close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అయోధ్యలో దక్షిణాది సంప్రదాయం

పల్లకీలో దేవ దేవేరీల ఊరేగింపు... వీధుల్లో   సాగే ఆ ఊరేగింపు ముందు.. మనసును ఆధ్యాత్మిక డోలికల్లో ముంచెత్తే  మంగళ వాద్యాలు. దక్షిణాదిలో కనిపించే ఈ సంప్రదాయం ఉత్తర భారత్‌లోని అయోధ్యలోనూ వందేళ్లకు పైబడి కొనసాగుతుండడం విశేషం.
సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్యలో దాదాపు 5,000 ఆలయాలున్నాయి. తెల్లవారుజామునుంచే శ్రీరామ భక్తుల సందడి మొదలవుతుంటుంది. ఇక్కడి మందిరాల్లో అనేక విశిష్టతలుంటాయి. వీటిలో దక్షిణ భారత సంప్రదాయ విధానంలో పూజలు జరిపే ఆలయాలు రెండున్నాయి. అవే విజయ రాఘవ్‌రామ్‌ మందిర్‌, అమ్మాజీ మందిర్‌లు. వీటికి వందేళ్లకు పైబడిన చరిత్ర ఉంది. ఈ రెండు ఆలయాల గర్భగుడుల్లో కృత్రిమ కాంతిని పడనివ్వరు. అంటే విద్యుత్తు లైట్లే ఉండవు. ఏళ్ల తరబడి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. మూలవిరాట్‌లుండే గర్భగుడిని మాతృగర్భంగా భావిస్తారు. గర్భిణులకు ఎక్స్‌-రే తీయడానికి, సీటీ స్కాన్‌ చేయడానికి వైద్యులు ఎలా సిఫార్సు చేయరో.. అదేరీతిలో ఇక్కడి మూలవిరాట్‌పై కూడా కృత్రిమ కాంతి పడకూడదన్న ఆచారం కొనసాగుతున్నట్లు అమ్మాజీ మందిర్‌ పూజారి వెంకటాచార్య స్వామి చెప్పారు. అంతేకాదు ఇక్కడి ఆలయంలో విద్యుత్తు పంపుల ద్వారా వచ్చే నీటిని కూడా వాడరు. బావిలోంచి తోడిన నీటిని మాత్రమే వినియోగిస్తారు. ఉత్సవాల్లో అలంకరణ సమయంలో కూడా విద్యుత్తు బల్బులను వాడరు. ఇక్కడ రాముడు, సీత, లక్ష్మణ మూర్తులను ప్రత్యేకంగా ఊరేగిస్తుంటారు.

* విజయ రాఘవ్‌ రామ్‌ మందిర్‌లోనూ మూలవిరాట్‌పై లైటింగ్‌ పడనివ్వరు. కృత్రిమ కాంతి(లైటింగ్‌) శ్రీరాముడిపై పడటం మంచిది కాదని భావిస్తామని ఆలయ పూజారి ధారాచార్యజీ మహరాజ్‌ తెలిపారు. 1904లో నిర్మించిన ఈ ఆలయంలో గత 15 ఏళ్లుగా అఖండ రామనామ సంకీర్తన నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ఇక్కడ కూడా బావిలోంచి తోడితీసిన నీటినే వినియోగిస్తుంటారు.
* అయోధ్యలోని విశిష్ట మందిరాల్లో త్రేతానాథ్‌ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయాన్ని భక్తుల కోసం నెలలో రెండు రోజులు మాత్రమే తెరుస్తారు. ఏకాదశి రోజుల్లోనే దర్శనం ఉంటుంది. అయితే నిత్య పూజలు మాత్రం తమ కుటుంబం జరుపుతుందని ఆలయ పూజారి సునీల్‌ మిశ్ర తెలిపారు. రద్దీ ఎక్కువైతే ఆలయం పాడవుతుందని పూర్వకాలంలో భావించేవారని.. అదే ఆచారం ఇప్పటికీ కొనసాగుతోందని తెలిపారు.
* అయోధ్యలో లక్ష్మణుడికి ప్రత్యేకంగా ఓ ఆలయం ఉంది. దీన్నే లక్ష్మణకోటగా పిలుస్తారు. ఇక్కడ లక్ష్మణుడికి శేషావతారంలో పూజలు జరుపుతారు. 150 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పూజారి మైథిలి రామన్‌ శరణ్‌ తెలిపారు.


