close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
భారత్‌, ఆస్ట్రేలియా మధ్య రక్షణ బంధం

కీలక ఒప్పందం ఖరారు
సైనిక స్థావరాల పరస్పర వినియోగానికి వీలు
విద్య, సాంకేతిక రంగాల్లో మైత్రి బలోపేతం
ఇరు ప్రధానుల వర్చువల్‌ సదస్సు

దిల్లీ: సైనిక స్థావరాలను పరస్పర ప్రాతిపదికన ఉపయోగించుకునేందుకు భారత్‌, ఆస్ట్రేలియాలు ఒక కీలక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరచుకోవడానికి మరో ఆరు ఒప్పందాలను కూడా ఖరారు చేసుకున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ల మధ్య గురువారం వర్చువల్‌ శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఆ సందర్భంగా ఈ కీలక ఒప్పందాలు కుదిరాయి. రెండు దేశాల మధ్య మైత్రిని మరింత బలోపేతం చేసుకోవాలని, ఇది భారత్‌-పసిఫిక్‌కు, ప్రపంచానికి ముఖ్యమని ఇద్దరు నేతలు పేర్కొన్నారు. ఒక విదేశీ నేతతో వర్చువల్‌ సమావేశాన్ని మోదీ నిర్వహించడం ఇదే మొదటిసారి.

వాస్తవానికి ఈ శిఖరాగ్ర సదస్సు కోసం మోరిసన్‌ ఈ ఏడాది జనవరిలో భారత్‌లో పర్యటించాల్సింది. ఆ సమయంలో ఆస్ట్రేలియాలో తీవ్రస్థాయిలో కార్చిచ్చు తలెత్తడంతో ఆయన పర్యటన వాయిదా పడింది. ఇప్పుడు కొవిడ్‌ నేపథ్యంలో దీన్ని వర్చువల్‌ సదస్సుగా మార్చారు. ఇరు దేశాలకూ చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

తాజాగా కుదిరిన ‘ద మ్యూచువల్‌ లాజిస్టిక్స్‌ సపోర్ట్‌ అగ్రిమెంట్‌’ (ఎంఎల్‌ఎస్‌ఏ) ఒప్పందం కింద.. భారత్‌, ఆస్ట్రేలియాలు పరస్పరం సైనిక స్థావరాలు, మరమ్మతు కేంద్రాలు, సరకు సరఫరా వ్యవస్థలను ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. రక్షణ రంగంలో మైత్రిని పెంచుకోవడానికి మార్గం సుగమమవుతుంది. భారత్‌ ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్‌, సింగపూర్‌లతో ఇలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సైబర్‌, సైబర్‌తో ముడిపడిన కీలక సాంకేతిక పరిజ్ఞానం, మైనింగ్‌, ఖనిజాలు, సైనిక పరిజ్ఞానం, వృత్తి విద్య, జల వనరుల నిర్వహణ, వాణిజ్యం వంటి రంగాల్లో సహకారానికి కూడా భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య కొన్ని ఒప్పందాలు కుదిరాయి.

కొవిడ్‌పై పోరులో సహకారం
అంతర్జాతీయ మహమ్మారులపై సమర్థంగా స్పందించడానికి, వాటి నివారణకు వీలుగా శాస్త్ర, వైద్య రంగాల్లో పరిశోధన, అభివృద్ధి ఫలాలను పంచుకోవాలని, ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని భారత్‌, ఆస్ట్రేలియాలు నిర్ణయించాయి. కొవిడ్‌-19పై వచ్చే స్వతంత్ర, సమగ్ర విశ్లేషణలు, సూచనలకు అనుగుణంగా ఆ మహమ్మారిపై పోరు జరపాలని తీర్మానించాయి. కరోనా రోగుల చికిత్సకు వినూత్న విధానాలను రూపొందించేలా ‘ఆస్ట్రేలియా-భారత్‌ వ్యూహాత్మక పరిశోధన నిధి’లో కొత్త దశను ప్రారంభించాలని నిర్ణయించాయి.

సమోసా-కిచిడి
భేటీ చివర్లో మోదీ, మోరిసన్‌ల మధ్య సరదా సంభాషణ సాగింది. ఈ సదస్సుకు కొన్ని రోజుల ముందు సమోసాలు, మామిడికాయ చట్నీని స్వయంగా తయారుచేసి, ట్విటర్‌లో ఫొటోలు పెట్టిన మోరిసన్‌.. తదుపరి శిఖరాగ్ర భేటీ నాటికి గుజరాతీ కిచిడీని తయారుచేయాలని నిర్ణయించుకున్నట్లు తాజాగా తెలిపారు. 2014లో సార్వత్రిక ఎన్నికల సమయంలో మోదీ ‘హోలోగ్రామ్‌ ప్రచారాన్ని’ సాగించారని గుర్తు చేశారు. అలాంటి విధానాన్ని తామూ చేపట్టే అవకాశం ఉందన్నారు. తాను భారత్‌ను సందర్శించి ఉంటే మోదీ మార్కు ఆత్మీయ ఆలింగనాన్ని పొంది ఉండేవాడినని, ఆయనతో కలిసి సమోసాలు ఆస్వాదించేవాడినని తెలిపారు. దీనిపై మోదీ స్పందిస్తూ.. ‘‘మీరు తయారుచేసిన సమోసాలు భారత్‌లో చర్చనీయాంశమయ్యాయి. మీరు కిచిడీని ప్రస్తావించడం వల్ల గుజరాతీయులు సంతోషిస్తారు. అది భారత్‌లో చాలా సాధారణ వంటకం. దేశంలో దాన్ని అనేక పేర్లతో పిలుస్తుంటారు’’ అని చెప్పారు.


