివి నేర్పుతారు. పిల్లలు మనసు విప్పి మాట్లాడుకోవడం ఈ తరగతుల్లో భాగం.


7 లక్షల మందికి వృత్తివిద్య

పిల్లలకు ప్రత్యేక వృత్తివిద్య తరగతులు ఏర్పాటు చేస్తున్నారు. ఐటీ, పర్యాటకం, రిటైల్‌, బ్యూటీ-వెల్‌నెస్‌, ఆర్థిక నిర్వహణ, సెక్యూరిటీ వంటి సబ్జెక్టులను ఐచ్ఛికంగా ఎంచుకోవచ్చు. 9-12 తరగతుల మధ్య దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు వీటిని ఎంచుకోవడం విశేషం. వీరికి రూ. 1000 చొప్పున పెట్టుబడి ధనంగా ఇస్తున్నారు.


రూ.20,000 కోట్ల బడ్జెట్‌

విద్యారంగానికి ఆప్‌ ప్రభుత్వం భారీగా బడ్జెట్‌ కేటాయిస్తోంది. 2015లో రూ.6,600 కోట్లు కేటాయించగా 2019-20 నాటికి రూ.20,000 కోట్లకు పెంచింది. దీంతో 12వ తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తోంది. 80% పైగా మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు ఉపకార వేతనాలను కూడా ఇస్తోంది.


మౌలిక వసతుల్లో మేటి..

దిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను చూస్తే ప్రైవేటు స్కూళ్లు వాటికి పోటీయే కాదనిపిస్తుంది. టేబుళ్లు, బెంచీలు, ఫ్యాన్లు, మంచి వెలుతురుతో తరగతి గదులను తీర్చిదిద్దారు. కనీసం 8 చొప్పున మరుగుదొడ్లు కట్టారు. పూర్తిస్థాయిలో ప్రయోగశాలలు ఏర్పాటయ్యాయి. 60 శాతం పాఠశాలలకు సీసీ టీవీ కెమేరాలు అమర్చారు.


సత్ఫలితాలిచ్చిన తనిఖీలు

దిల్లీ ఉప ముఖ్యమంత్రి, విద్యా మంత్రి మనీశ్‌ శిసోడియా తరచూ పాఠశాలలకు వెళ్లి పరిశీలన జరపడం సత్ఫలితాలనిచ్చింది. ఒకప్పుడు బడికి వచ్చే పిల్లలు మధ్యలో వెళ్లిపోతుండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
* నెలకోసారి తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశాలు క్రమం తప్పక నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఎన్ని పనులున్నా తల్లిదండ్రులు బడులకు వస్తున్నారు.
* తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిపి కమిటీలను ఏర్పాటుచేశారు. పాఠశాల నిర్వహణ, అవసరాలు, ఇతర అంశాల పట్ల ఈ కమిటీల సభ్యులే బాధ్యత వహిస్తున్నారు.


చునౌతీ విధానం

డ్రాపౌట్లను తగ్గించేందుకు ఆప్‌ ప్రభుత్వం 2016లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా గణిత ప్రావీణ్యం.. హిందీ, ఇంగ్లీషు రాయడం, చదవడంలో విద్యార్థులు ఎలా ఉన్నారో అంచనావేసి వారిని - ప్రతిభ(ఉత్తమ విద్యార్థులు), నిష్ఠ(సగటు విద్యార్థులు), నియో నిష్ఠ(బాగా కష్టపడితేనే ఉత్తీర్ణులయ్యేవారు) అనే 3 గ్రూపులుగా వర్గీకరిస్తారు. వీరందరినీ ఒకే తరగతి గదిలో కూర్చోబెట్టినా బోధించే విధానాలు వేరుగా ఉంటాయి. ఈ మేరకు ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు, సహకరించేందుకు 200 మంది పర్యవేక్షకులను ప్రభుత్వం నియమించింది. నియో నిష్ఠ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కూడా నిర్వహిస్తున్నారు.


సాధించాల్సిందీ ఉంది..

* ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక టీచరు ఉండాలన్న లక్ష్యం 350 స్కూళ్లలోనే సాధ్యమైంది. మిగిలిన 680 పాఠశాలల్లో 41-60 మంది విద్యార్థులకు ఒక టీచరు ఉన్నారు.
* పాఠశాలల పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు లక్ష్యం 54 స్కూళ్లలోనే సాధ్యమైంది.
* శివారు ప్రాంతాల్లోన్ని 80 ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు ఏర్పాటైనా.. మౌలిక వసతుల కల్పన పూర్తిస్థాయిలో కాలేదు.

- ఈనాడు, దిల్లీ

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.