close

ప్రధానాంశాలు

మహమ్మారుల జననమెట్టిది.. మానవాళి జయమెట్టిది

వైద్య విప్లవ ఫలాల్ని అనుభవిస్తున్న ఆధునిక మానవుడు.... కరోనా వైరస్‌ దెబ్బకు విలవిల్లాడుతున్నాడు. ఎన్నో ఆధునిక పరికరాలు, మందులు, టీకాలు, వైద్య నిపుణులు ఉండికూడా దాన్ని కట్టడి చేయలేకపోతున్నాడు. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. మరి వైద్యులు, పరిశోధనలు సరిగా లేని పూర్వకాలంలో ఇలాంటి మహమ్మారిలను మనిషి ఎలా జయించగలిగాడు? ఊళ్లకు ఊళ్లే, దేశాలకు దేశాలనే చుట్టబెట్టిన, లక్షల మందిని బలిగొన్న వైరస్‌లు, బ్యాక్టీరియాలను తట్టుకుని ఎలా మనుగడ సాగించగలిగాడు? మనుషులపై భయంకరంగా విరుచుకుపడిన కొన్ని సూక్ష్మక్రిములు కాలక్రమంలో ఏమయ్యాయి? ఎలా మాయమయ్యాయి? అనేవి ఆసక్తికర విషయాలు.


జస్టీనియన్‌ ప్లేగు: రోగ నిరోధక శక్తే ఆయుధం

చరిత్రలో అతి భయంకరమైన వ్యాధుల్లో ప్లేగు ఒకటి. క్రీ.శ.541 కాలంలో ఆనాటి బైజాంటైన్‌ రాజధాని కాన్‌స్టాంటినోపిల్‌లో మొదటిసారి వచ్చింది. ఈజిప్టు నుంచి మధ్యధరా సముద్రం మీదుగా ఈ వ్యాధి పాకింది. కాన్‌స్టాంటినోపిల్‌లో ప్రబలి, ఐరోపాతోపాటు ఆసియా, ఉత్తర అమెరికా, అరేబియా దేశాలకు విస్తరించింది. అప్పట్లో దీనికి మందు లేకపోవడంతో దాదాపు 3-5 కోట్ల మంది చనిపోయి ఉంటారని అంచనా. ఇది క్రీ.శ.541 నుంచి 750 వరకు ప్రభావం చూపి, నెమ్మదిగా కనుమరుగైంది. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవాళ్లే వ్యాధి నుంచి బయటపడి ఉంటారని చరిత్రకారుల అభిప్రాయం. చక్రవర్తి జస్టీనియన్‌కు ప్లేగు సోకి... కోలుకోవడంతో దీనిని జస్టీనియన్‌ ప్లేగు అని పిలుస్తున్నారు.


బ్లాక్‌డెత్‌(బుబోనిక్‌ ప్లేగు): క్వారంటైన్‌కు నాంది

జస్టీనియన్‌ ప్లేగుకు కారణమైన యెర్సీనియా పెస్టిస్‌ బ్యాక్టీరియా 800 ఏళ్ల తర్వాత రూపాంతరం చెంది బుబోనిక్‌ ప్లేగుగా మళ్లీ విరుచుకుపడింది. బ్లాక్‌డెత్‌గా పిలిచే ఈ వ్యాధి 1347లో ఐరోపా మొత్తం వ్యాపించింది. దీని బారినపడి 4ఏళ్లలో కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. దీన్ని ఎలా నయం చేయాలో తెలియకపోయినా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని తెలుసుకున్న ప్రజలు వ్యాధిగ్రస్తులను ఇతరులతో కలవనీయకుండా ప్రత్యేక ప్రాంతాలకు తరలించారు. నాటి అధికారులు రోమన్ల ఆధీనంలోని ఓడరేవుల ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ఓడల్లో వచ్చిన వ్యక్తులను తొలుత 40 రోజులపాటు క్వారంటైన్‌ చేసిన తర్వాత వారికి వ్యాధి లక్షణాలు లేవని తేలితేనే రాజ్యంలోకి అనుమతిచ్చేవారు. ఇలా వ్యాధిని కట్టడి చేశారు.


ది గ్రేట్‌ ప్లేగ్‌ ఆఫ్‌ లండన్‌: హోం క్వారంటైన్‌

ఐరోపాలో ప్లేగు తాత్కాలికంగా మాయమైనా క్రీ.శ.1347-1666 మధ్య కాలంలో ప్రతీ 20 ఏళ్లకోసారి తన ఉనికి చాటుకునేది. 300 ఏళ్లలో 40సార్లు సోకింది. అలా వచ్చిన ప్రతిసారీ లక్షల మంది ప్రాణాలు కోల్పోయేవారు. క్రీ.శ. 1665లో ఇంగ్లాడ్‌లో విజృంభించింది. లండన్‌లో 75 వేల మంది బలయ్యారు. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ప్లేగు బాధితులను ఐసోలేట్‌ చేయాలని ఆదేశించి, వారి ఇళ్లకు అధికారులు గుర్తులు పెట్టేవారు. ప్రజలను బయటకు రావొద్దని హెచ్చరించారు. అలా తొలిసారి ప్రజలు హోం క్వారంటైన్‌ అయ్యారు. ఎవరైనా వ్యాధితో చనిపోతే ఇళ్లలోనే పూడ్చి పెట్టేవారు. వారికి ఇంతకుమించిన మార్గం కనిపించలేదు. దీంతో వ్యాధి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఎప్పుడు దాని జాడలు కనిపించినా క్వారంటైన్‌ను అనుసరించారు.


