close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాజుకు ఉండాల్సిన.. ధర్మబుద్ధి ఏదీ!

ఏపీ రాజధాని అమరావతి మహిళల ఆవేదన
ఇప్పటికీ పోలీసులు వెంటాడుతున్నారని కన్నీటి పర్యంతం
200 రోజుల దీక్ష సందర్భంగా ప్రసంగం
ఈనాడు, ఈనాడు డిజిటల్‌- అమరావతి

రాజధానికి భూములిచ్చిన రైతులు ప్రాణాలు కోల్పోతున్నా.. రాజుకు ఉండాల్సిన ధర్మబుద్ధి ఎంతమాత్రం లేకుండా జగన్‌ వ్యవహరిస్తున్నారని అమరావతి మహిళలు ఆవేదన వెలిబుచ్చారు. అమరావతి రైతుల దీక్షలు 200 రోజులకు చేరిన సందర్భంగా.. జూమ్‌ వీడియో ద్వారా పలు గ్రామాలకు చెందిన మహిళలు మాట్లాడారు. కొందరు కన్నీటి పర్యంతమయ్యారు. ‘ముఖ్యమంత్రులు శాశ్వతం కాదు.. ప్రజలు తలచుకుంటే ఎన్ని సీట్లు వచ్చిన వారినైనా పదవి నుంచి దించేస్తారు’ అని నేలపాడుకు చెందిన నాగలక్ష్మి ధ్వజమెత్తారు. నేను గెలిస్తే మూడు రాజధానులు పెడతానని ఎన్నికలకు ముందే ఎందుకు చెప్పలేదని రాయపూడికి చెందిన మాలింబీ మండిపడ్డారు. ‘రాజధాని ఎక్కడికీ వెళ్లదు, మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడని రెండు నియోకవర్గాల ఎమ్మెల్యేలూ ప్రచారంలో నమ్మించి మోసం చేశారు’ అని మందడం వాసి ప్రియాంక ఆరోపించారు. వైకాపా అంటే యువజన శ్రామిక రైతు పార్టీ... వారు రైతులకూ న్యాయం చేయాలని కోరుకుంటున్నామని వెలగపూడి నుంచి హర్ష అబ్బూరి కోరారు. మరో దిల్లీగా చేస్తానన్న మోదీ.. తమ కోసం ఏమీ చేయలేరా? అని నేలపాడు నుంచి పావని ప్రశ్నించారు. పోలీసులు తమను ఇప్పటికీ నీడలా వెన్నాడుతున్నారని మందడం వాసి గంగ వాపోయారు. ‘మోదీకి పాలాభిషేకం చేద్దామని శంకుస్థాపన చేసిన ప్రాంతంలోకి వెళ్తుంటే.. అలా చేస్తే మీకు రాజధాని వస్తుందా? భూములొస్తాయా? అని రెండు బస్సులు, జీపుల్లో వచ్చిన పోలీసులు వెనక్కు పంపారు. కాళ్లు పట్టుకున్నా వదిలిపెట్టలేదు. నోరు విప్పితే ఏ కేసు పెడతారో తెలియదు.. ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారు’ అని ఉద్దండ్రాయునిపాలెం నుంచి పులి మరియదాసు వాపోయారు. ‘అడుగడుగునా పోలీసులు.. ఇదేమైనా చైనాతో యుద్ధమా? మాట్లాడే వారిపై కేసులు పెడుతున్నారు. వాక్‌ స్వాతంత్య్రం లేదా?’ అని అనంతవరం నుంచి శివపార్వతి ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించారు.. అనవసర కేసులు పెట్టి ఇరికించారని కృష్ణాయపాలెం వాసి సుధారాణి వాపోయారు.


జగన్‌ తప్పు చేస్తున్నారు
అమరావతి దక్షిణ భారతదేశానికి అయోధ్య లాంటిది. అదో పవిత్ర భూమి. రాజధాని రైతులతో పోలీసులు వ్యవహరించిన తీరు ఏ మాత్రం సరికాదు. ఇది ప్రాథమిక హక్కులకు విరుద్ధం. రాజధాని విషయంలో సీఎం జగన్‌ తప్పు చేస్తున్నారు. ఆయన్ను ఒకటే కోరుతున్నాం. ప్రజలంతా మీ వాళ్లే. రైతుల్ని లాఠీలతో బెదిరించడం కాకుండా పిలిపించి వారు అడిగింది చేయాలి. రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు దృష్టిపెట్టాలి.
-చక్రపాణి మహారాజ్‌, ఛైర్మన్‌, అఖిల భారత హిందూ మహాసభ


నిరంకుశ విధానాలతో రాజధాని లేకుండా చేశారు
రాష్ట్రానికి సరైన రాజధాని లేకుండా చేసిన ప్రభుత్వ నిరంకుశ విధానాలను ఖండిస్తున్నా. అమరావతి రైతుల పోరాటానికి భాజపా రాష్ట్ర విభాగం తరఫున పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నాం.
 -భాజపా ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ


