close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తెలంగాణ ఇంట.. లక్ష కోట్ల పంట

త్వరలోనే రాష్ట్ర రైతాంగానికి తీపి కబురు
యావత్‌ దేశం ఆశ్చర్యపడే నిర్ణయం ప్రకటిస్తాం
నిర్వాసితులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా
మన లక్ష్యం సంపూర్ణంగా సాకారమైన చారిత్రక ఘట్టమిది
నియంతృత్వ కాదు.. నియంత్రిత సాగు..
కొండపోచమ్మ జలాశయానికి నీటి విడుదల సందర్భంగా  సీఎం కేసీఆర్
కనులపండువగా జల సంబురం
కాళేశ్వరం ప్రాజెక్టులో మరో మహోజ్వల ఘట్టం
ఆశీర్వదించిన చినజీయర్‌స్వామి

కాళేశ్వరం ప్రాజెక్టులో మహోజ్వల ఘట్టం సాక్షాత్కారమైంది. ఏకంగా సముద్రమట్టానికి 618 మీటర్ల (2028 అడుగులు) ఎత్తున గోదావరి ఎగిసిపడి కొండపోచమ్మను అభిషేకించింది. మేడిగడ్డ నుంచి తెలంగాణ బీడు భూములను ముద్దాడేందుకు తల్లి గోదారి ప్రాణహితతో కలిసి ఏడాది కిందట వెనక్కు తిరిగింది.. వంద మీటర్ల స్థాయి నుంచి ఒడుపుగా మళ్లి.. ఒక్కో అడుగు పైకెక్కుతూ అన్నారం.. సుందిళ్ల బ్యారేజీలను ముద్దాడింది. అక్కడి నుంచి గంగమ్మ శ్రీపాద ఎల్లంపల్లిని తాకి నంది.. గాయత్రి పంపుహౌజుల నుంచి మానేరు జలాశయాలను స్పృశించింది. ఆ తర్వాత బీడుబారిన నాగేటిసాళ్ల దిశగా అడుగులేసింది. రంగనాయకసాగర్‌ను చేరింది.. ఇప్పుడు కొండపోచమ్మ వద్ద ప్రణమిల్లింది.

ఈనాడు, సిద్దిపేట

తెలంగాణ ప్రభుత్వం ఆరేళ్ల అనతికాలంలోనే నీటిపారుదల రంగంలో అద్భుతాలు సాధించిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. మొత్తంగా 530 టీఎంసీల మేర గోదావరి జలాలను వినియోగించుకునే స్థాయికి చేరామన్నారు. ఇటీవల భవిష్యత్తు వ్యూహాలపై నిర్ణయం తీసుకునేందుకు ఓ సమావేశం నిర్వహించామని, తెలంగాణలో ఎన్ని పంటలు పండుతాయి.. ఏ విధంగా ఆ పంటలు మార్కెట్‌లోకి పోవాలనే అంశాలపై చర్చించామన్నారు. ఈ సందర్భంగా ఒక ఏడాదికి రూ.లక్ష కోట్ల విలువైన పంటలను మన రైతాంగం పండించబోతోందని తేలిందన్నారు. ఇది చాలా గర్వకారణమన్నారు. కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల ఎఫ్‌సీఐ సీఎండీ డీవీ ప్రసాద్‌ మాట్లాడుతూ.. దేశంలో 83 లక్షల టన్నుల వరిధాన్యం సేకరిస్తే... అందులో 66 శాతం (53 లక్షల టన్నులు) తెలంగాణ నుంచే వచ్చిందని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భూగర్భ జలమట్టాలూ పెరుగుతున్నాయన్నారు. డేంజర్‌ జోన్‌ నుంచి సేఫ్‌జోన్‌లోకి రాష్ట్రం వస్తోందన్నారు. సాహసోపేతంగా కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టామన్నారు. ఇంకా సీఎం ఏమన్నారంటే..

నేడు పసిడి పంటలతో కళకళ
‘ఆరేళ్ల క్రితం వరకు అనాథలాంటి తెలంగాణ.. ‘పల్లెపల్లెనా పల్లేర్లు మొలిసే పల్లెటూళ్లలోనా..’ అంటూ కవులు పాడుకున్న తెలంగాణ... ‘తలాపునా పారుతోంది గోదారి.. మన చేనూ చెలక.. ఎడారి..’ అని సదాశివుడు రాసిన పాటల నేపథ్యం నుంచి.. ఇప్పుడు పసిడి పంటల తెలంగాణ.. ధాన్యపు రాశుల తెలంగాణగా మారుతోంది. ఇది నాకు చాలా సంతృప్తిగా ఉంది.
నాతో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఒక మాట చెప్పారు. ‘చంద్రశేఖర్‌.. జీవితంలో చాలా తక్కువ మంది ఉద్యమాలను ప్రారంభించి ఫలితాన్ని పొందుతారు. ఉద్యమాలు ప్రారంభించిన వారు మధ్యలోనే చనిపోతారు. మిగతా వారి నాయకత్వంలో ఆ ఫలితం వస్తుంది. నీవు అదృష్టవంతుడివి. ఉద్యమాన్ని నువ్వే ప్రారంభించావు... రాష్ట్రాన్నీ సాధించావు’ అని అన్నారు. ఈ రోజు కూడా అనేక శాపాలు, దీవెనలు, కేసులు, కుట్రలు, కుతంత్రాలతో ఎందరో అడ్డంపడ్డా యావత్‌ దేశమే అబ్బురపడే ఇంజినీరింగ్‌ అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టాం. 88 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తుకు నీళ్లు వచ్చి ఈరోజు కొండపోచమ్మ సాగర్‌ నిండుతోంది.

