close

ప్రధానాంశాలు

వెళ్లొస్తాం.. మళ్లొస్తాం

41 రైళ్లలో అర లక్ష మందికి పైనే వలస కార్మికుల తరలింపు
పేదల బతుకుల్లో వెల్లివిరిసిన ఆనందం
తెలంగాణ నుంచి 11 రాష్ట్రాలకు పయనం
ఈనాడు - హైదరాబాద్‌

ఒకదాని వెంట ఒకటి... 41 రైళ్లు... ఒక్కో రైలులో గరిష్ఠంగా 1700 మంది దాకా..11 రాష్ట్రాలకు..మొత్తంగా 50-60 వేల మందికి పైగా వలస కార్మికులు తెలంగాణ నుంచి తమ ఊర్లకు సంతోషంగా బయలుదేరారు. లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత మళ్లీ వస్తామంటూ వీడ్కోలు తెలిపారు. దీంతో రెండు నెలల వారి నిరీక్షణ... సొంతూరి కల నెరవేరింది.. ‘మీ రైలు టికెట్‌ ఖరారైంది. ఈ రోజే ప్రయాణం’ అంటూ ఫోన్‌కు సందేశం అందగానే ఆనందంతో మూటముల్లె సర్దుకుని అధికారులు ఏర్పాటుచేసిన బస్సులు, ఇతర వాహనాల్లో శనివారం స్టేషన్లకు చేరుకున్నారు. హైదరాబాద్‌లోని ప్రధాన, శివారు స్టేషన్లతో పాటు మహబూబ్‌నగర్‌, కాజీపేట నుంచి కూడా ఏర్పాట్లుచేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డిలు శనివారం సాయంత్రం హైదరాబాద్‌ (నాంపల్లి) స్టేషన్‌కు వెళ్లి శ్రామిక్‌ ప్రత్యేక రైలును జెండా ఊపి ప్రారంభించారు. కార్మికులకు వీడ్కోలు పలికారు. రాష్ట్ర పునర్‌నిర్మాణంలో వలసకార్మికులు ఓ భాగమని ఈ సందర్భంగా డీజీపీ అన్నారు. పోలీసుశాఖ అదనపు డీజీపీ జితేందర్‌, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, ఆర్థికశాఖ కార్యదర్శి రోనాల్డ్‌రాస్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు
లాక్‌డౌన్‌తో తెలంగాణలో చిక్కుకున్న వారిని శనివారం పెద్దసంఖ్యలో స్వస్థలాలకు తరలించారు. సాయంత్రం నుంచి తరలింపు మొదలైంది. తెల్లవారుజాము వరకు కొనసాగింది. ఒక్కో రైల్లో గరిష్ఠంగా 1,700 మంది వరకు పంపేలా ఏర్పాట్లుచేశారు. 50 వేల నుంచి 60 వేల మందిని తరలించినట్లు సమాచారం. సికింద్రాబాద్‌, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి తొలిసారి శ్రామిక్‌ రైళ్లు నడిపించారు. వీటితో పాటు లింగంపల్లి, ఘట్‌కేసర్‌, కాజీపేట, మహబూబ్‌నగర్‌ నుంచి తరలించారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించి రైళ్లలో ఎక్కించారు. ఒక్కో రాష్ట్రం వలసకూలీల్ని ఒక్కో రైల్వేస్టేషన్‌ నుంచి పంపారు. భారీ సంఖ్యలో రైళ్లు నడపడంతో రైల్వేస్టేషన్లు సందడిగా మారాయి. ముందు అనుకున్నట్లు కాకుండా సాయంత్రం తర్వాత కొన్ని స్టేషన్లు, బయల్దేరే రైళ్లలో మార్పులు చేర్పులు జరిగాయి.

