close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments
6,500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

నిజామాబాద్‌లో అత్యధికంగా 540

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 6,500 రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చేవారం నుంచి వీటిద్వారా ధాన్యం కొనేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 1.05 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. కరోనా వైరస్‌ తీవ్రతను కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు.  ఆ మేరకు జిల్లాల వారీగా కొనుగోలు కేంద్రాల వివరాలను పౌరసరఫరాల శాఖ సేకరించింది. నిజామాబాద్‌లో అత్యధికంగా 540 కొనుగోలు కేంద్రాలు, జగిత్యాల 500, నల్గొండ 415, సిద్దిపేట 330, కరీంనగర్‌ 320, కామారెడ్డి 310, పెద్దపల్లి 300, మంచిర్యాల 250, వనపర్తి 240, కొత్తగూడెం 220, భూపాలపల్లిలో 220 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మిగిలిన జిల్లాల్లో 100 నుంచి 150 వరకు కేంద్రాలు తెరవనున్నారు. వరి పండించిన రైతులకు గ్రామాల వారీగా కూపన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ధాన్యం కొనుగోళ్లు, వాటిని మిల్లులకు తరలించే బాధ్యతలను పౌరసరఫరాల శాఖకు ప్రభుత్వం అప్పగించింది.

ధాన్యం కొనుగోళ్లకు మరో రూ.25 వేల కోట్ల రుణం
ఈనాడు, హైదరాబాద్‌: ధాన్యం కొనుగోళ్లకు మరో రూ.25 వేల కోట్లు రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.20 వేల కోట్లు రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గతంలో అనుమతిచ్చింది. దిగుబడి పెరగనున్న దృష్ట్యా మరిన్ని నిధులు అవసరమని పౌరసరఫరాల శాఖ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో రూ.45 వేల కోట్ల రుణానికి ప్రభుత్వం పూచీకత్తు ఉండేందుకు ఆమోదించింది.

ప్రతి గింజా కొనేందుకు చర్యలు: మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అవసరమైనన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. శనివారం వనపర్తి సమీపంలోని రాజపేటలో సహకార సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కొందరు రైతులకు పాసుపుస్తకాలు రాలేదని, వారి బ్యాంకు ఖాతాల వివరాలను నమోదు చేసుకోవాలని మంత్రి సిబ్బందికి చెప్పారు.

1.23 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ
ఈనాడు, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ నేపథ్యంలో శనివారం సాయంత్రం నాటికి రాష్ట్రంలో 1.23 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం రేషన్‌కార్డు దారులకు పంపిణీ చేసినట్లు పౌరసరఫరాల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. బుధవారం నుంచి ఇప్పటివరకు 30.95 లక్షల కార్డుదారులకు బియ్యం అందజేశామని, 4 రోజుల వ్యవధిలో 35.35 శాతం మంది తీసుకున్నారని ఆ ప్రకటనలో పేర్కొంది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.