ఇంజినీర్లందరికీ నా సెల్యూట్‌
తెలంగాణ వాళ్లకు తెలివి లేదు. పనిచేయరాదు. పరిపాలన రాదన్నారు. మా ఇంజినీర్ల్లు ఎంత శక్తిమంతులో,  నైపుణ్యవంతులో చెప్పేందుకు నిదర్శనమే కాళేశ్వరం ప్రాజెక్టు. ఈఎన్‌సీతో పాటు తెలంగాణ ఇంజినీర్ల బృందానికి సెల్యూట్‌ చేస్తున్నా. మరొక్క విశేషమేంటంటే..మాటల్లో అలకగానే ఉంటది. కానీ చేస్తే తెలుస్తది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఉపయోగించే విద్యుచ్ఛక్తి దాదాపు 4,800 మెగావాట్లు. ఇది అందుబాటులో ఉండాలి. ఇది మామూలు విషయం కాదు. గతంలో కొడకండ్లలో 400 కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకే 12 ఏళ్లు పట్టింది. దేశచరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో కొండపోచమ్మ వద్ద 400కేవీ సబ్‌స్టేషన్లు 6.. 220 కేవీ ఏడు.. 132 కేవీ 2.. నిర్మించాం. 521 కిలోమీటర్ల కొత్త లైన్లు కూడా వేశాం. నీటిపారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి, జెన్‌కో, ట్రాన్స్‌కో అధికారులు నిరంతరం శ్రమించారు. విద్యుత్తు శాఖ వారికీ ధన్యవాదాలు. రెవెన్యూ శాఖ కూడా అహోరాత్రులు కృషి చేసి భూసేకరణలో చక్కగా సహకరించారు. దేశంలో చాలా గొప్ప గొప్ప కంపెనీలన్నీ ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యులయ్యాయి. ఎల్‌అండ్‌టీ, షాపూర్‌జీ పల్లోంజి, మేఘా, నవయుగ, కేఎన్నార్‌, ఏఎమ్మార్‌ లాంటి అనేక ప్రతిష్ఠాత్మక సంస్థలు వివిధ దశల్లో కలిసి పనిచేశాయి. అందరికీ ధన్యవాదాలు. మండుటెండల్లో వలస కార్మికులూ విశేషమైన కృషి చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో చెమట చుక్కలు వదిలిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.

వారం రోజుల్లో శుభవార్త
ఏ మంచి పని జరగాలన్నా... ఆశావహదృక్పథం అవసరం. కొంతమంది విమర్శించేటోళ్లు ఉంటారు. అలాంటి వారికి పెద్ద జవాబే ఈ అద్భుతమైన ఫలితం. ఈరోజు తెలంగాణ కొత్త రాష్ట్రం.. 165 టీఎంసీల సామర్థ్యాన్ని సాధించింది. ఇంకా కొన్ని సాకారం కాబోతున్నాయి. దుమ్ముగూడెం వద్ద 35 టీఎంసీల సామర్థ్యంతో సీతమ్మసాగర్‌, దేవాదుల ప్రాజెక్టు కోసం 7.5 టీఎంసీలతో సమ్మక్కసాగర్‌ల నిర్మాణాలు పూర్తి కావొస్తున్నాయి. రైతులందరికీ త్వరలోనే నేను ఒక తీపి కబురు చెప్పబోతున్నా. దానికి సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రైతులను గొప్ప శుభవార్త అందించబోతున్నాం. అందరూ దాని కోసం వేచిచూడాలి. వారం రోజుల్లో లెక్కలు తీసి... దేశమే ఆశ్చర్యపడేంత వార్త చెప్తాం.

