close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments
ఒక్క రోజే 75 కేసులు

మరో ఇద్దరి మృతి
విరుచుకుపడిన మహమ్మారి
రాష్ట్రంలో ఇప్పటి వరకు మరణాలు 11
మొత్తం బాధితులు 229
80 శాతం మంది మర్కజ్‌ ప్రయాణికులు, వారి సన్నిహితులే
మరో వెయ్యి మందికి పరీక్షలు
నేడూ భారీగా పాజిటివ్‌ ఫలితాలు!

ఈనాడు- హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ రోజురోజుకూ విరుచుకుపడుతోంది. కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. గత నెల 27 నాటికి రాష్ట్రంలో మొత్తం కేసులు 59 ఉండగా.. శుక్రవారం ఒక్కరోజే 75 మందిలో వైరస్‌ సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ వచ్చిన బాధితుల సంఖ్య 229కి చేరుకుంది. మహమ్మారి కోరలకు చిక్కి శుక్రవారం మరో ఇద్దరు మృతి చెందారు. వీరిలో ఒకరు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన మహిళ కాగా, మరొకరు సికింద్రాబాద్‌ వాసిగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటనలో తెలిపింది. దీంతో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 11కు పెరిగింది. వైరస్‌ బాధితుల్లో మరో 15 మంది కోలుకుని శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. వీరితో కలిసి ఇప్పటి వరకూ పూర్తి ఆరోగ్యంగా ఇంటికి వెళ్లిన వారు 32 మంది. డిశ్ఛార్జి అయినా, 14 రోజుల వరకూ ఇంటి పట్టునే ఉండాలని, ఈలోగా ఎటువంటి లక్షణాలు కనిపించినా ఆసుపత్రి వర్గాలను సంప్రదించాలని వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనా వైరస్‌తో 186 మంది చికిత్స పొందుతున్నారు.

అత్యధికులు మర్కజ్‌ సంబంధీకులే
రాష్ట్రం నుంచి దిల్లీకి వెళ్లి వచ్చిన మర్కజ్‌ ప్రయాణికుల్లోనే అత్యధికంగా కరోనా వైరస్‌ నిర్ధారణ అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మర్కజ్‌ నుంచి వచ్చిన వారిని, ఆ వ్యక్తులతో కలిసిన వారిని ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించి, పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించడంతో.. ప్రభుత్వ యంత్రాంగం గత మూడు రోజులుగా యుద్ధప్రాతిపదికన కదిలింది. దాదాపు రెండు వేల మందిని రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, వసతిగృహాల్లో విడి గదుల్లో ఉంచింది. వీరికి సత్వరమే పరీక్షలు నిర్వహించడానికి అనుమతి పొందిన ఆరు ప్రయోగశాలలను గత రెండు రోజులుగా వినియోగిస్తోంది. 24 గంటలూ మూడు షిఫ్టుల్లో నిర్వహిస్తున్న పరీక్షల్లో భాగంగా.. బుధవారం 30 కేసులు, గురువారం 27 కేసులు నమోదు కాగా, శుక్రవారం ఏకంగా 75 కేసులు నమోదయ్యాయి. గత మూడు రోజుల్లో నమోదైన కేసులన్నీ మర్కజ్‌ నుంచి వచ్చిన ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులవేనని వైద్యవర్గాలు చెప్పాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన 229 కేసుల్లో.. మర్కజ్‌ సంబంధిత బాధితులు 183 మంది (80 శాతం) ఉన్నట్లు తేలింది. గత మూడు రోజుల్లో సుమారు వెయ్యి మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని, మరో వెయ్యి మందిని పరీక్షించేందుకు ఏర్పాట్లు చేశామని వైద్యవర్గాలు తెలిపాయి. వీటిల్లో అత్యధిక ఫలితాలు శనివారం వెలువడవచ్చని అంచనా. ఇందులోనూ భారీగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యే అవకాశాలున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. వివిధ జిల్లాలకు సంబంధించి శుక్రవారం నమోదైన కేసులు ఇలా ఉన్నాయి.

నిజామాబాద్‌- 17
ఈ జిల్లాలో ఒకే రోజు 17 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇందులో 15 మంది పురుషులు కాగా, ఇద్దరు మహిళలు. వీరిలో 28-50 సంవత్సరాల మధ్య వయసు వారున్నారు. అందరూ దిల్లీలో మర్కజ్కు వెళ్లిన వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులేనని తెలిసింది. బాధితులతో కలిసిన వారందరినీ ఐసోలేషన్‌కు తరలించారు.

మెదక్‌... ఒకే కుటుంబంలో నలుగురు
మెదక్‌ పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ నెల 31న ఒకరికి పాజిటివ్‌ రాగా, శుక్రవారం అదే కుటుంబంలోని మరో ముగ్గురికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారి శుక్రవారం ప్రకటించారు. మొదట పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి 56 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన భార్య (45), కుమార్తె (30), కోడలు (23) కూడా వ్యాధి బారినపడ్డారు.

