close

ప్రధానాంశాలు

పుర ప్రభ.. కొత్త శోభ

పట్టణ ప్రగతికి నేడు శ్రీకారం
జీవన ప్రమాణాల వృద్ధికి బలమైన పునాది
పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపే లక్ష్యం
అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన

ఈనాడు, హైదరాబాద్‌: అత్యుత్తమ పట్టణ జీవన ప్రమాణాలకు బలమైన పునాదే లక్ష్యంగా సోమవారం పట్టణ ప్రగతికి శ్రీకారం చుడుతున్నారు. పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపు, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, మెరుగైన పౌర సేవల కల్పన ద్వారా పట్టణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఇందులో ప్రజల భాగస్వామ్యం కీలకం కానుంది. మార్చి 4 వరకూ పది రోజులపాటు రాష్ట్రంలోని 128 పురపాలక సంఘాలు 13 నగరపాలక సంస్థల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. మున్సిపాలిటీల్లో వార్డులు, కార్పొరేషన్లలో డివిజన్‌ల వారీగా వార్షిక, పంచవర్ష ప్రణాళికలు తయారు చేస్తారు.

ప్రతి వార్డుకు, డివిజన్‌కు నాలుగు కమిటీలు
పట్టణ స్థానిక సంస్థల్లోని ప్రతి వార్డుకు, డివిజన్‌కు ఒక్కో ప్రత్యేక అధికారిని నియమించారు. ఇదే మాదిరి ఒక్కోదానికి నాలుగు కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక అధికారుల పదవీ కాలం ఐదేళ్లు.  ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల వారు, వార్డు కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎమ్మెల్యేలు విధిగా పాల్గొనాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి పట్టణంలో శ్మశానం, దహన వాటికలు విధిగా ఏర్పాటు చేయాలని పేర్కొంది. నిరక్షరాస్యులను గుర్తించాలని ఆదేశించింది. అధికారులంతా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించింది.

పారిశుద్ధ్యంలో ఏం చేస్తారంటే...
* రోడ్ల పక్క చెత్త, పిచ్చి మొక్కలు, మట్టి దిబ్బల తొలగింపు
* మురుగునీటి కాలువల శుభ్రం
* ఖాళీ స్థలాల్లో చెత్త తొలగింపు
* పబ్లిక్‌ స్థలాల శుభ్రం
* పాడుబడిన భవనాల తొలగింపు
* పాడుబడిన బోర్లు, బావులు పూడ్చివేత
* ప్రజామరుగుదొడ్ల నిర్మాణానికి స్థలాలను గుర్తించడం

పచ్చదనం ప్రణాళిక
* మొక్కలు నాటే ప్రదేశాలను, అవసరమైన మొక్కల సంఖ్యను గుర్తించడం
* రోడ్లకు ఇరువైపుల నాటడం
* ఇప్పటికే నాటిన మొక్కల సంరక్షణ
* మొక్కల పంపిణీ

విద్యుత్‌ సరఫరా
* వంగిన, విరిగిన విద్యుత్‌ స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయడం
* వేలాడే విద్యుత్‌ వైర్లను సరిచేయడం, వీధి దీపాలకు మీటర్ల ఏర్పాటు
* ఫుట్‌పాత్‌లు, రద్దీ ఉండే ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద రక్షణ ఏర్పాట్లు

పట్టణ ప్రణాళిక
* శ్మశానవాటికలకు స్థలాల గుర్తింపు
* సమీకృత మార్కెట్‌ల ఏర్పాటుకు స్థలాలను గుర్తించడం
* పార్కులు, ఆట స్థలాల అభివృద్ధి ప్రణాళిక
* పచ్చదనం కోసం ఖాళీ స్థలాల గుర్తింపు
* డంపింగ్‌యార్డులు, మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రాలకు స్థలాల కేటాయింపు
* పట్టణంలో ఆటోలు, రిక్షాలు, వీధి వ్యాపారుల జోన్ల ఏర్పాటు
మొదటి రోజు ఏం చేస్తారంటే..
* కౌన్సిలర్‌ లేదా కార్పొరేటర్‌, ప్రత్యేకాధికారి, అధికారులు, ప్రత్యేక కమిటీ సభ్యులు, సీనియర్‌ సిటిజన్స్‌, ప్రముఖ వ్యక్తులు స్థానికంగా తిరిగి సమస్యలను పరిశీలిస్తారు.
* పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపు, విద్యుత్‌ సమస్యలు, పట్టణ స్థాయి కార్యాచరణ ప్రణాళికకు అవసరమైన అంశాలను గుర్తిస్తారు.


విజయవంతం చేయండి
-మంత్రి కేటీఆర్‌

రాష్ట్రంలో పట్టణాల రూపురేఖలను మార్చే లక్ష్యంతో చేపట్టనున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కె.టి.రామారావు కోరారు. పట్టణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్దేశించిన లక్ష్యాలను అందుకునేందుకు పట్టణ ప్రజాప్రతినిధులతో పాటు పురపాలక అధికారులు నిబద్ధతతో ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. కేటీఆర్‌ సోమవారం మహబూబ్‌నగర్‌ పట్టణంలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొననున్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.