close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అనిశా వలలో ఆర్‌ఐ

భూవివాదంలో రూ.30 లక్షలు డిమాండ్‌
రూ.15 లక్షలు తీసుకుంటూ చిక్కిన అధికారి
రూ.1.5 లక్షలు తీసుకున్న ఎస్సై అరెస్టు
తహసీల్దార్‌ ఇంట్లో రూ.30 లక్షల లభ్యం

ఈనాడు- హైదరాబాద్‌, న్యూస్‌టుడే-ఫిలింనగర్‌, జూబ్లీహిల్స్‌, కవాడిగూడ: ఓ భూ వివాదానికి సంబంధించి అవినీతి నిరోధక శాఖ (అనిశా) వలలో రెవెన్యూశాఖకు చెందిన పెద్ద చేప చిక్కింది. ఈ వ్యవహారంతో సంబంధముందని తేలడంతో ఓ పోలీసు అధికారిపైనా కేసు నమోదైంది.
హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో రూ.50 కోట్ల విలువైన భూ వివాదం పరిష్కారానికి ఒకరి నుంచి రూ.30 లక్షలు డిమాండ్‌ చేసి.. రూ.15 లక్షలు తీసుకుంటుండగా షేక్‌పేట్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ నాగార్జునరెడ్డిని శనివారం అనిశా అధికారులు మాటు వేసి నేరుగా పట్టుకున్నారు. విచారణలో బంజారాహిల్స్‌ ఎస్సైకి ప్రమేయం ఉందని తేలింది. ఎస్సై రూ.1.5 లక్షలు తీసుకున్నట్లు ఆధారాలు లభించాయి. ఈ కేసులో ఆర్‌ఐ, ఎస్సైలను అరెస్టు చేశామని అనిశా డీఎస్పీ అచ్చేశ్వర్‌రావు తెలిపారు. తహసీల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఐకి ఎవరైనా సహకరించారా అన్న కోణంలో గాంధీనగర్‌లోని తహసీల్దార్‌ సుజాత ఇంట్లో తనిఖీలు చేపట్టగా, రూ.30 లక్షల నగదు, బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. ఈ నగదును స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ చెప్పారు.

ఇదీ వివాదం..
హైదరాబాద్‌ పాత బస్తీకి చెందిన సయ్యద్‌ ఖాలీద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 14లో 1.20 ఎకరాల స్థలం ఉందని.. సర్వే చేయాలని గతేడాది డిసెంబరులో షేక్‌పేట తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు స్పందించకపోవడంతో ఆ భూమి తనదేనంటూ 5 నెలల క్రితం బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ తహసీల్దార్‌ సుజాత బంజారాహిల్స్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీంతో ఖాలీద్‌ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ కొనసాగుతుండగానే.. కేసు మాఫీ చేస్తానంటూ ఎస్సై రవీంద్రనాయక్‌ డబ్బు డిమాండ్‌ చేశారు. రూ.50 లక్షలు ఇస్తే భూమి మీదేనంటూ రాసిస్తానని ఆర్‌ఐ సైతం ఖాలీద్‌కు చెప్పారు.


తొలుత రూ.3 లక్షలు.. తర్వాత మరో రూ.3 లక్షలు

ఖాలీద్‌పై జనవరిలో కేసు నమోదైన వెంటనే ఎస్సై రవీంద్రనాయక్‌ కేసు మాఫీ చేస్తానని రూ.3 లక్షలు డిమాండ్‌ చేసి.. ఫిబ్రవరిలో రూ.లక్ష తీసుకున్నారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు ఖాలీద్‌పై ఏప్రిల్‌లో రెండోసారి కేసు నమోదైంది. రెండు కేసులను మాఫీ చేయాలంటే అదనంగా మరో రూ.3 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేసి, మరో రూ.50 వేలు తీసుకున్నారు. ఈక్రమంలో ఆర్‌ఐ ఫోన్‌ చేసి.. రూ.50 లక్షలు కాదు.. రూ.30 లక్షలు ఇస్తే సరిపోతుందని చెప్పారు. ఎస్సై అదనంగా రూ.3 లక్షలు అడగడం, ఆర్‌ఐ రూ.30 లక్షలు డిమాండ్‌ చేయడంతో విసుగు చెందిన ఖాలీద్‌ అనిశా అధికారులను కలిశారు. వారి సూచన మేరకు ఆర్‌ఐకి ఫోన్‌ చేశారు. ముందుగా రూ.15 లక్షలు ఇస్తానని ప్రతిపాదించగా.. అందుకు ఆర్‌ఐ అంగీకరించారు. ఖాలీద్‌ శనివారం నగదుతో బంజారాహిల్స్‌లోని షేక్‌పేట తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చారు. సమీపంలోని ఒక గల్లీలోకి.. ఆర్‌ఐ బుల్లెట్‌పై వచ్చి నగదు తీసుకుంటుండగా, అనిశా అధికారులు పట్టుకున్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.