ప్రధాని, కేంద్రం స్పందించాల్సిందే
అమరావతి మహిళల ఆధ్వర్యంలో ఇలాంటి ఉద్యమం చేసినందుకు గర్వంగా ఉంది. చేయాల్సి వచ్చినందుకు బాధపడుతున్నాం. జేఏసీ ఆధ్వర్యంలో జరిగే మహా ఉద్యమానికి సంఘీభావం తెలియజేస్తున్నాం. సమస్యపై ప్రధాని, కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరముంది.
-ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖరరెడ్డి, ఎన్‌.దుర్గాప్రసాద్‌, తెతెదేపా


జగన్‌... ప్రజల మాట వినండి
రాజధానిని గుంటూరు, విజయవాడ మధ్య పెట్టాలన్నది ఏ ఒక్కరి నిర్ణయమో కాదు. రాష్ట్ర శాసనసభే తీర్మానం చేసింది. అమరావతిపై రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్ష పార్టీలదీ ఏకాభిప్రాయమే. సీఎం జగన్‌ దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలియడం లేదు.
-డి.రాజా, సీపీఐ జాతీయ కార్యదర్శి,


దృతరాష్ట్ర పాలన
రాష్ట్రంలో దృతరాష్ట్ర పాలన కొనసాగుతోంది. ప్రస్తుత పాలకులు కులాలు, మతాలు, ప్రాంతాలవారీగా రాష్ట్రాన్ని విభజిస్తున్నారు. దీన్ని అందరం ఎదుర్కొంటాం.
-శివారెడ్డి, అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు


ప్రపంచవ్యాప్తంగా 300 నగరాల్లో కార్యక్రమాలు

ఈనాడు, అమరావతి: రాజధానిలో 200 రోజులుగా రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలకు.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఉంటున్న తెలుగువారు మద్దతు పలికారు. వందలాది నగరాల్లో వెలుగుపూల దివ్వెలతో సంఘీభావం ప్రకటించారు. కొవిడ్‌  నిబంధనలతో బయటికి రాలేనివారు ఇళ్లలోనే కొవ్వొత్తులు వెలిగించి ఫేస్‌బుక్‌లో పోస్టులు చేశారు. న్యూజెర్సీలో వర్షం కురుస్తున్నప్పటికీ పలువురు ఇళ్ల ముందు సంఘీభావం తెలిపారు. అమెరికా, యూకే, ఐర్లాండ్‌, కువైట్‌, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్‌, సౌదీఅరేబియా తదితర దేశాల్లోని అనేక నగరాల్లో తెలుగువారు రైతుల ఆందోళనకు మద్దతు పలికారు.
* అమెరికాలోని 200 నగరాల్లో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించగా.. 230 నగరాల నుంచి స్పందన లభించిందని తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, మన్నవ మోహనకృష్ణ తెలిపారు. అమెరికాలో ఒకేసారి ఇన్ని నగరాల్లో సంఘీభావ ర్యాలీలు నిర్వహించడం ఇదే ప్రథమమని చెప్పారు. వైకాపా రాజధాని రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మాగులూరి భానుప్రకాష్‌ తెలిపారు.
* ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో యువత కొవ్వొత్తులు, ఐప్యాడ్‌లు, ప్లకార్డులు పట్టుకుని సంఘీభావం తెలిపారు.
* రాజధాని రైతులకు లండన్‌లో ఉంటున్న మంగళగిరి ప్రాంత వైద్యవిద్యార్థులు సంఘీభావం తెలిపారు.
*ట్విటర్‌లో ‘అమరావతి’ హోరు 24 గంటల్లో 5.61 లక్షల ట్వీట్లు

ఉద్యమం ట్విటర్‌ను హోరెత్తించింది. అమరావతి పోరాటం 200 రోజులకు చేరుకున్న సందర్భంగా నిర్వహించిన ‘ట్రెండ్‌ ఎట్‌ ట్విటర్‌’ కార్యక్రమంలో భాగంగా రాజధాని రైతులకు మద్దతుగా 5.61 లక్షల మంది ట్వీట్లు చేశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు కార్యక్రమం ప్రారంభించి.. శనివారం సాయంత్రం 6 గంటలకు ముగించారు. 24 గంటల్లో ‘200 డేస్‌ ఆఫ్‌ అమరావతి ప్రొటెస్ట్స్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని దేశ విదేశాల్లోని రైతులు, ప్రవాసులు ట్వీట్లు చేశారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని... ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్లు చేశారు.


రాజధాని అమరావతే..ఇక్కడా రామ మందిరం నిర్మిస్తాం
కొన్ని రోజులుగా రాజధాని ప్రజలు అంతులేని ఆవేదన, క్షోభ అనుభవిస్తున్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్నట్టుగానే, అమరావతిలోనే రాజధాని నిర్మాణం చేపట్టి తీరతాం. అమరావతిలోనూ రామమందిర నిర్మాణం చేపడతాం. ప్రధాని మోదీ లద్దాఖ్‌ వెళ్లి సైనికుల్ని పరామర్శించారు. 200 రోజులుగా పోరాడుతున్న రాజధాని రైతులతో మాట్లాడే ధైర్యం జగన్‌కు ఉందా?

-ప్రొ.జి.వి.ఆర్‌.శాస్త్రి, అఖిలభారత హిందూ మహాసభ ఉపాధ్యక్షుడు (అమరావతి పరిరక్షణ సమితి గౌరవ ఛైర్మన్‌)


 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.