close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
దేశంలో 10 చోట్ల క్లినికల్‌ పరీక్షలు

వందమంది శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు
ఇప్పటికే కీలకమైన ప్రగతి సాధించాం
బీఎస్‌ఎల్‌ 3 హై కంటెయిన్‌మెంట్‌ ఫెసిలిటీలో ‘కరోనా’ వ్యాక్సిన్‌ అభివృద్ధి చేస్తున్నాం
ఈ సదుపాయం మరెవరికీ లేదు
‘ఈనాడు - ఈటీవీ’ ఇంటర్వ్యూలో భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. దీనికి టీకా (వ్యాక్సిన్‌) ఎప్పుడు వస్తుందా అని ప్రపంచమంతా  ఎదురుచూస్తోంది. ఈ విషయంలో హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ ముందడుగు వేయడం ఆశలు రేకెత్తిస్తోంది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ (కొవాక్జిన్‌) ప్రి-క్లినికల్‌ దశను పూర్తిచేసుకొని మొదటి- రెండోదశ పరీక్షలకు అనుమతి సంపాదించింది. ఇదొక కీలకమైన మైలురాయి అని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ ఛైర్మన్‌ అండ్‌ ఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల అభివర్ణించారు. ఈ నెలలోనే 10 చోట్ల మలి దశ క్లినికల్‌ పరీక్షలు ప్రారంభించబోతున్నామని ఆయన ‘ఈనాడు - ఈటీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. ఇప్పటి వరకూ నిర్వహించిన పరీక్షల్లో ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయని, త్వరలోనే వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించగలుగుతామన్న నమ్మకం కలుగుతోందని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ తయారీకి బీఎస్‌ఎల్‌- 3 హై కంటెయిన్‌మెంట్‌ సదుపాయం అవసరమని, అటువంటి సౌకర్యం ప్రస్తుతం భారత్‌ బయోటెక్‌కు మాత్రమే ఉందని.. చైనా, అమెరికాల్లో కూడా లేదని వివరించారు.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మీ నుంచి వ్యాక్సిన్‌ రాబోతోందనే విషయం ఎంతోమందిలో ఆశలు రేకెత్తిస్తోంది. ఇప్పుడు మిగిలి ఉన్న దశలేంటి?
ఈ విషయంలో కీలకమైన ప్రగతి సాధించాం. వచ్చే వారంలో మొదటిదశ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. దేశంలోని 10 కేంద్రాల్లో దాదాపు 1200 మందికిపైగా వాలంటీర్లను నియమించుకుంటున్నాం. ఇంతవరకు కరోనా సోకనివారిని ఎంచుకుని వారికి వ్యాక్సిన్‌ ఇస్తాం. దాన్ని ఎదుర్కొనేందుకు శరీరం నిరోధకశక్తిని తయారుచేసుకుంటుంది. 28వ రోజు మేం ఆ వ్యక్తి నుంచి రక్తనమూనాలు సేకరించి దానిలో లైవ్‌ వైరస్‌ను ప్రవేశపెడతాం. అలా పెట్టినప్పుడు వైరస్‌ పెరగకూడదు. తర్వాత సిరాలజీ అధ్యయనం చేయాలి. ఆ విషయంలో మాకు పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీతో భాగస్వామ్యం ఉన్నందున ఆ అధ్యయనాన్ని ఇద్దరం కలిసి చేస్తాం. వైరస్‌ రెట్టింపు కావడానికి 15 రోజులు పడుతుంది. ప్రతి పరీక్ష ఫలితం రావడానికి 2 నుంచి 3 వారాల సమయం పడుతుంది. మొదటిదశ ట్రయల్స్‌ 30 రోజుల్లో పూర్తయ్యాక.. రెండోదశ మొదలుపెడతాం. అందువల్ల మొత్తం పరీక్షలకు, వ్యాక్సిన్‌ సమర్థత నిర్ధారణకు 3 నెలలైనా పడుతుంది. ట్రయల్‌ విజయవంతంగా నడిస్తే మేం సమాంతరంగా వ్యాక్సిన్‌ ఉత్పత్తి కూడా కొనసాగిస్తూ పోతాం. దానివల్ల వెంటనే దాన్ని మార్కెట్‌లోకి తీసుకురావడానికి వీలవుతుంది.