రూ.10వేల కోట్ల బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తోంది
భరించలేని కరెంటు కోతలు ఇప్పుడు లేవు. మిషన్‌ భగీరథ ద్వారా మంచినీటి సమస్య కూడా పరిష్కారమైంది. వికలాంగులకు రూ.3వేలు పింఛను ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణనే. పిల్లలకు సన్నబియ్యం, గురుకుల పాఠశాలలు..ఇలా సాంఘిక సంక్షేమంలో కూడా మనమే నంబర్‌ వన్‌. రైతుబంధు, రైతుభీమా ఎక్కడా లేవు. నయాపైసా ఛార్జీ లేకుండా రైతులకు 24గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్తు అందించే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. గతంలో రూ.290 కోట్ల నీటి తీరువా రద్దు చేశాం. ఇప్పుడు 4,800 మెగావాట్ల విద్యుత్తు వాడి తెస్తున్న నీళ్లనూ ఉచితంగానే రైతాంగానికి సరఫరా చేస్తాం. ఒక్క రూపాయి కూడా నీటి తీరువా వసూలు చేయం. రూ.10వేల కోట్ల విద్యుత్తు బిల్లును రైతుల పక్షాన ప్రభుత్వం చెల్లిస్తోంది. రైతు రుణమాఫీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం. కరోనా ఇబ్బందులున్నా 5 లక్షల మంది రైతులకు రూ.1,300 కోట్లు అందించాం. రాష్ట్రవ్యాప్తంగా రూ.4వేల కోట్లతో 1,250 చెక్‌డ్యాంలు నిర్మిస్తున్నాం.

ప్రత్యామ్నాయ గజ్వేల్‌ పట్టణం ఆవిర్భామవుతోంది

మంత్రి హరీశ్‌రావు, సిద్దిపేట కలెక్టరు వెంకటరామరెడ్డి నాయకత్వంలో కొండపోచమ్మ నిర్వాసితులకు అద్భుతమైన ఇళ్లను నిర్మించి ఇచ్చారు. తునికిబొల్లారం వెళితే గేటెడ్‌ కమ్యూనిటీలా కనపడుతోంది. నాకు తృప్తిగా ఉంది. నిర్వాసితుల పిల్లలకు ఉద్యోగావకాశాలు లభించేలా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీ పెట్టిస్తాం. 200 ఎకరాల భూమి కూడా ఉంది. గజ్వేల్‌లో 600 ఎకరాల్లో ఆరువేల పైచిలుకు ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇది గజ్వేల్‌ పట్టణానికి ప్రతిసృష్టి. నిర్వాసితుల కోసం సకల వసతులతో ఈ పట్టణం రాబోతోంది. భూనిర్వాసితుల పట్ల ప్రభుత్వానికి సంపూర్ణ సానుభూతి ఉంది. వారికి మంచి నష్టపరిహారం ఇచ్చాం. కానీ గూడు లేని పక్షుల్లాగా వారయ్యారు. ఆ బాధ నాకు తెలుసు. అన్ని విధాలుగా వారికి అండగా నిలుస్తాం’.


కల సాకారమైన వేళ

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఉజ్వల ఘట్టమిది. ఏ లక్ష్యం, గమ్యాన్ని ఆశించి ప్రజలు రాష్ట్రం కోసం పోరాడారో... ఆ కల సంపూర్ణంగా, సాదృశ్యంగా సాకారమైన చరిత్రాత్మక అంశం. ఇది ఒక అపురూపమైన ప్రాజెక్టు. వందలాది పంపుసెట్లున్నాయి. తొమ్మిది లిఫ్టులు దాటుకొని పదో లిఫ్టు ద్వారా నీళ్లు ఈరోజు కొండపోచమ్మ జలాశయంలోకి ప్రవహించాయి.


నిర్వాసితులకు వందనం

అందరి కంటే ముందు అతి ఎక్కువగా నేను కృతజ్ఞతలు తెలిపేది నిర్వాసితులకే. కాళేశ్వరం బ్యారేజీ నుంచి కొండపోచమ్మ వరకు భూములు కోల్పోయిన వారి త్యాగాలు వెలకట్టలేనివి. వారందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. వారి త్యాగాల వల్లనే ఈ రోజు రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు నీళ్లు అందే అవకాశం దక్కింది.


నియంత్రిత సాగు విధానంలో తెలంగాణ అద్భుతాలు చేయబోతోంది. అది నియంతృత్వ కాదు.. నియంత్రిత సాగే. ‘ముఖ్యమంత్రి గారి మాటే మా బాట’ అని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా తీర్మానాలు చేస్తున్నారు. రైతులకు ధన్యవాదాలు. దేశానికి మనం వందశాతం ఆదర్శమై తీరాలి. తెలంగాణ రైతాంగం అద్భుతాలు సృష్టించాలి. రాష్ట్రం సుసంపన్నమై అన్ని వర్గాల ప్రజలు అద్భుతంగా బతకాలి. అది నా కోరిక.. కల.. రోజురోజుకు అది సాకారమవుతూ ముందుకు పోతున్నాం’

- ముఖ్యమంత్రి కేసీఆర్‌


నయాగరా జలపాతంలా..

మీరు ఒక్కసారి ప్రాజెక్టు చూసి రండి... నయాగరా జలపాతంలా కనిపిస్తోంది. ఇప్పుడు రెండు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. మొత్తం ఆరు పంపులు మొదలైతే అద్భుతంగా ఉంటుంది..

- ముఖ్యమంత్రి కేసీఆర్‌

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.