close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments
ధైర్యంగా ఎదుర్కొంటున్నాం

వైద్యులు, సిబ్బంది సేవలు భేష్‌
‘గాంధీ’లో చికిత్స పొందుతున్న బాధితులను ఫోన్‌లో పలకరించిన ‘ఈనాడు’

ఈనాడు - హైదరాబాద్‌: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. వయసుతో నిమిత్తం లేకుండా ప్రజలు ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా వైరస్‌ సోకుతోందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. అంతకుముందు విదేశాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాల వారిలో కొందరు అప్పటికే హైదరాబాద్‌ వచ్చారు. స్క్రీనింగ్‌ పరీక్షల్లో కొందరికి పాజిటివ్‌ రావడంతో చికిత్స కోసం సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరికొందరికి వైరస్‌ ఉన్నా లక్షణాలు గుర్తించక సాధారణ అనారోగ్యమేనని నేరుగా ఇళ్లకు వెళ్లారు. వారితోపాటు కుటుంబ సభ్యులకూ కరోనా సోకింది. ఇలాంటివారందరూ గాంధీలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరు ఫోన్‌ ద్వారా తమ అనుభవాలను ‘ఈనాడు’ ప్రతినిధితో పంచుకున్నారు. తమను వైద్యులు కంటిపాపల్లా చూసుకుంటున్నారని, ఇష్టమైన ఆహారం ఇస్తున్నారని వివరించారు.


తొలిరోజు మాత్రమే భయం
- గృహిణి, కూకట్‌పల్లి

నా భర్త రెస్టారెంట్‌ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వ్యాపార విస్తరణలో భాగంగా విదేశాలకు తరచూ వెళ్తుంటారు. కొద్దిరోజుల క్రితం అమెరికాకు వెళ్లొచ్చారు. అక్కడి నుంచి వచ్చాక అనారోగ్యంగా ఉంటే ఇద్దరం కరోనా పరీక్షలు చేయించుకుందామని చెప్పాను. పదిరోజుల క్రితం గాంధీ ఆసుపత్రికి వెళ్లాం. పరీక్షలు చేయించుకున్నాక వైద్యుల సూచన మేరకు అడ్మిట్‌ అయ్యాం. ఆరోజు రాత్రి రిపోర్టుల్లో ఇద్దరికీ కరోనా పాజిటివ్‌ వచ్చింది. మీకేం ఫర్వాలేదు అంటూ వైద్యులు ధైర్యం చెప్పారు. ఇద్దరినీ ఒకే వార్డులో ఉంచారు. తొలిరోజు చాలా భయం వేసింది. రెండోరోజు నుంచి కొంత తగ్గింది. ఉదయాన్నే టీ ఇస్తున్నారు. మూడు రకాల అల్పాహారం అందిస్తున్నారు. సాయంత్రం వైద్యులు వచ్చి ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. మీకు ఇష్టమైన భోజనం ఇస్తాం.. కోలుకున్నాక మీ ఇంటికి భోజనానికి పిలవండి అంటున్నారు.


తల్లిదండ్రుల నుంచి నాకు సోకింది
- ప్రైవేటు కంపెనీ యజమాని, సికింద్రాబాద్‌

వ్యాపార పనుల నిమిత్తం మాఅమ్మ, నాన్న గతనెల తొలివారంలో దుబాయ్‌కి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగొచ్చాక జ్వరం, దగ్గుతో బాధపడ్డారు. సాధారణమే అనుకున్నాం. పోలీసులు, వైద్య బృందాలు వచ్చి తల్లిదండ్రులను, నన్ను, నా భార్య, ఇద్దరు పిల్లలను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించగా.. మా ముగ్గురికీ పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నాం. రోజూ వేర్వేరు పనులతో ఖాళీ లేకుండా ఉండేవాడిని. ప్రస్తుతం 24 గంటలంటే ఇంతసేపు ఉంటుందా? అని అనిపిస్తోంది. కంపెనీ పనులు ఫోన్‌లో చెబుతున్నా.. పిల్లలతో మాట్లాడుతున్నా.. మొబైల్‌లో వెబ్‌సిరీస్‌లు చూస్తున్నా.. ప్రార్థన చేసుకుంటున్నా ఇంకా చాలా సమయం మిగులుతోంది. కరోనా నుంచి కోలుకున్నట్లే. రెండు రోజులు ఇక్కడే ఉండి ఇళ్లకు వెళ్లండంటూ వైద్యులు సూచించారు.