కరోనా టీకా ఆవిష్కరణలో ఇప్పటి వరకూ మంచి ఫలితాలు సాధించాం. తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. వాస్తవానికి చైనా, యూఎస్‌ నుంచి అనుకున్న సమయానికి వైరస్‌, రీ-ఏజెంట్స్‌ రాలేదు. అవి వచ్చి ఉంటే ఇప్పటికే చాలా ప్రగతి సాధ్యమయ్యేది. అయినా మించిపోయిందేమీ లేదు. త్వరలోనే వ్యాక్సిన్‌ను ప్రజలకు అందిస్తాం.


 మాకు పోటీ ఇతర కంపెనీలు, ఇతర దేశాలు కాదు. మాకు పోటీ కరోనా వైరసే. కరోనాపై గెలవాలి, వ్యాక్సిన్‌ తీసుకురావాలి.. అదే మా లక్ష్యం. గత 22 ఏళ్లలో మా కంపెనీ 16 వ్యాక్సిన్లు అభివృద్ధి చేసింది. టైఫాయిడ్‌లాంటి వ్యాధికి ప్రపంచంలో తొలిసారి వ్యాక్సిన్‌ను ఉత్పత్తిచేశాం. భద్రత, సామర్థ్యం విషయాల్లో ఏ బహుళజాతి సంస్థలకంటే తక్కువగా లేం.
 


మేం ఇప్పటికే జంతువులపై చేసిన అన్నిరకాల ప్రయోగాలు విజయవంతం అయ్యాయి. అందువల్ల దీని విజయంపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. కేవలం మార్కెట్‌లో స్థానం కోసం పరుగులు తీయడంలేదు. ఈ వ్యాక్సిన్‌కు బలమైన శాస్త్రీయ పునాది ఉంది. ఒకసారి అన్ని అనుమతులూ వచ్చిన వెంటనే 100-200 మిలియన్‌ డోస్‌లు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.


ప్రపంచవ్యాప్తంగా ఎన్నోచోట్ల వ్యాక్సిన్‌ తయారీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటితో పోల్చితే మీరు ఎంత ముందున్నారు?
ఎన్నో దేశాల్లో పలు సంస్థలు విభిన్నమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కరోనా వ్యాక్సిన్‌ తయారీకి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆయా సంస్థలకు ఉన్న అనుభవం, వాళ్లు ఎంచుకున్న సాంకేతిక పరిజ్ఞానం ఇక్కడ ముఖ్యం. మేం వైరస్‌లోని ఆర్‌ఎన్‌ఏను అచేతనంగా మార్చి వ్యాక్సిన్‌ తయారు చేశాం. కరోనా వైరస్‌కు పుట్టినిల్లయిన చైనా కూడా ఇదే పద్ధతిని ఎంచుకుంది. కాబట్టి మేం సరైన దారిలోనే పయనిస్తున్నట్లు అర్థమవుతోంది. పైగా చైనాతో పోల్చితే ఈ విషయంలో కొంత భిన్నంగా ప్రయత్నాలు చేస్తున్నాం.
ఇదేకాదు, మరో రెండు రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పరీక్షిస్తున్నాం. ఒకటి ఫిలడెల్ఫియాలోని థామస్‌ జెఫర్సన్‌ యూనివర్సిటీతో కలిసి డీ-యాక్టివేటెడ్‌ రేబిస్‌ వ్యాక్సిన్‌ ప్లాట్‌ఫామ్‌ కాగా, యూఎస్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ విస్‌కాన్సిన్‌తో కలిసి చేస్తున్న ‘నాసల్‌ వ్యాక్సిన్‌’ ప్లాట్‌ఫామ్‌ రెండోది. రోగుల స్థితిగతులు, పరిస్థితులను బట్టి త్వరగా వ్యాక్సిన్‌ను తీసుకురావాలనే ఆలోచనే ఈ కసరత్తుకు మూలం.