నల్గొండలో
ఈ జిల్లాలో శుక్రవారం మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మూడు రోజుల కిందట జిల్లా నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించిన 14 మంది రోహింగ్యాల్లో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు జిల్లా అధికార యంత్రాంగం వెల్లడించింది. అయితే నిర్ధారణ పత్రాలు రావాల్సి ఉందని జిల్లా కలెక్టరు ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ తెలిపారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌కు చెందిన 14 మంది రోహింగ్యాలు గత కొన్ని రోజులుగా నల్గొండలోనే నివసిస్తున్నారు. ఇటీవల దిల్లీలో జరిగిన సమావేశాలకు హాజరై తిరిగి గత నెల 18న నల్గొండకు వచ్చారు. మార్చి 31న వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. వీరు ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. దామరచర్ల నుంచి భర్తతో కలిసి మర్కజ్‌లో జరిగిన సమావేశానికి వెళ్లి వచ్చిన మహిళ (55)కూ కరోనా పాజిటివ్‌ వచ్చింది. పోలీసులు వీరిని అనుమానితులుగా భావించి ఇప్పటికే క్వారంటైన్‌కు తరలించారు. రెండు రోజుల క్రితం భర్తకు నెగిటివ్‌ రాగా... ఇప్పుడు భార్యకు పాజిటివ్‌ రిపోర్టు రావడంతో.. అధికారులు వీరి కుటుంబ సభ్యులనూ నల్గొండలోని జిల్లా కేంద్రాసుపత్రికి క్వారంటైన్‌ నిమిత్తం తరలించారు.

కామారెడ్డిలో
బాన్సువాడలో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. ఈ ముగ్గురూ గతంలో పాజిటివ్‌ వచ్చిన వారి కుటుంబ సభ్యులే. ఒకతని భార్యకు, ఇంకో వ్యక్తి కుమారుడు, కుమార్తెకు శుక్రవారం పాజిటివ్‌ వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

మహబూబ్‌నగర్‌లో
స్థానికంగా పట్టణంలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్టు నిర్ధారణ అయ్యింది. మర్కజ్‌కు వెళ్లిన వ్యక్తికి పరీక్షలు చేయిస్తే, ఆయనలో నెగిటివ్‌ రాగా, ఆయన కుటుంబ సభ్యులిద్దరికీ పాజిటివ్‌ వచ్చింది. దీంతో అధికారులు వారెవరెవరితో కలిశారనే దానిపై దృష్టి సారించారు. నాగర్‌కర్నూలులో 32 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని జిల్లా కలెక్టర్‌ ధ్రువీకరించారు. ఈ యువకుడు కూడా మర్కజ్‌కు వెళ్లొచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లాలోనూ తాజాగా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధరించారు. వీరు  ముగ్గురూ గద్వాల పట్టణానికి చెందినవారు. దిల్లీ వెళ్లి వచ్చినవారే.

సంగారెడ్డిలో
జిల్లాలోని రామచంద్రాపురం ప్రాంతంలో 60 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయనకు జ్వరం రాగా గచ్చిబౌలి ప్రాంతంలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరారు. అక్కడ పాజిటివ్‌గా తేలినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.


హైదరాబాద్‌లో ఇలా....

సర్కారు శుక్రవారం విడుదల చేసిన వివరాలు పరిశీలిస్తే... హైదరాబాద్‌లో ఎక్కువ మంది కుత్బుల్లాపూర్‌ ప్రాంతానికి చెందిన వారున్నారు. టౌలీచౌకి, సికింద్రాబాద్‌, చంచల్‌గూడ, మలక్‌పేట, శంషాబాద్‌, ఆర్‌కే పురం, బార్కస్‌, డబీర్‌పుర, బీహెచ్‌ఈఎల్‌ ఆర్‌సీపురం, తదితర ప్రాంతాలకు చెందిన వారిలోనూ వైరస్‌ ఉన్నట్లు తేలింది. ఆయా ప్రాంతాల్లో విచారణ మొదలుపెట్టామని, బాధితులు ఇటీవలి కాలంలో ఎవరెవరితో కలిశారన్న సమాచారం ఆధారంగా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యలు ప్రారంభించామని అధికారులు తెలిపారు. మేడ్చల్‌ జిల్లాలో నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు వివరించారు.


ఉమ్మడి వరంగల్‌ జిల్లా... 26

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. దిల్లీ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో వరంగల్‌ గ్రామీణ, పట్టణ జిల్లాల్లో తాజాగా 20 కేసులు నమోదయ్యాయి. జనగామలో ఇద్దరు, ములుగులో ఇద్దరికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సింగరేణి కార్మికుడు (52) మర్కజ్‌కు వెళ్లారు. ఈయనకు పాజిటివ్‌ వచ్చినట్లు జిల్లా కలెక్టర్‌ ప్రకటించారు. మహబూబాబాద్‌లో ఒకరికి వైరస్‌ సోకినట్లు నిర్ధరించారు. మొత్తంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మర్కజ్‌ సంబంధితుల్లో 26 కేసులు గుర్తించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.