close

ప్రధానాంశాలు

దుకాణాలు రాత్రి 7లోపు మూయాల్సిందే

ఉల్లంఘిస్తే కేసులే
అత్యవసర సేవలకు విఘాతం కలిగించరాదు
రాత్రిపూట కర్ఫ్యూ విఫలమైతే 24 గంటలూ అమలు
తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌, కర్ఫ్యూలను కఠినంగా అమలు చేయాలని, అనుక్షణం నిఘా ఉంచాలని రాష్ట్రప్రభుత్వం జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలను ఆదేశించింది. కర్ఫ్యూ సమయంలో ప్రతి రోజు రాత్రి ఏడు గంటల లోపు దుకాణాలను మూసివేయకపోతే కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. దీనిపై బుధవారం రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘దుకాణాలను ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే తెరిచి ఉంచాలి. ఆలోగా కొనుగోళ్లు చేసుకుని, ఏడు గంటల్లోపే ఇళ్లకు చేరుకోవాలి’ అని స్పష్టం చేసింది. జంట నగరాల పరిధిలో మూడు కిలోమీటర్ల మేరకే ప్రజలు నిత్యావసరాల కొనుగోళ్లకు అనుమతించాలని, ఇతర నగరాల్లో పరిధిని బట్టి పరిమితులు విధించాలని ఆదేశించింది. కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ను సరిగా అమలు చేయకుంటే 24 గంటల కర్ఫ్యూ విధానం అమలు చేయాల్సి వస్తుందని పేర్కొంది. ఆసుపత్రులు, ఔషధాల వంటి అత్యవసర సేవలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాలని, సరకు రవాణా వాహనాలను అనుమతించాలని ఆదేశించింది.
* స్వీయ నిర్బంధం (హోంక్వారంటైన్‌)లో ఉన్న వారిని నిరంతరం పర్యవేక్షించాలి. వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకోవాలి.
* జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు జిల్లాల్లో ఉమ్మడిగా విలేకరుల సమావేశం నిర్వహించి, ప్రజల సహకారం కోరాలి.
* విదేశాల నుంచి వచ్చిన వారి సమాచారాన్ని సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు తెలుసుకొని, అధికారులకు తెలపాలి.
* ఎవరికైనా అత్యవసరమైతే 100 నంబర్‌కు ఫోన్‌ చేయాలి. పోలీసులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలి.
* ప్రైవేటు పరిశ్రమల యాజమాన్యాలు కార్మికులకు వేతనాలను యథాతథంగా చెల్లించేలా చూడాలి.
* వ్యవసాయ పనులు కొనసాగేందుకు జిల్లా యంత్రాంగాలు సహకరించాలి.
* ఉపాధి హామీ పనులు సాగుతాయి.
* నీటిపారుదల పనులు కొనసాగుతాయి. మారు మూల ప్రాంతాల్లో పనులు సాగుతున్నందున గుత్తేదారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
* పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు గ్రామాల్లోనే జరగాలి. వ్యవసాయ విస్తరణాధికారులు సమన్వయం  చేయాలి. ఐకేపీ, ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో అవసరమైనన్ని కొనుగోలు కేంద్రాలను గ్రామాల్లో ఏర్పాటు చేయాలి. ధాన్యం విక్రయాలకు వచ్చే రైతులు నగదు బదిలీ కోసం వారి ఖాతాల వివరాలను అధికారులకు అందించాలి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.