వ్యాక్సిన్‌ అభివృద్ధి- తయారీని బీఎస్‌ఎల్‌ 3 హై కంటెయిన్‌మెంట్‌ ఫెసిలిటీలో చేపట్టినట్లు చెబుతున్నారు. దీని ప్రాధాన్యం ఏమిటి?
బీఎస్‌ఎల్‌- 3 అంటే బయో సేఫ్టీ లెవెల్‌- 3 అని అర్థం. వ్యాక్సిన్‌ ఆవిష్కరణ, తయారీ ప్రక్రియలో వైరస్‌ ల్యాబ్‌ నుంచి లేదా తయారీ సదుపాయం నుంచి గాలి, నీరు లేదా అక్కడ పనిచేస్తున్న శాస్త్రవేత్తల ద్వారా బయటకు వెళ్లి ఇతరులకు సోకి శరవేగంగా విస్తరించే ప్రమాదం ఉంటుంది. అటువంటి ముప్పు తలెత్తకుండా ఉండాలంటే బీఎస్‌ఎల్‌- 3 స్థాయి సదుపాయం ఉండాలి. బీఎస్‌ఎల్‌- 3 స్థాయి ల్యాబొరేటరీలు ఎన్నో ఉన్నాయి, కానీ తయారీ సదుపాయం భారత్‌ బయోటెక్‌కు మాత్రమే ఉంది. చైనాలో కొత్తగా ఇటువంటి సదుపాయాన్ని ఏర్పాటు చేయటానికి ఇటీవల అక్కడి ప్రభుత్వం 200 మిలియన్‌ డాలర్లు కేటాయించింది. అమెరికాలోని కన్సాస్‌లో ఇటువంటి సదుపాయాన్ని ఇప్పుడు నిర్మిస్తున్నారు. ఇతర వ్యాక్సిన్ల తయారీకి ఇలాంటి సదుపాయం అవసరం లేదు. రేబిస్‌ వ్యాక్సిన్‌ తయారు చేయాలంటే బీఎస్‌ఎల్‌- 2 స్థాయి సరిపోతుంది. కానీ కరోనా వైరస్‌ విస్తరించే వేగం అధికంగా ఉండటంతో బీఎస్‌ఎల్‌- 3 సదుపాయం తప్పనిసరి అవుతోంది. దీన్ని ఏర్పాటు చేయటానికి, నిర్వహించటానికి ఎంతో ఖర్చవుతుంది.

వ్యాక్సిన్‌ ధర ఎంత ఉండవచ్చు.. ప్రజలకు అందుబాటులోనే ఉంటుందా?
ఇప్పుడే చెప్పలేం. కానీ సాధ్యమైనంత తక్కువ ధరలో అందించాలనేదే మా లక్ష్యం. మేం ఇప్పటివరకూ ఎన్నో రకాలైన వ్యాక్సిన్లను తయారు చేసి తక్కువ ధరలో ప్రజలకు అందించాం. ఉదాహరణకు రోటా వైరస్‌ టీకా ధర అమెరికాలో 65 డాలర్లు, యూరప్‌లో 80 డాలర్లు. ఇక్కడ మేం 1 డాలర్‌కే ఇవ్వగలుగుతున్నాం. కరోనా వ్యాక్సిన్‌ను కూడా ప్రజలకు భారం కాని ధరలోనే ఇవ్వాలనేదే మా ఆలోచన. ప్రస్తుత టీకా కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి పైసా తీసుకోలేదు. ఈ క్లిష్ట పరిస్థితులను మేం అవకాశంగా మలచుకోదలచుకోలేదు. అందుకే మా సొంత డబ్బుతో ప్రాజెక్టు నడుపుతున్నాం. రొటా వ్యాక్సిన్‌లా దీని ధర ఒక డాలర్‌ ఉండదు. అయితే మరెవ్వరూ మాకంటే తక్కువకు తీసుకురాలేరని మాత్రం భరోసా ఇస్తున్నా.  

