close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఒప్పంద సేద్యం.. పూచీకత్తు తథ్యం

రైతు పంట ఇవ్వగానే 66 శాతం సొమ్ము చెల్లించాలి
ఒప్పందసేద్యం పంటలకు ఏ చట్టం వర్తించదు
ఈనాడు - హైదరాబాద్‌

‘రైతు పండించే పంటకు ఎంత ధర చెల్లిస్తారో పూచీకత్తునిస్తూ ముందుగా కొనుగోలుదారుడు రాతపూర్వకంగా తెలపాలి. ఆ ధర పంట అమ్మే వ్యవసాయ మార్కెట్‌లో ఉన్న ధరలకు అనుగుణంగా ఉండాలి’ అని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలో ఒప్పంద సేద్యం (కాంట్రాక్టు ఫార్మింగ్‌) విధానం అమలుకు అనుమతిస్తూ తెచ్చిన అత్యవసర ఆదేశాలను (ఆర్డినెన్స్‌) కేంద్ర న్యాయశాఖ తాజాగా గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా ప్రకటించింది. ఈ ఆర్డినెన్స్‌ కింద ఒప్పందం చేసుకుని పండించిన పంటలకు రాష్ట్ర మార్కెటింగ్‌ చట్టం.. వాటి నిల్వ, అమ్మకాలకు ‘నిత్యావసర సరకుల చట్టం-1995 సహా మరే చట్టం వర్తించదు.

ఒప్పందం ఒక్క పంటసీజన్‌కే...
* రైతుతో వ్యాపారి లేదా కంపెనీచేసుకునే ఒప్పం ద కాలం ఒక పంట సీజన్‌కే వర్తిస్తుంది. పాడికి సంబంధించి ఒక ఉత్పత్తి వచ్చేకాలం వరకూ ఉంటుంది. గరిష్ఠంగా ఐదేళ్లకు మించరాదు.
* పంట పండించే వారు మాత్రమే ఒప్పందం చేసుకోవాలి. భూ యజమాని విడిగా ఒప్పందాలు చేసుకోకూడదు.
* ఒప్పందం ఆధారంగా పంట పండించడానికి లేదా పాడి, మత్స్య పరిశ్రమల కోసం శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదు.  ఒకవేళ నిర్మించాల్సి వస్తే పంటకాలం పూర్తయిన తరవాత వాటిని తొలగించి పూర్వస్థితిలో భూమిని యజమానికి అప్పగించాలి.
* ఒప్పంద పత్రాలతో సాగుచేసే పంటలకు బ్యాంకులిచ్చే పంటరుణాలు, పంటలబీమా పథకం వంటి ప్రభుత్వ పథకాలన్నీ వర్తిస్తాయి.
* రైతు పొలం వద్ద నుంచి పంటను కొనుగోలుదారుడే తీసుకెళ్లాలి. అప్పుడే నాణ్యత పరిశీలించుకోవాలి. పంటను రైతు అప్పగించిన వెంటనే దాని విలువలో మూడింట రెండొంతులు (66 శాతం) చెల్లించాలి. మిగిలిన సొమ్మును కూడా కొనుగోలుదారుడు నెలలోగా ఇవ్వాలి. రైతులకు సొమ్ము ఏ పద్ధతిలో చెల్లించాలో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలివ్వాలి.
* వివాదాల పరిష్కారానికి ఓ బోర్డును కూడా రాష్ట్రమే ఏర్పాటుచేయాలి. బోర్డు వద్ద పరిష్కారం కాకుంటే ఆర్డీవోకు ఫిర్యాదు చేయాలి. ఆర్డీవో తీర్పు నచ్చకపోతే కలెక్టర్‌కి ఫిర్యాదుచేయాలి. వీరిద్దరూ ఇచ్చే తీర్పు సివిల్‌కోర్టు తీర్పుతో సమానం. ఏ ఇతర కోర్టులూ ఈ ఒప్పందాలపై జోక్యం చేసుకోరాదు.
* కొనుగోలుదారుడు రైతులకు నిర్దేశిత సొమ్ము చెల్లించడంలో విఫలమైతే ఆ సొమ్ముకు ఒకటిన్నరరెట్లు జరిమానా విధిస్తారు.


ధర 50 శాతం పెరిగితేనే నియంత్రణ

త్వరగా పాడవని వ్యవసాయ, ఆహారోత్పత్తుల చిల్లర ధరలు అనూహ్యంగా 50 శాతానికి మించి పెరిగితే తప్ప నిత్యావసర సరకుల నిల్వలపై ఎలాంటి నియంత్రణ ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. ‘‘జాతీయ నిత్యావసర సరకుల చట్ట సవరణ ఆర్డినెన్స్‌-2020’’ కేంద్ర న్యాయశాఖ తాజాగా గెజిట్‌ నోటిఫికేషన్‌లో ప్రకటించింది. ముఖ్యాంశాలు.
* దేశంలో యుద్ధం, ప్రకృతి విపత్తులు లేదా అసాధారణంగా ధరలు పెరిగినప్పుడు తప్ప వ్యవసాయ, ఆహారోత్పత్తుల నిల్వ, సరఫరాపై ఎలాంటి నియంత్రణ ఉండదు.
* ఆహార, తృణ, పప్పుధాన్యాలు, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు, నూనెగింజల పంటలు, వంట నూనెలు, పండ్లు, కూరగాయలు వంటివన్నీ ఇందులోకి వస్తాయి.
* పండ్లు, కూరగాయల చిల్లర ధరలు 100 శాతం అదనంగా పెరిగితే తప్ప వాటి నిల్వ, సరఫరాపై నియంత్రణ ఉండదు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.