close

ప్రధానాంశాలు

మరో 49 కేసులు

453కు పెరిగిన కరోనా బాధితులు
5 లక్షల చొప్పున ఎన్‌ 95 మాస్కులు, వ్యక్తిగత కిట్లు కొనుగోలు
వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల వెల్లడి

గత నాలుగు రోజులుగా పెద్దఎత్తున నమూనాలు సేకరించాం. ఈ రోజుకు 95 శాతం భారం తగ్గింది. మరో 535 నమూనాల ఫలితాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. గురువారానికి అవి వెల్లడవుతాయి. దీంతో మర్కజ్‌ వెళ్లి వచ్చినవారు, వారి సన్నిహితుల్లో పరీక్షల ప్రక్రియ పూర్తవుతుంది. శుక్రవారం నుంచి ఇక పరిమిత సంఖ్యలోనే నమూనాలు వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఇక ముందు భారీగా కేసుల సంఖ్య పెరిగే అవకాశాలైతే లేవు. గాంధీ, ఛాతీ వ్యాధుల వైద్యశాల, కింగ్‌కోఠి ఆసుపత్రుల్లో మాత్రమే కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఏ జిల్లాలోనూ కరోనా చికిత్సలు జరగడంలేదు. కొత్తగా వచ్చే రోగులు ఇక గాంధీ ఆసుపత్రిలో మాత్రమే ఉంటారు.

- ఈటల రాజేందర్‌, వైద్యఆరోగ్యశాఖ మంత్రి

ఈనాడు,  హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా మరో 49 కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో బుధవారం నాటికి  బాధితుల సంఖ్య 453కు పెరిగింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా వైరస్‌ బారిన పడి 11 మంది మృతిచెందగా.. 45 మంది పూర్తిగా కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి అయ్యారు. ప్రస్తుతం వేర్వేరు ఆసుపత్రుల్లో 397 మంది చికిత్స పొందుతున్నారు. వీరందరి ఆరోగ్యం నిలకడగా ఉందనీ, ఒక్కరు కూడా ఐసీయూలో, వెంటిలేటర్ల మీద లేరని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. వారు కోలుకుంటున్న విధానాన్ని బట్టి, వారిలో నెగిటివ్‌ వచ్చినవారిని దశలవారీగా ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి చేస్తామని ఆయన పేర్కొన్నారు. బుధవారం వెల్లడైన ఫలితాల్లో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 17 కేసులు కొత్తగా నమోదు కాగా, ఆ తర్వాత వరుసలో హైదరాబాద్‌లో 11, నిర్మల్‌లో 6, మేడ్చల్‌లో 3, నిజామాబాద్‌లో 3, కామారెడ్డిలో 2, ఖమ్మంలో 2 చొప్పున నమోదయ్యాయి. నల్గొండ, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, సూర్యాపేట, భూపాలపల్లి జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున కొత్తగా నిర్ధారించారు.

భారీగా వ్యక్తిగత రక్షణ కిట్లు
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగినా.. ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం భారీగా వ్యక్తిగత పరిరక్షణ కిట్లను కొనుగోలు చేయడానికి ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ వద్ద కరోనా వార్డుల్లో వినియోగించే దుస్తులు(పీపీఈ) 80 వేలు అందుబాటులో ఉండగా.. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా మరో 5 లక్షల పీపీఈ కిట్ల కొనుగోలుకు ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయి. కరోనా బాధితులకు చికిత్స అందించడంలో కీలకంగా ఉపయోగించే ఎన్‌ 95 మాస్కులు ప్రస్తుతం లక్షకు పైగానే ఉన్నట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి. వీటిని కూడా 5 లక్షలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు రెండు కోట్ల సర్జికల్‌ మాస్కులు, కోటి చేతి తొడుగుల కొనుగోలుకు ఆదేశాలిచ్చారు. నిర్ధారణ పరీక్షల కోసం 3.5 లక్షల కిట్లను తర్వలో అందుబాటులోకి తేనున్నారు.గచ్చిబౌలి ఆసుపత్రిని 1,500 పడకలతో తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రంలోని 22 ప్రైవేటు బోధనాసుపత్రుల్లో పూర్తిస్థాయిలో కొవిడ్‌ చికిత్స కోసం 15,040 పడకలను సిద్ధం చేశారు.

గుండె నిబ్బరంతో సేవలందించాలి: ఈటల
రాష్ట్రంలో కరోనా వైరస్‌ బాధితులకు చికిత్స అందించడంలో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది గొప్పగా కృషిచేస్తున్నారనీ, వారు ఇదే స్ఫూర్తితో గుండెనిబ్బరంతో సేవలందించాలని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కోరారు. కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో మంత్రి బుధవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వ వైద్యంలో ఎక్కడ కూడా ఔషధాల లోటు లేదు. అన్ని రకాల వ్యక్తిగత పరిరక్షణ వస్తువులను పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నాం. దిల్లీ మర్కజ్‌ నుంచి వచ్చిన 1100 పైచిలుకు వ్యక్తులందరినీ పరీక్షించాం. కొన్నింటి ఫలితాలు రావాల్సి ఉంది. నెగిటివ్‌ వచ్చిన వారిని స్వీయ గృహ నిర్బంధంలో ఉండాల్సిగా సూచించి ఇంటికి పంపించాం. ఈనెల 21 వరకూ వారు తమ ఇళ్ల నుంచి బయటకు రాకుండా నిత్యం రెండుసార్లు చొప్పున పరిశీలిస్తున్నాం. వారితో సన్నిహితంగా ఉన్న మరో 3,158 మందిని కూడా 167 క్వారంటైన్‌ సెంటర్లలో పెట్టి పరీక్షలు నిర్వహించాం. వీరిలోనూ నెగిటివ్‌ వచ్చిన వారిని 28వ తేదీ వరకూ స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలని సూచించి పంపిస్తున్నాం’ అన్నారు.


