close

ప్రధానాంశాలు

మూడు ముళ్లు!

పెరిగిపోతున్న విడాకుల కేసులు
పెళ్లయిన అయిదేళ్ల లోపువే ఎక్కువ

చిన్నచిన్న గొడవలకే కోర్టుకు
ఈనాడు - హైదరాబాద్‌

 

‘పెళ్లంటే నూరేళ్ల పంట’... మన పెద్దలు చెప్పిన ఈ నానుడి ప్రస్తుత కాలంలో అపహాస్యమవుతోంది. పట్టుమని పదేళ్లు కూడా కాపురాలు సాగట్లేదు. ఆధునికతరం దంపతులు చిన్నచిన్న కారణాలకే విడిపోతున్నారు. పెళ్లయిన అయిదేళ్లలోనే విడాకులు తీసుకోవడం అధికమైంది. రాష్ట్రంలో ఈ కేసులు ఏటికేడు పెరుగుతుండడం ఆందోళనకరం. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు ఆరువేల విడాకుల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి ఏటా 20 శాతం పెరుగుతుండడం గమనార్హం.

విడాకుల కోసం న్యాయస్థానాలను ఆశ్రయించడమే కాదు. మంజూరైన తర్వాత సంబరాలు చేసుకునే సంస్కృతి పెరుగుతోంది. దిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ తన భర్త నవీన్‌ జైహింద్‌తో విడిపోయినట్లు, విడాకులు మంజూరైనట్లు ట్విటర్‌లో ప్రకటించారు. నచ్చనప్పుడు ఏ మాత్రం రాజీపడకుండా విడిపోవడమే మేలనే అభిప్రాయం నేటి యువతలో కనిపిస్తోంది. హైదరాబాద్‌లోని ఒక కుటుంబ న్యాయస్థానంలో 1800 కేసులు పెండింగ్‌లో ఉంటే వాటిలో వెయ్యి వరకూ విడాకుల కేసులే. అందులో సగానికి పైగా పెళ్లయిన అయిదేళ్ల లోపువే. స్వల్ప వివాదాలే కావడంతో సర్దుబాటు చేయడానికి పెద్దలు, కుటుంబ న్యాయస్థానాలు ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండట్లేదు.

కొన్ని నిదర్శనాలు
* భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. ఆయన రాత్రి మద్యం తాగి వస్తాడు. ఇద్దరూ ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తారు. ఇంట్లో పని ఎవరు చేయాలన్న దానిపై గొడవలు మొదలయ్యాయి. సమానంగా కష్టపడుతూ సంపాదిస్తున్నప్పుడు ఇంట్లో పని తనే ఎందుకు చేయాలని ఆమె భర్తను ప్రశ్నించేది. రోజూ గొడవే. కలిసి ఉండలేక విడాకుల కోసం కోర్టుకెక్కారు.
* భర్త ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.   పెళ్లయి మూడేళ్లయినా పిల్లలు పుట్టలేదు. దాంతో ఆయన విడాకులు కోరాడు. ఆమె ఒప్పుకోలేదు. తన పలుకుబడి ఉపయోగించాడు. డబ్బు ఖర్చు పెట్టాడు. పెద్దల్లో పంచాయతీ పెట్టి ఎట్టకేలకు కోర్టు ద్వారా విడాకులు పొందారు. ఆయన వెంటనే మరో పెళ్లి చేసుకున్నాడు.
* భర్త ప్రభుత్వ ఉన్నతోద్యోగి. భార్య ఇంజినీరింగ్‌ చదివింది. పెళ్లయి ఏడాదిన్నరైనా పిల్లలు లేరు. భర్తకు భార్యపై అనుమానం. తరచూ ఆమె ఫోన్‌ పరిశీలించేవాడు. ఎవరితో మాట్లాడినా తప్పుపట్టేవాడు. రానురాను అనుమానపు చేష్టలు పెరిగిపోవడంతో ఆమె భరించలేక పుట్టింటికి వెళ్లిపోయింది. విడాకుల కోసం దరఖాస్తు చేశాడు. ఒప్పుకోకుంటే వివాహేతర సంబంధం అంటగట్టి పరువు తీస్తానన్నాడు. భయపడిపోయిన భార్య విడాకులకు అంగీకరించింది.
* భార్యాభర్తలు బెంగళూరు, హైదరాబాద్‌లలో పనిచేస్తున్నారు. ఇద్దరూ కలిసి ఉండాలంటే ఎవరో ఒకరు ఉద్యోగం మానేయాలి. కాని ఉన్న ఊరు వదిలిపెట్టేందుకు ఇద్దరికీ ఇష్టం లేక విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
* భర్త నెలకు రూ.50 వేలు ఆర్జిస్తున్నా ఆమెకు నచ్చలేదు. అంతకంటే మంచి ఉద్యోగం పొందాలని అతడిపై ఒత్తిడి చేసింది. దీంతో వివాదం మొదలై... విడాకులకు దారితీసింది.

 


సర్దిచెప్పేవారు లేకపోవడమే కారణం

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడమే విడాకుల కేసులు పెరగడానికి ప్రధాన కారణం. భార్యాభర్తల మధ్య చిన్నచిన్న స్పర్ధలు రావడం సహజమే. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు పెద్దలు సర్దిచెప్పేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. భార్యాభర్తల మధ్య చిన్న తేడా వచ్చినా విభేదాలు ముదిరిపోతున్నాయి. దంపతులిద్దరూ ఉన్నత విద్యావంతులు, ఆర్జనపరులైనా, సామరస్యంగా ఉండలేకపోతున్నారు. న్యాయస్థానాలకు వస్తున్న కేసులు పరిశీలిస్తే ఎక్కువ శాతం ఉన్నత విద్యావంతులు, నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్న వారివే ఎక్కువ. విడాకులు తీసుకోవడం చట్టబద్ధమైన హక్కు అయినా, దాన్ని తప్పనిసరి పరిస్థితుల్లోనే వినియోగించుకోవాలి.

- లక్ష్మారెడ్డి, అఖిల భారత న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.