అవకాశంగా భావిస్తున్నాం: మోదీ

కరోనా మహమ్మారి వల్ల కలిగిన ఆర్థిక, సామాజిక నష్టాల నుంచి బయటపడేందుకు సమన్వయంతో కూడిన భాగస్వామ్యం అవసరమని మోదీ పేర్కొన్నారు. ప్రస్తుత సంక్షోభాన్ని తన ప్రభుత్వం ఒక అవకాశంగా భావిస్తోందన్నారు. అందుకు అనుగుణంగా అన్ని రంగాల్లో సమగ్ర సంస్కరణలు తెచ్చామని తెలిపారు. త్వరలోనే వాటి ఫలితాలు క్షేత్ర స్థాయిలో కనిపిస్తాయన్నారు.  ‘కష్ట కాలం’లో ఆస్ట్రేలియాలోని భారతీయులను.. ముఖ్యంగా విద్యార్థులను మోరిసన్‌ సంరక్షించారని మోదీ కొనియాడారు.


మోదీ నాయకత్వం భేష్‌: మోరిసన్‌

మోరిసన్‌ మాట్లాడుతూ.. భారత్‌-పసిఫిక్‌ ప్రాంతంలో సంక్లిష్ట సమయంల్లో మోదీ చాలా నిర్మాణాత్మక, సానుకూల పాత్రను పోషిస్తున్నారని కొనియాడారు. ఈ ప్రాంతంలో స్థిరత్వం కోసం కృషి చేస్తూ, నాయకత్వ పటిమను ప్రదర్శిస్తున్నారని చెప్పారు. ‘‘భారత్‌-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛ, సమ్మిళితత్వం, సుసంపన్నత నెలకొనాలన్నదే మా ఆకాంక్ష. ఇక్కడ భారత పాత్ర కీలకం కానుంది’’ అని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో చైనా తన సైనిక సత్తాను ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. రెండు దేశాల మధ్య వాణిజ్య బంధం ఆశించిన స్థాయిలో లేదని చెప్పారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం (సీఎస్‌పీ) ద్వారా ఇది మరింత వృద్ధి చెందుతుందన్నారు. విశాఖపట్నంలో గ్యాస్‌ లీకై చనిపోయినవారికి, భారత్‌లో కొవిడ్‌-19తో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం తెలిపారు.


సంయుక్త ప్రకటన..

మోదీ, మోరిసన్‌ల భేటీలో.. ఉగ్రవాద ముప్పు, భారత్‌-పసిఫిక్‌ ప్రాంతంలో సముద్ర భద్రతా సవాళ్లు, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో సంస్కరణలు వంటి అంశాలపై చర్చ జరిగింది. అనంతరం ఇద్దరు నేతలు ఒక సంయుక్త ప్రకటన వెలువరించారు. ఇందులోని ముఖ్యాంశాలివీ..
* భారత సంస్థల ఆఫ్‌షోర్‌ ఆదాయంపై పన్ను అంశాన్ని ‘భారత్‌-ఆస్ట్రేలియా ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందా’నికి అనుగుణంగా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకునే అంశంపై చర్చ.
* ద్వైపాక్షిక సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (సీఈసీఏ)పై మళ్లీ చర్చలు జరపాలి.
* ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం, అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ)లో సభ్యత్వం పొందేలా భారత్‌కు ఆస్ట్రేలియా మద్దతు ఇస్తుంది. పౌర అణుశక్తి రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయం.
* వ్యవసాయ రంగంలో కలిసి పనిచేయాలి. పంట కోతల తర్వాత నష్టాలు తగ్గించడానికి, ఖర్చుల హేతుబద్ధీకరణ విషయంలో భాగస్వామ్యానికిఅవకాశాలను పరిశీలించాలి.
* భారత్‌-పసిఫిక్‌ ప్రాంతంలో అన్ని దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించేలా నిబంధనలు, అంతర్జాతీయ చట్టాల ఆధారంగా నడిచే పరిస్థితులు ఉండాలంటూ రెండు దేశాలూ ప్రత్యేకంగా ఒక ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.