కి.మీ.దూరం బారులు
తెలంగాణ నుంచి మే 1 నుంచి వలస కార్మికుల్ని ప్రత్యేక రైళ్లలో తరలిస్తుండగా.. సంఖ్యాపరంగా శనివారం రికార్డుస్థాయిలో శ్రామిక్‌ రైళ్లు ఏర్పాటుచేశారు. పిల్లలు మొదలు 80 ఏళ్ల వృద్ధుల వరకు..కుటుంబాలతో సహా బయల్దేరారు. వీరిని తరలించేందుకు ఒక్కో రైల్వేస్టేషన్‌కు వందలసంఖ్యలో ఆర్టీసీ బస్సులను ఏర్పాటుచేశారు. రాష్ట్ర పోలీసులు, రైల్వేపోలీసులు సమన్వయంతో స్టేషన్లలోకి పంపించారు. ఒకేసారి అంతా వస్తే ఇబ్బందులు వస్తాయన్న భావనతో వారిని బస్సులు, డీసీఎం వ్యాన్లలోనే ఉంచి.. విడతలవారీగా స్టేషన్లలోకి పంపించారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌ ముందు కిలోమీటర్‌ దూరం వరకు క్యూ ఉంది. ఎక్కువ రైళ్లు ఉండటం.. వేల సంఖ్యలో వలసకార్మికుల్ని పంపించాల్సి ఉండటం.. సమయాభావం కారణంగా కొన్నిస్టేషన్లలో థర్మల్‌ స్క్రీనింగ్‌ వేగంగా చేశారు. కొన్నిచోట్ల వ్యక్తిగత దూరం పాటించకుండా అందరూ దగ్గరదగ్గరే ఉన్నారు. బిహార్‌ వలస కార్మికుల్ని తీసుకురావడం ఆలస్యం కావడంతో సికింద్రాబాద్‌ నుంచి సాయంత్రం 4 గంటలకు వెళ్లాల్సిన తొలి రైలు ఆరున్నరకు బయల్దేరింది. ఒక్క సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కే 400లకు పైగా బస్సులు, వ్యాన్లతో 15వేల మందిని తరలించినట్లు అధికారులు తెలిపారు.
*సికింద్రాబాద్‌ స్టేషన్‌నుంచి బిహార్‌ వలసకూలీల కోసం 10 శ్రామిక్‌రైళ్లు ఏర్పాటుచేశారు. నాంపల్లి నుంచి ఒడిశాకు 8.. లింగంపల్లి నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు 8..
* ఘట్‌కేసర్‌ నుంచి మణిపూర్‌, అసోం, మధ్యప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్ర, ఒడిశాలకు 7 రైళ్లలో.. కాచిగూడ నుంచి వివిధరాష్ట్రాలకు 4 రైళ్లలో తరలింపు చేపట్టారు.
* మహబూబ్‌నగర్‌ నుంచి.. ఒడిశాలోని నౌపడ జంక్షన్‌కు 1605 మంది వలసకార్మికులతో ఒక రైలు రాత్రి 8 గంటల తర్వాత బయల్దేరి వెళ్లింది.

కాజీపేట నుంచి ఒడిశాకు
కాజీపేట రైల్వే జంక్షన్‌ నుంచి మూడు శ్రామిక్‌ రైళ్లలో సుమారు 5,000 మంది వలస కార్మికులు ఒడిశా రాష్ట్రానికి తరలివెళ్లారు. వారిని ప్రత్యేక బస్సుల్లో కాజీపేటకు చేర్చారు.


అందరినీ పంపించాం
‘‘తెలంగాణ నుంచి శుక్రవారం వరకే 88 ప్రత్యేక రైళ్లలో 1.22 లక్షల మంది వలసకార్మికుల్ని వారి సొంత రాష్ట్రాలకు తరలించాం. శనివారం 50వేల మందికి పైగా వలసకార్మికుల్ని తరలించాం. ప్రతి కార్మికుడికి రెండు ఆహారపొట్లాలు, 3 లీటర్ల మంచినీళ్ల సీసాలతో పాటు పండ్లు అందించాం. రాష్ట్ర ప్రభుత్వం వద్ద రిజిస్టర్‌ అయిన వలసకార్మికుల్ని శనివారంతో పంపించాం. వీరిలో చాలామంది తెలంగాణకు తిరిగి రావడానికి సుముఖంగా ఉన్నారు. ’’

- సోమేశ్‌కుమార్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.