నీకో ముద్ద.. నాకో ముద్ద!

‘ఆపత్కాలంలో దొరికిందే పరమాన్నం.. తిందాం చెరిసగం..’ అంటూ తన బాబుకు ఆప్యాయంగా తినిపిస్తున్న ఓ తల్లి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న కూలీలను స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు అందించే ఆహార పొట్లాలు ఆదుకుంటున్నాయి. బుధవారం కూకట్‌పల్లిలో కొందరు యువకులు పంచిన ఆహార ప్యాకెట్లు తీసుకొని గబగబా ఇంటికొచ్చి ఇలా తన బాబు ఆకలితీర్చిన తల్లి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

-ఈనాడు, హైదరాబాద్‌


ఏపీలో 34 కొత్త కేసులు
మొత్తం 348 మందికి సోకిన కరోనా

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఒక్కరోజే 34 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 348కి చేరింది. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం సాయంత్రం 7 గంటల వరకు ఎనిమిది జిల్లాల్లో కొత్త కేసులు నమోదయ్యాయి. జిల్లాలవారీగా చూస్తే.. గుంటూరు-8, అనంతపురం-7, కృష్ణా-6, నెల్లూరు-5, ప్రకాశం-3, చిత్తూరు-3, కర్నూలు-1, పశ్చిమగోదావరి-1 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల్లో దాదాపు సగం (49.42%) కర్నూలు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోనే ఉన్నాయి.


ఒకే కుటుంబంలో ఏడుగురికి పాజిటివ్‌

ఈనాడు, విజయవాడ: విజయవాడలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరిలో ఒకరు మృతి చెందారు. విజయవాడకి చెందిన 35 ఏళ్ల వ్యక్తి దిల్లీ వెళ్లి వచ్చారు. ఇతని ద్వారా తండ్రికి వైరస్‌ సోకింది. ఆయనను మార్చి 30న విజయవాడలోని కొవిడ్‌ ఆసుపత్రికి తరలించగా.. అదేరోజు మరణించారు. ఆయన అంత్యక్రియల్లో చాలామంది పాల్గొన్నారు. చనిపోయిన తర్వాత వచ్చిన కరోనా పరీక్షల నివేదికల్లో ఆయనకు పాజిటివ్‌ అని తేలింది. దీంతో అంత్యక్రియల్లో పాల్గొన్న వారందరినీ క్వారంటైన్‌కు పంపారు. దిల్లీ వెళ్లి వచ్చిన వ్యక్తి పదేళ్ల కుమారుడు, తమ్ముడు, అతని ఎనిమిదేళ్ల కుమార్తె నలుగురికీ 5రోజుల క్రితం పాజిటివ్‌ వచ్చింది. తాజాగా బుధవారం వచ్చిన నివేదికల్లో అతని బాబాయ్‌ భార్యకు, ఆమె చెల్లెలికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో దిల్లీ నుంచి వచ్చిన వ్యక్తిద్వారా ఆ కుటుంబంలో మరో ఆరుగురికి కరోనా సోకినట్లయింది.


తమిళనాట 738కి  చేరిన కరోనా కేసులు
బుధవారం 48 మందికి నిర్ధారణ

ఈనాడు డిజిటల్‌, చెన్నై: తమిళనాట బుధవారం మరో 48 మందికి కొవిడ్‌-19 నిర్ధారించినట్లు ఆరోగ్యశాఖ కార్యదర్శి బీలా రాజేశ్‌ వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 738కి చేరింది. తాజాగా నమోదైన 48 పాజిటివ్‌ కేసుల్లో 42మంది దిల్లీ మత కార్యక్రమానికి వెళ్లొచ్చినవారని తెలిపారు. నలుగురు వైద్యులకూ కరోనా సోకింది. బుధవారం వేలూరు జిల్లాకు చెందిన 45 ఏళ్ల కరోనా బాధితుడు చికిత్స పొందుతూ మరణించారు. దీంతో రాష్ట్రంలో ఈ వ్యాధితో చనిపోయినవారి సంఖ్య 8కి చేరింది. తంజావూర్‌లో కరోనా బాధిత మహిళకు మగశిశువు పుట్టాడు. తల్లీబిడ్డలను ప్రత్యేకవార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. శిశువు నమూనాలను పరీక్ష కోసం ప్రయోగశాలకు పంపారు.


కర్ణాటకలో 6 కొత్త కేసులు
మొత్తం కేసుల సంఖ్య 181

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: కర్ణాటకలో బుధవారం ఆరుగురికి కరోనా సోకింది. కలబురగిలో ఈ వైరస్‌తో మరొకరు కన్నుమూయడంతో రాష్ట్రంలో ఈ వ్యాధి మృతుల సంఖ్య 5కు చేరింది. రాష్ట్రంలో బాధితుల సంఖ్య బుధవారానికి 181 అని ఆరోగ్యశాఖ తెలిపింది. ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన 26 ఏళ్ల గర్భిణికీ పాజిటివ్‌ అని నివేదిక వచ్చింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.