close

ప్రధానాంశాలు

ఆరోగ్యంగా ఇంటికి..

గాంధీ నుంచి 15 మంది బాధితుల డిశ్ఛార్జి
మరో 83 మంది కరోనా రోగులకు చికిత్స
వీరిలో ఒకరి పరిస్థితి విషమం
నివేదికల కోసం 464 మంది నిరీక్షణ

ఈనాడు, హైదరాబాద్‌: గాంధీ ఆసుపత్రి, న్యూస్‌టుడే: కరోనా (కొవిడ్‌-19) మహమ్మారి బారిన పడి కోలుకున్న 15 మంది బాధితులను శనివారం గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేసి, ఇళ్లకు పంపారు. వ్యాధి నిర్ధారణ అయినప్పటి నుంచి వీరు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్యం మెరుగుపడటంతో ఇంటికి పంపిస్తున్నట్లు వైద్యులు ప్రకటించగానే వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఆనందంగా ఇంటి బాట పట్టారు. వైద్యులు తమలో ఆత్మస్థైర్యాన్ని నింపి, మెరుగైన సేవలు అందించడంతో త్వరగా కోలుకున్నామని  తెలిపారు. 24 గంటల వ్యవధిలో రెండుసార్లు చేసిన పరీక్షల్లో ఈ 15 మందికి నెగిటివ్‌ రావడంతో డిశ్ఛార్జి చేశారు. మరో 14 రోజులు ఎవరినీ కలవకుండా ఇంట్లోనే ఉండాలని వారికి సూచించినట్లు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. వీరితో కలిపి ఇప్పటివరకు 19 మందిని గాంధీ నుంచి డిశ్ఛార్జి చేశామన్నారు. ఈ ఆసుపత్రిలో మరో 83 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతుండగా, వీరిలో ఒకరి పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితుల్లో ఒక్క వరంగల్‌ వారే 25 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఇంకా 464 మందిని ఐసోలేషన్‌లో ఉంచామని చెప్పారు. వీరి నమూనాలను పరీక్షలకు పంపామని, నివేదికల కోసం ఎదురు చూస్తున్నట్లు డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు.

ఛాతీ ఆసుపత్రికి ఏడుగురు అనుమానితులు
అమీర్‌పేట, న్యూస్‌టుడే: ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో శనివారం ఏడుగురు కరోనా అనుమానితులు పరీక్షల కోసం చేరారు. ప్రస్తుతం మొత్తం 50 మంది ఛాతీ ఆసుపత్రిలో ఉన్నట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌ చెప్పారు. కరోనా అనుమానిత లక్షణాలతో ఉన్నవారు స్వయంగా ఛాతీ ఆసుపత్రికి వచ్చి ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్చని, అవసరమైన వారికి చికిత్స అందిస్తామని తెలిపారు.

ఆసుపత్రిలో బాధితుల నిరసన
మెహిదీపట్నం, న్యూస్‌టుడే: సరోజినీదేవి నేత్రాలయంలో ఐసోలేషన్‌ వార్డు వద్ద శనివారం స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కొందరు కరోనా బాధితులు ఆసుపత్రి వద్ద నిరసనకు దిగగా.. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. ఈ నేత్రాలయంలో 150 పడకలతో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులో పలు జిల్లాలకు చెందిన అనుమానితులను ఉంచారు. వారి నమూనాలను పరీక్ష చేయించగా, అయిదుగురికి కరోనా వైరస్‌ సోకినట్లు శుక్రవారం రాత్రి తేలింది. శనివారం మరో 12 మందికి నిర్ధారణ అయ్యింది. దీంతో ఒత్తిడితో కోపోద్రిక్తులైన కొందరు బాధితులు నిరసనకు దిగి వైద్యులు, సిబ్బందిని దుర్భాషలాడారు. ఈ విషయం తెలుసుకుని, ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ ఆర్జీ శివమారుతి, హుమయూన్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సునీల్‌, అదనపు ఇన్‌స్పెక్టర్‌ నారాయణరెడ్డి తమ సిబ్బందితో కలిసి అక్కడికి వచ్చారు. బాధితులను గాంధీ ఆసుపత్రికి తరలించారు.


అమూల్యమైన వైద్య సేవలతో కోలుకున్నా

‘న్యూస్‌టుడే’తో కరోనా బాధితురాలు

అశ్వాపురం, న్యూస్‌టుడే: ‘గాంధీ ఆసుపత్రిలో నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. అక్కడి వైద్య, ఆరోగ్య సిబ్బంది అందించిన సేవలు అమూల్యం. కరోనా సోకిన నేను వారి సేవలతోనే త్వరగా కోలుకోగలిగాను’..అంటూ కృతజ్ఞత వ్యక్తం చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువతి. మార్చి నెలలో ఇటలీ నుంచి స్వస్థలానికి వచ్చిన ఈమెకు కరోనా సోకడంతో 11వ తేదీన గాంధీ ఆసుపత్రిలో చేరారు. జిల్లాలో ఆమెది తొలి పాజిటివ్‌ కేసు. రాష్ట్రంలో రెండోది. అప్పటి నుంచి సుమారు 24 రోజులు చికిత్స అందించాక ఆమె కోలుకోవడంతో శనివారం ఆమెను డిశ్ఛార్జి చేసి స్వస్థలానికి పంపారు.  ఆమెను ‘న్యూస్‌టుడే’ పలకరించగా, తనకు 14 రోజుల్లోనే వ్యాధి నయమైనా, మరికొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారని చెప్పారు.  కలెక్టర్‌ ఎంవీ రెడ్డి తదితరులు ఆమెతో మాట్లాడి ధైర్యం చెప్పారు. తహసీల్దారు భగవాన్‌రెడ్డి, మండల వైద్యాధికారి మణికంఠరెడ్డి ఆమె ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.