మశూచి: తొలిసారి టీకా వాడకం

ఐరోపా, ఆసియా, అరేబియా దేశాల్లో మాత్రమే మశూచి ఎక్కువగా వస్తుండేది. బాధితుల్లో ప్రతి 10 మందిలో ముగ్గురు చనిపోతే... మిగతా వారికి ఒంటినిండా చారలు పడి ప్రాణాలు దక్కేవి. 15వ శతాబ్దంలో ఐరోపా అన్వేషకుల ద్వారా మశూచి అమెరికా, మెక్సికోలకు వ్యాపించింది. అక్కడి వారికి మశూచిని ఎదుర్కొనేంత రోగ నిరోధకశక్తి లేకపోవడంతో కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్నేళ్ల తర్వాత క్రీ.శ.1796లో ఎడ్వర్డ్‌ జెన్నర్‌(బ్రిటన్‌) అనే వైద్యుడు తొలిసారిగా మశూచికి టీకా కనుగొన్నారు. ఇది మశూచితో పోరాడేలా మనిషిలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ప్రజలకు భారీగా టీకాలు వేేయడంతో 1980లో డబ్ల్యూహెచ్‌వో భూమిపై మశూచి పూర్తిగా తొలగిపోయినట్లు ప్రకటించింది.


స్పానిష్‌ ఫ్లూ: వైద్యుల కృషా? వైరస్‌ లక్షణమా??

స్పానిష్‌ ఫ్లూ తొలి ప్రపంచ యుద్ధం తర్వాత 1918లో స్పెయిన్‌లో మొదలై రెండేళ్లపాటు అన్ని దేశాలపై విరుచుకుపడి 5కోట్ల మంది ప్రాణాలు తీసింది. మనదేశంలోనూ లక్షల మందిని బలితీసుకుంది. ఇది రెండేళ్లలో కనుమరుగైంది. వైరస్‌ బాధితులకు వచ్చే న్యూమోనియాకు వైద్యులు సరైన చికిత్స అందించి నయం చేయడంతోనే ఫ్లూ ప్రభావం తగ్గిందని కొందరు, ఫ్లూ రావడం... కొన్నాళ్లపాటు ప్రభావం చూపించి వెళ్లడం సాధారణ విషయమేనని మరికొందరు వాదిస్తున్నారు.


కలరా... పరిశుభత్రతోనే మాయం

19వ శతాబ్దం మొత్తం కలరా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపింది. లక్షల మందిని బలి తీసుకుంది. మొదట్లో ఇది చెడు గాలుల ద్వారా వస్తుందని అంతా భావించారు. జాన్‌ స్నో అనే వైద్యుడు మాత్రం తాగునీటిలోనే వ్యాధి కారక క్రిములున్నాయని అనుమానించారు. కలరా ఎలా వస్తుందనే అంశంపై పరిశోధన ప్రారంభించారు. చివరకు ఒక ఆధారం లభించింది. లండన్‌లోని ఓ ప్రాంతంలో వీధి కుళాయి చుట్టుపక్కల నివసిస్తున్న 500 మంది కలరా బారిన పడటం గమనించారు. నీరు కలుషితం కావడంతోనే కలరా వస్తోందని గుర్తించారు. నిజానికి కలరా విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. అది కలుషిత నీటిని ఆవాసం చేసుకుంటుంది. ఆ నీరు తాగిన వ్యక్తుల్లోకి బ్యాక్టీరియా చేరి కలరా వస్తుంది. బ్యాక్టీరియాపై అవగాహన లేకపోయినా స్నో స్థానిక అధికారులతో మాట్లాడి కుళాయిని తీసేయించాడు. దీంతో స్థానికంగా కలరా వ్యాప్తి ఆగింది. స్నో ప్రయత్నం... ఒక్కరాత్రిలో కలరాను అంతం చేయకపోయినా.. పరిశుభత్ర, తాగునీరు కలుషితం కాకుండా చూడాల్సిన అవసరాన్ని ప్రపంచానికి తెలియజెప్పింది. తద్వారా పరిశుభ్రత పెరిగి కలరా నిర్మూలనకు నాంది పలికింది.

- ఈనాడు, ఇంటర్నెట్‌ డెస్క్‌

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.