close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
100శాతం నియంత్రిత సాగు

శుభసూచకం.. స్ఫూర్తిదాయకం
  అర్హులందరికీ రైతుబంధు సాయం అందాలి
  అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌ : ప్రభుత్వం సూచించిన ప్రకారం రైతులు వందశాతం నియంత్రిత విధానంలో పంటలు సాగుచేస్తుండటం శుభసూచకం. ఇది భవిష్యత్తులో సాధించే గొప్ప విజయానికి నాంది. రైతుబంధు సాయం అందని రైతులు ఏ మూలన ఉన్నా గుర్తించి అందించాలి’ అని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. రైతుబంధు అమలు, ఇతర వ్యవసాయ పథకాలపై శనివారం ప్రగతిభవన్‌లో ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు.  మంత్రులు నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ముఖ్య కార్యదర్శులు నర్సింగరావు, రామకృష్ణారావు, జనార్దన్‌రెడ్డి, ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎంవో కార్యదర్శి స్మితాసభర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో సీఎం మాట్లాడుతూ ‘తెలంగాణ గొప్ప వ్యావసాయిక రాష్ట్రంగా రూపాంతరం చెందుతోంది. నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి ప్రక్రియను తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, విత్తనాభివృద్ధి సంస్థ చేపట్టాయి. వాటి నిల్వకు అత్యాధునిక శీతలగిడ్డంగి అవసరం. దీని నిర్మాణానికి రూ.25 కోట్లు విడుదల చేస్తాం. ఏడాదిలోగా దీన్ని అందుబాటులోకి తేవాలి. రాష్ట్రవ్యాప్తంగా రైతువేదికల నిర్మాణాన్ని దసరా నాటికి పూర్తి చేయాలి. ఇవి పూర్తయితే రైతులకు రక్షణ వేదికలవుతాయి. ప్రభుత్వం సూచించిన మేరకే రైతులు వానాకాలం పంటలు సాగు చేస్తున్నారు. మక్కల సాగు వద్దంటే ఎవరూ వేయలేదు. ఇది గొప్ప పరివర్తన. నియంత్రిత సాగు పద్ధతి వందకు వంద శాతం విజయవంతం కావడం గొప్ప పరిణామం. రైతుల్లోని ఈ ఐక్యత, చైతన్యం భవిష్యత్తులో సాధించబోయే గొప్ప విజయాలకు నాంది పలికింది. ఇది శుభసూచకం. తెలంగాణ రైతులందరికీ శుభాకాంక్షలు. మీ స్పందన ప్రభుత్వానికి ఎంతో స్ఫూర్తినిస్తోంది. రైతు సంక్షేమం-వ్యవసాయాభివృద్ధి కోసం మరింతగా పనిచేయడానికి ఇది ప్రేరణగా నిలుస్తోంది.

రైతుబంధు సాయానికి గడువేమీ లేదు.
కరోనా కష్టకాలంలో ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేకపోయినప్పటికీ రైతులకు అండగా నిలవాలనే సదుద్దేశంతో రైతుబంధు సాయం విడుదల చేశాం. ఇప్పటివరకు 99.9 శాతం మంది రైతులకు సాయం అందింది. ఇంకా ఎవరైనా మిగిలిపోయినా, వెంటనే వారిని గుర్తించి సాయం అందించాలి. రైతుబంధు సాయానికి గడువేమీ లేదు. మంత్రులు తమ జిల్లాల్లో, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రైతులందరికీ సాయం అందిందా? ఇంకా ఎవరైనా మిగిలిపోయారా? అనే విషయాలను తెలుసుకుని, అందరికీ డబ్బులు అందించే ఏర్పాట్లు చేయాలి. ఈ విషయాలపై నివేదిక సమర్పించాలి. కాస్తులో(సాగులో) ఉన్నప్పటికీ కొంత మంది రైతులకు యాజమాన్య హక్కుల విషయంలో చిన్నచిన్న సమస్యలుండటం వల్ల రైతుబంధు సాయం అందడంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అలాంటి వారిని జిల్లా కలెక్టర్లు గుర్తించాలి. సమస్యలు వెంటనే పరిష్కరించాలి. యాజమాన్య హక్కు గుర్తించడానికి మోకామైనా(క్షేత్రస్థాయిలో విచారణ) నిర్వహించాలి. చుట్టుపక్కల రైతులను విచారించి యాజమాన్య హక్కులు కల్పించాలి. ఒకసారి పరిష్కారమైతే, ఎప్పటికీ గొడవ ఉండదు.
లక్ష్మాపూర్‌కు రికార్డే లేదు...
మేడ్చల్‌ జిల్లా లక్ష్మాపూర్‌ గ్రామానికి అసలు రెవెన్యూ రికార్డే లేదు. ఆ జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి చొరవ వల్ల ప్రభుత్వం మొత్తం గ్రామంలో సర్వే చేసి ఏ భూమికి ఎవరు యజమానో నిర్ధారించింది. మిగతా చోట్ల కూడా అదే జరగాలి’ అని సీఎం చెప్పారు 


రూ.2.13 లక్షల రైతుబంధు సొమ్ము వెనక్కి: పల్లా

ఈనాడు, హైదరాబాద్‌: రైతుబంధు పథకం కింద ప్రభుత్వం జమ చేసిన సొమ్మును ‘గివ్‌ ఇట్‌ అప్‌’ కింద పలువురు వెనక్కి ఇచ్చారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి శనివారం ఓప్రకటనలో తెలిపారు. మొత్తం రూ.2,13,437లను భూముల యజమానులు వెనక్కి ఇచ్చారన్నారు. ఈ సొమ్మును సమితి ఖాతాలో జమ చేశామని, రైతుల సంక్షేమం కోసం వినియోగిస్తామని తెలిపారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా శనివారం ప్రగతిభవన్‌కువెళ్లి సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదం పొందారు. సీఎం, పలువురు మంత్రులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ ఇచ్చిన హరితసవాల్‌కు స్పందిస్తూ తన ఇంటిలో దానిమ్మ, సీతాఫలం, సంపంగి మొక్కలు నాటినట్లు పల్లా తెలిపారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.