క్వారంటైన్‌ నుంచి గాంధీ ఆసుపత్రికి
- ఎంబీఏ విద్యార్థి, లండన్‌

మాది గుంటూరు జిల్లా. లండన్‌లోని ఓ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్నా. గతనెల రెండోవారంలో మా గదిలో ఉంటున్న ముగ్గురికీ జలుబు, దగ్గు, జ్వరం వచ్చాయి. హైదరాబాద్‌లో ఉంటున్న మా బావకు ఫోన్‌ చేస్తే.. కరోనా అనుమానిత లక్షణాలేమో.. వెంటనే రమ్మన్నారు. గతనెల 16న ముగ్గురం లండన్‌ నుంచి దుబాయ్‌ మీదుగా మార్చి 18న హైదరాబాద్‌కు చేరుకున్నాం. నా స్నేహితులిద్దరూ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి అక్కడే చికిత్స చేయించుకుంటామన్నారు. నన్ను రాజేంద్రనగర్‌లోని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మార్చి 20న గాంధీ ఆసుపత్రికి క్యాబ్‌లో తీసుకెళ్లారు. వైద్యపరీక్షలు చేశాక పాజిటివ్‌ అని తేలింది. క్వారంటైన్‌లో నాతోపాటు ఉన్న వ్యక్తికి, నన్ను క్యాబ్‌లో తీసుకువచ్చిన డ్రైవర్‌కు కూడా కరోనా పరీక్షలు చేయించాలని వైద్యులను అభ్యర్థించాను. వారికి నెగిటివ్‌ వచ్చింది. ఆసుపత్రిలో చాలా సౌకర్యంగా ఉంది. ఉదయాన్నే టిఫిన్‌, సాయంత్రం పండ్లు, డ్రైఫూట్స్‌, బాదం, జీడిపప్పు, రెండు కూరలు, అన్నం, పప్పు పెడుతున్నారు. వైద్యుల సూచనలతో మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కొంటున్నాం.


స్వీయ నిర్బంధమే మేలు
-కరోనాను జయించిన ఓ యువకుడు

నేను లండన్‌లోని ఓ యూనివర్సిటీలో పీజీ చదువుతున్నా. అక్కడ వ్యాధి ప్రబలిన సమయంలో.. గత నెల 19న భారత్‌కు చేరుకున్నా. విమానాశ్రయంలో థర్మో స్కానింగ్‌ కూడా అయింది. అయినప్పటికీ బాధ్యతగా వ్యవహరించి వైద్యశాలకు వెళ్లి పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధపడ్డా. వైరస్‌ లక్షణాలు లేకపోయినా, పాజిటివ్‌ అని తేలింది. 15 రోజులపాటు గాంధీ ఆసుపత్రిలో ఉండి చికిత్స పొంది కోలుకుని ఇంటికి చేరాను. అయినప్పటికీ స్వీయ నిర్బంధంలోనే ఉంటున్నా. అదే మేలు బ్రిటన్‌ నుంచి బయలుదేరినప్పుడే వైరస్‌పై కొంత ఆందోళన ఉండటంతో జాగ్రత్తలు తీసుకున్నా. పరీక్షలు చేయించుకున్న తర్వాతే ఇంటికి వస్తానని మావాళ్లకి చెప్పాను. ‘ఎమర్జెన్సీ పారామెడికల్‌’ కోర్సులో నేను తీసుకున్న శిక్షణ నాకు బాగా ఉపయోగపడింది. యువత లాక్‌డౌన్‌ తప్పనిసరిగా పాటించాలి. ఏమీ కాదులే అనే ధీమా యువతలో పనికిరాదు. కరోనా లక్షణాలు లేకపోయినా సరే.. వైరస్‌ ఉండవచ్చు. ఎవరికైనా సోకినా ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. గాంధీలో వైద్యం బాగా అందుతోంది. వైద్యులు, సిబ్బంది బాధితులను బాగా చూసుకుంటున్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.