close

ప్రధానాంశాలు

హోటళ్లే ఆస్పత్రులు

ఐరోపా, అమెరికాల్లో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
పడకల కొరతతో తీవ్ర ఆందోళన

వాషింగ్టన్‌, లండన్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రత ఉద్ధృతమవుతోంది. ఐరోపా, అమెరికాల్లో వైరస్‌ బాధితుల సంఖ్య పెరుగుతోంది. రోగులు వెల్లువలా వస్తుండటంతో ఆస్పత్రుల్లో పడకలు సరిపోవడం లేదు. ఆరోగ్యం పూర్తిగా విషమించినవారిని చేర్చుకునేందుకు వైద్య సిబ్బంది ప్రాధాన్యమిస్తున్నారు. అందుబాటులో ఉన్న వెంటిలేటర్లతో వారి ప్రాణాలను నిలిపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రోగుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో స్పెయిన్‌లో కొన్ని హోటళ్లను తాత్కాలిక ఆస్పత్రులుగా మార్చారు. ప్రస్తుతం అక్కడి ఆస్పత్రుల్లో పరిస్థితులను ఓ నర్సు వివరిస్తూ.. ‘‘మా వల్ల కావట్లేదు. ఇంకా వైద్య సిబ్బంది కావాలి. మేం చాలా శ్రమిస్తున్నాం. అయినా రోగులను రక్షించలేకపోతున్నాం. వారు మరణిస్తుంటే నిస్సహాయులుగా చూడాల్సి వస్తోంది. దీంతో మానసికంగా కుంగిపోతున్నాం’’ అని పేర్కొన్నారు. తమకు తగినన్ని మాస్కులు, చేతి తొడుగులు, వ్యక్తిగత పరిరక్షణ సామగ్రిని సమకూర్చాలంటూ ఇటలీలో వైద్యులు, నర్సులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

హోటళ్ల నుంచి పడకలు
అమెరికాలోనూ ఆస్పత్రుల కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆ దేశంలో ఇప్పటికే 75,000 మందికిపైగా కరోనా సోకగా, 1,080 మంది మృతి చెందారు. బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో న్యూయార్క్‌ నగరంలోని కన్వెన్షన్‌ సెంటర్‌ను తాత్కాలిక ఆస్పత్రిగా మార్చారు. ఆస్పత్రులకు పడకలు అందించేలా లూసియానాలో హోటళ్లతో అధికారులు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. షికాగో సబర్బన్‌లో గత ఏడాది సెప్టెంబరులో మూతపడ్డ 314 పడకల ఆస్పత్రిని తిరిగి తెరవాలని నిర్ణయించారు. కరోనా తీవ్రతకు కుదేలవుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థలో మళ్లీ జవసత్వాలు నింపేందుకుగాను ప్రతిపాదించిన 2.2 లక్షల కోట్ల డాలర్ల సహాయ ప్యాకేజీకి సెనేట్‌ ఆమోదం తెలిపింది.
* స్పెయిన్‌లో కరోనా దెబ్బకు గురువారం ఒక్కరోజే 655 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,145కు పెరిగింది. ఆ దేశంలో ఇప్పటివరకు 56,788 మంది వైరస్‌ బారిన పడ్డారు.
* ఫిలిప్పీన్స్‌లో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న 9 మంది వైద్యులు వైరస్‌ బారిన పడి మరణించారు.
* కొవిడ్‌ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకుగాను పాకిస్థాన్‌కు అత్యవసర సహాయంగా రూ.15 కోట్లు అందించనున్నట్లు అమెరికా తెలిపింది.
* ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 5 లక్షలు దాటింది. వాటిలో 2.58 లక్షల కేసులు ఒక్క ఐరోపాలోనే నమోదయ్యాయి.


ఆలస్యంగా మేల్కొన్నారు: డబ్ల్యూహెచ్‌వో అధినేత

కొవిడ్‌పై పోరులో పలు దేశాల నేతలు ఆలస్యంగా మేలుకున్నారంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అధినేత టెడ్రోస్‌ అధనామ్‌ విమర్శించారు. ఆదిలో విలువైన కాలాన్ని వారు వృథా చేశారంటూ మండిపడ్డారు. కరోనాను ప్రజలకు ప్రథమ శత్రువుగా పేర్కొన్నారు. ‘‘వాస్తవానికి 1-2 నెలల ముందే పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాల్సింది. మనం తొలి అవకాశాన్ని వృథా చేశాం. ఇది రెండో అవకాశం. దీన్ని నేలపాలు చేయకుండా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు తగిన చర్యలు చేపట్టాలి’’ అని టెడ్రోస్‌ అన్నారు.


 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.