close

ప్రధానాంశాలు

మహమ్మారితో కుటుంబాలు విలవిల

ఒక్కో ఇంట్లో ఇద్దరి నుంచి తొమ్మిది మంది వరకూ బాధితులు
20కి పైగా ఇళ్లలో ఇదే పరిస్థితి
ఇరుకు గదులు, అవగాహన లేమితో వైరస్‌ వ్యాప్తి
ఈనాడు - హైదరాబాద్‌

కరోనా వైరస్‌ పేరెత్తితేనే వణుకు పుడుతోంది. ఇంట్లో ఒకరికి ఈ వ్యాధి సోకితేనే కుటుంబమంతా హడలిపోతోంది. అలాంటిది కుటుంబ సభ్యుల్లో ఇద్దరు.. ముగ్గురు.. తొమ్మిది మందికి కూడా వైరస్‌ వ్యాప్తి చెందితే.. వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఊహించడమే కష్టం. ఇలా ఇబ్బంది పడుతున్న కుటుంబాలు రాష్ట్రంలో 20కి పైగా ఉన్నాయి. అంతర్జాతీయ ప్రయాణికుల ద్వారా కుటుంబ సభ్యులకు వ్యాప్తి చెందిన కేసులతో పాటు దేశీయ ప్రయాణాలు.. ముఖ్యంగా మర్కజ్‌ ప్రయాణానంతరం ఈ తరహా కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైరస్‌ వ్యాప్తి పట్ల అవగాహన లేకపోవడం ఒక కారణమైతే.. సామాజిక, కుటుంబ, ఆర్థిక పరిస్థితులూ మరో కారణం. ప్రధానంగా మర్కజ్‌కు వెళ్లొచ్చినవారి ద్వారా కుటుంబ సభ్యుల్లో వ్యాప్తి చెందిన కేసులను పరిశీలిస్తే.. వారిలో అత్యధికులు చిరు వ్యాపారులు. రోజువారీ పనులు చేసుకునే పేదలు, దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందినవారే ఎక్కువ. వీరిలో అత్యధికులు ఇరుకు లేదా ఒకటి.. రెండు గదులున్న ఇళ్లలో నివసించేవారు కావడంతో.. కుటుంబ సభ్యులకు త్వరగా వ్యాప్తి చెందిందని వైద్యవర్గాలు విశ్లేషిస్తున్నాయి.

* హైదరాబాద్‌ చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన ఒక కుటుంబంలో ఏకంగా 9 మందికి వైరస్‌ వ్యాప్తి చెందింది. ఇందులో ఇద్దరు మర్కజ్‌కు వెళ్లి వచ్చిన ప్రయాణికులు కాగా, మిగిలిన వారందరికీ వీరి ద్వారా వైరస్‌ సోకింది.
* చాంద్రాయణగుట్టలోనే ఇదే కుటుంబానికి సమీపంలో ఉన్న మరో కుటుంబంలోనూ ఐదుగురు వైరస్‌ బారినపడ్డారు. ఇందులో ఒకరు దిల్లీ ప్రయాణికుడు కాగా, మిగిలినవారికి ఆయన ద్వారా వ్యాధి వ్యాప్తి చెందింది.
* నిజామాబాద్‌ జిల్లాలో మర్కజ్‌ వెళ్లొచ్చిన ఒక వ్యక్తికి పాజిటివ్‌ రాగా.. అతని వల్ల మొదట భార్యకు, మనవడికి వచ్చింది. ఈ మధ్యలో కుమార్తె తన పిల్లలతో వచ్చి వెళ్లింది. దీంతో బాధితుడి కుమార్తెకు, ఈమె ముగ్గురు పిల్లలకు కూడా పాజిటివ్‌ వచ్చింది. ఇలా ఒక్కరి వల్ల ఆరుగురికి వైరస్‌ సోకింది.
* సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకోటకి చెందిన ఒకే కుటుంబంలోని ఆరుగురికి కరోనా సోకింది. జిల్లా కేంద్రంలోని కుడకుడకు చెందిన ఓ వ్యక్తి మత ప్రార్థనల కోసం దిల్లీ వెళ్లి ఇటీవల వచ్చారు. ఆయనకు వైరస్‌ సోకినట్లు ఈనెల 2న అధికారులు గుర్తించారు. సదరు వ్యక్తి ఇద్దరు బావమరుదుల దంపతులు, అత్త, మరదలుకు వ్యాధి సోకినట్లు తేలింది.
* కుత్బుల్లాపూర్‌లో ఒకరి నుంచి ఆ కుటుంబంలో మరో నలుగురికి కరోనా సోకింది. ఇందులో దిల్లీకి వెళ్లొచ్చిన ప్రయాణికుడు మరణించగా, మిగిలిన కుటుంబ సభ్యులు చికిత్సలో ఉన్నారు.
* నల్గొండలోఒకే కుటుంబంలో నలుగురికి కరోనా సోకింది. ఆ కుటుంబ పెద్ద  మర్కజ్‌కు వెళ్లి రాగా, ఈయననుంచి మిగిలిన వారికి సోకింది.
* కామారెడ్డి జిల్లా బాన్స్‌వాడలో దిల్లీ నుంచి వచ్చిన వ్యక్తిలో కరోనా గుర్తించగా, అదే ఇంట్లో ఉన్న ఈయన కుమారుడు, కోడలుకు కూడా వైరస్‌ సోకింది.
* మహబూబ్‌నగర్‌లో ఓ కుటుంబంలో 23 రోజుల పసికందుకూ కరోనా వచ్చింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఓ వ్యక్తితో కలవడం వల్ల మొదట ఇంటి యజమానికి పాజిటివ్‌ రాగా, తర్వాత ఆయన తల్లికి, పసికందుకు వైరస్‌ సోకినట్లు గుర్తించారు. ఈయనను కలిసిన భార్య,భర్తలకూ కరోనా సోకినట్లు నిర్ధారించారు.
* దోమలగూడలో నివసిస్తున్న ఒక కార్పొరేట్‌ ఆసుపత్రి వైద్యుడికి కరోనా వైరస్‌ సోకగా, ఆయన నుంచి భార్యకు,  తల్లికి సోకింది.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక యువకుడి ద్వారా అతని తండ్రికి, వారింట్లో వంటమనిషికి సోకింది.
* గద్వాల జిల్లాలోని శాంతినగర్‌లో కరోనా పాజిటివ్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ వ్యక్తి కుమారుడు, కోడలుకూ వైరస్‌ వచ్చింది. అయిజలోనూ తండ్రీకొడుకులకు కరోనా సోకింది.
* మెదక్‌లో ఓ వ్యక్తికి కరోనా వచ్చింది. ఈయన కుటుంబ సభ్యులను పరీక్షించగా.. తొలుత ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. మరోసారి పరీక్షలు చేయగా నెగెటివ్‌ అని తేలింది.
* కరీంనగర్‌లో ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇండోనేసియన్లతో సన్నిహితంగా తిరిగిన ఓ యువకుడితో పాటు అతని తల్లి, సోదరికి వ్యాధి వ్యాప్తి చెందింది.
* హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌ సమీపంలోని ఓ కుటుంబంలో ముగ్గురికి వైరస్‌ సోకింది. ఇందులో 20 ఏళ్ల యువతితో పాటు 11 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు.
* హైదరాబాద్‌ ఫాతిమా మసీదు సమీపంలోని ఒక కుటుంబంలో ఇరువురు వైరస్‌ బారినపడ్డారు.
* వరంగల్‌ నగర జిల్లా జులైవాడకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.