అతిథులు మరింత కుదింపు
170-180కి పరిమితం కానున్న ఆహ్వానితులు
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొనబోతున్న ఆడ్వాణీ, జోషి

అయోధ్య: ప్రతిష్ఠాత్మక రామ మందిర శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యే అతిథుల సంఖ్యలో మరికొంత కోత పడింది. ఈ నెల 5న జరగబోతున్న కార్యక్రమానికి తొలుత 208 మందిని అతిథులుగా ఆహ్వానించాలని ప్రతిపాదించారు. కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీన్ని 170-180కి పరిమితం చేయాలని తాజాగా నిర్ణయించారు. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా జరగబోయే భూమి పూజకు ఆరెస్సెస్‌ అధిపతి మోహన్‌ భాగవత్‌, రామజన్మభూమి న్యాస్‌ అధిపతి నృత్యగోపాల్‌ దాస్‌, సంఘ్‌ నేతలు భయ్యాజీ జోషి, దత్తాత్రేయ హోసబలే, విశ్వహిందూ పరిషత్‌ కార్యాధ్యక్షుడు అలోక్‌ కుమార్‌ తదితరులతో పాటు దాదాపు 50 మంది ఆధ్యాత్మికవేత్తలు హాజరు కానున్నారు. పార్టీ సీనియర్‌ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌జోషిలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌, ఆధ్యాత్మిక వేత్త మురారీ బాపు వంటివారి పేర్లు ఆహ్వానితుల జాబితాలో లేవు. ఆలయం కోసం ఇప్పటి వరకు రూ.18.6 కోట్లు విరాళాలుగా వచ్చాయని, వాటిని ట్రస్టు ఖాతాకు బదలాయిస్తామని మురారీ ఇటీవల ప్రకటించారు.

వేదికపై ఐదుగురే
కాశీకి చెందిన జితేంద్ర సరస్వతి, మరో ముగ్గురు వేద పండితులు కలిసి రామాలయ భూమి పూజ క్రతువు నిర్వహిస్తారు. వేదికపై ప్రధాని మోదీతో పాటు (మోహన్‌ భాగవత్‌, నృత్యగోపాల్‌ దాస్‌, యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మాత్రమే ఉంటారు. కరోనా తీవ్రత దృష్ట్యా శంకుస్థాపన వేడుకకు తరలి రావద్దంటూ అనుచరులకు, భక్తులకు ట్రస్టు నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా ఉత్సాహంతో ఎక్కువ మంది తరలివస్తే వైరస్‌ మరింత ప్రబలే అవకాశం ఉంటుందని భయపడుతున్నారు.


సున్నీ వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌కు ఆహ్వానం

ఈనాడు, దిల్లీ: రామాలయ శంకుస్థాపనలో పాలు పంచుకోవాల్సిందిగా యూపీ సున్నీ వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌ జాఫర్‌ ఫారూఖీని ట్రస్టు తరఫున ఆహ్వానించారు. బాబ్రీ మసీదు కోసం పిటిషన్‌ వేసినవారిలో ఒకరైన ఇక్బాల్‌ అన్సారీకి కూడా ఆహ్వానం పంపించారు. గత వివాదాలను పక్కనపెట్టి సామరస్య పూర్వక వాతావరణాన్ని తీసుకురావడంలో భాగంగా వీరిని వేడుకకు పిలిచారు. అయోధ్యలో ప్రముఖ సమాజ సేవకుడు మహ్మద్‌ షరీఫ్‌కు కూడా ఆహ్వానం అందింది. యోగా గురు బాబా రాందేవ్‌, మాతా అమృతానందమయి వంటివారూ ఆహ్వానితుల్లో ఉన్నారు. ఇస్లాం, క్రైస్తవ, సిక్కు మతాలకు చెందిన పలువురు ఇతర ప్రముఖుల్నీ పిలుస్తున్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.