వ్యాక్సిన్‌ తయారీలో ఎంతమంది శాస్త్రవేత్తలు పాలు పంచుకుంటున్నారు?
దాదాపు వందమంది శాస్త్రవేత్తలు రెండు నెలలుగా రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది బీఎస్‌ఎల్‌- 3 ఫెసిలిటీలో కరోనా ‘లైవ్‌’ వైరస్‌తో పనిచేస్తున్నారు. తమ ద్వారా ఇతరులకు, ముఖ్యంగా కుటుంబ సభ్యులకు వైరస్‌ విస్తరిస్తుందనే అనుమానంతో చాలామంది ఇళ్లకు కూడా వెళ్లటం లేదు. మా శాస్త్రవేత్తలూ ‘కరోనా యోధులే’.

- ఈనాడు బిజినెస్‌ బ్యూరో, హైదరాబాద్‌


నియంత్రణ సంస్థలు సాయం చేస్త ఈ సంవత్సరాంతానికే కొవాక్జిన్‌

    జాతీయ ఛానల్‌తో డాక్టర్‌ కృష్ణఎల్ల

ఈనాడు, దిల్లీ: నియంత్రణ సంస్థలు సాయం చేస్తే కొవాక్జిన్‌ ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి వస్తుందని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ ఛైర్మన్‌ అండ్‌ ఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. బుధవారం ఆయన ఓ జాతీయ ఛానల్‌తో మాట్లాడుతూ మొదటి, రెండోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ డేటా చాలా స్పష్టంగా ఉంటే నియంత్రణాధికార సంస్థల (రెగ్యులేటర్లు) ముందు రెండే అవకాశాలు ఉంటాయని, తొలి అవకాశం కింద వ్యాక్సిన్‌కు ఆమోదముద్ర వేసి వెంటనే విక్రయాలకు అనుమతిస్తాయని చెప్పారు. ఒకవేళ వాళ్లు సంతృప్తిచెందకపోతే మూడోదశ ట్రయల్స్‌ నిర్వహించమని కోరుతాయన్నారు. ఈ మొత్తం రెగ్యులేటర్ల మీద ఆధారపడి ఉంటుందని, ఆ సందిగ్ధత కారణంగానే తాను ఈ వ్యాక్సిన్‌ కచ్చితంగా ఎప్పుడు వస్తుందన్నది చెప్పడంలేదని తెలిపారు. ప్రస్తుతం అన్ని అనుమతులూ వేగంగా ఇస్తున్నందున ఈ ఏడాది చివరికల్లా రావచ్చని మాత్రం చెప్పగలమన్నారు. క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతమైతే ఉత్పత్తి పెద్ద సమస్యే కాదని, వెంటనే మార్కెట్‌లోకి వస్తుందని చెప్పారు. నిజానికి వ్యాక్సిన్‌ తయారీ అన్నది దీర్ఘకాలంతో కూడుకున్నది. సాధారణంగా ఇలాంటి వాటికి 15 ఏళ్లు పడుతుంది. తాము అభివృద్ధి చేసిన రొటావైరస్‌ వ్యాక్సిన్‌ మార్కెట్‌లోకి తేవడానికి 16 ఏళ్లు పట్టిందని, దాంతో పోలిస్తే ప్రస్తుత వ్యాక్సిన్‌ అభివృద్ధిలో చాలా వేగంగా ముందుకెళ్తున్నామన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.