close

ప్రధానాంశాలు

మాస్కుతోనే బయటకు

దిల్లీ, ముంబయిల్లో ఇవి తప్పనిసరి
యూపీలో హాట్‌స్పాట్లు ఉన్న జిల్లాల సరిహద్దుల మూసివేత

దిల్లీ: కరోనా వైరస్‌ను కట్టడి చేసే చర్యల్ని ముమ్మరం చేయడంపై వివిధ రాష్ట్రాలు దృష్టి సారించాయి. దిల్లీలో ప్రజలు ఇంటినుంచి బయట అడుగుపెట్టాలంటే తప్పనిసరిగా ముఖానికి మాస్కులు ధరించాలని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. వస్త్రంతో ఇంట్లో తయారుచేసుకున్న మాస్కులైనా వాడుకోవచ్చని స్పష్టం చేశారు. దిల్లీలోని 20 హాట్‌స్పాట్‌లకు రాకపోకల్ని పూర్తిగా స్తంభింపజేయాలని నిర్ణయించారు. ముంబయి, జమ్మూ-కశ్మీర్‌, లద్దాఖ్‌లలోనూ మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశారు. మాస్కులు లేకుండా బహిరంగ ప్రదేశాలకు వస్తే సెక్షన్‌-188 కింద అరెస్టు చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.

కర్ఫ్యూ తరహాలో ఆంక్షలు
హాట్‌స్పాట్లు ఉన్న 15 జిల్లాల సరిహద్దుల్ని ఈ నెల 15 వరకు మూసివేయాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ ఇప్పటి కంటే కఠినంగా.. కర్ఫ్యూ తరహా ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించింది. నిత్యావసరాల కొనుగోలుకైనా ప్రజలు బయటకు వచ్చే వీలుండదని, పాలు-కూరగాయలను ఇళ్లవద్దకే తీసుకువెళ్లి అందిస్తామని అధికారులు ప్రకటించారు. మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశారు. ఆ ప్రాంతాల్లోకి మీడియాను కూడా అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. వైద్యం కోసం వెళ్లే వాహనాలు మినహా మరేవీ తిరగడానికి వీలుండదన్నారు. యూపీలో కరోనా కేసులు 343కి చేరడంతో పరిస్థితిని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సమీక్షించిన మీదట ఈ నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం అన్ని జిల్లాల సరిహద్దులూ మూసివేస్తారని తొలుత ప్రచారం జరగడంతో నిత్యావసరాలను కొని నిల్వ చేసుకునేందుకు ఒక్కసారిగా ప్రజలు ఎగబడ్డారు. మరోవైపు.. భౌతిక దూరం, వ్యాధిని కట్టడి చేయడం అనే అంశాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. దేశంలో పరిస్థితుల కారణంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో రైల్వేశాఖ తన లక్ష్యాలను చేరుకోలేకపోయింది. సరకు రవాణా ద్వారా రావాల్సిన ఆదాయం కంటే రూ.2129 కోట్లు తక్కువ లభించింది.


పిల్లులు, కుక్కలతో వైరస్‌ సోకదు
 భాజపా నాయకురాలు మేనకా గాంధీ

దిల్లీ: పిల్లులు, కుక్కలు మనిషికి స్వచ్ఛమైన ప్రేమనే పంచుతాయని, వాటిని ఆదరించాలని భాజపా నాయకురాలు మేనకా గాంధీ చెప్పారు. మూగజీవాల ద్వారా కరోనా సోకుతుందన్న వదంతులను నమ్మవద్దని కోరారు. ‘‘అమెరికా జూలో పులికి వైరస్‌ సోకిందని టీవీల్లో చూసి, చాలామంది పిల్లులకూ కరోనా వస్తుందని అపోహపడుతున్నారు. పిల్లికి, పులికి చాలా తేడా ఉంది. మార్జాలాలు ఎంతో భద్రమైన జీవులు. వాటిని వీధుల్లో తిరగనివ్వండి. కుక్కలు కూడా అంతే’’ అని ఆమె పేర్కొన్నారు. చాలాచోట్ల కుక్కలు, పిల్లులపై జనం దాడిచేసి చంపేస్తున్న ఘటనలపై ఆమె బుధవారం స్పందించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.