close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పాంగాంగ్‌పై చైనా తొండి

ఫింగర్‌ కాంప్లెక్స్‌ వద్ద వెనక్కి తగ్గని డ్రాగన్‌ సేన
ఎల్‌ఏసీని ఏకపక్షంగా మార్చే యత్నం?
సీనియర్‌ కమాండర్ల భేటీలో గట్టిగా ప్రస్తావించిన భారత్‌

దిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి బలగాలను ఉపసంహరించి, శాంతిని పునరుద్ధరిద్దామంటూ చైనా చెబుతున్న మాటల్లో నిజాయితీ కనిపించడంలేదు. సైన్యాన్ని వెనక్కి తీసుకునే విషయంలో నిబద్ధతను ప్రదర్శించడంలేదు. పాంగాంగ్‌ ప్రాంతంలో తన బలగాలను కొనసాగిస్తోంది. అక్కడి ప్రతిష్టంభనపై భారత్‌తో చర్చించేందుకూ ఇష్టపడటంలేదు. ఎల్‌ఏసీని ఏకపక్షంగా మార్చాలన్న ఆ దేశ దుర్బుద్ధికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ఫలితంగా భారత్‌, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంలేదు. ఈ నేపథ్యంలో వివాదాన్ని పరిష్కరించేందుకు రెండు దేశాల సీనియర్‌ సైనిక కమాండర్లు ఆదివారం కీలక చర్చలు జరిపారు.
కొద్ది నెలలుగా భారత్‌, చైనాల మధ్య ఎల్‌ఏసీ వెంబడి పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాలూ భారీగా సైనికులు, యుద్ధవిమానాలు, ట్యాంకులు, శతఘ్నులను మోహరించాయి. ఉన్నత స్థాయిలో చర్చల అనంతరం.. ఘర్షణ ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించాలని నిర్ణయించాయి. ఈ మేరకు పలు చోట్ల సైన్యాలు వెనక్కి మళ్లాయి.
గల్వాన్‌ లోయలో గస్తీ కేంద్రం 14, హాట్‌ స్ప్రింగ్స్‌లోని గస్తీ కేంద్రం 15 వద్ద.. ఒప్పందం మేరకు బలగాలను చైనా ఉపసంహరించింది. సమస్యాత్మక గోగ్రా పోస్టు వద్ద ఉన్న ‘గస్తీ కేంద్రం 17ఎ’ వంటి చోట్ల ఆ దేశ బలగాల ఉపసంహరణ నెమ్మదించింది. అయితే పాంగాంగ్‌లోని ‘ఫింగర్‌ కాంప్లెక్స్‌’ అంశమే భారత్‌కు ఎక్కువగా చికాకు కలిగిస్తోంది. ఇక్కడ ఒప్పందం మేరకు.. అదనపు బలగాలను వెనక్కి తీసుకోవడానికి డ్రాగన్‌ ససేమిరా అంటోంది.


డ్రాగన్‌ విముఖత

పాంగాంగ్‌ విషయంలో చర్చించేందుకూ చైనా ఒప్పుకోవడంలేదు. జూన్‌లో జరిగిన చర్చల్లోనే ఈ అంశంపై డ్రాగన్‌ విముఖత ప్రదర్శించింది. ఇప్పుడు తన వైఖరిని మరింత కఠినతరం చేసింది. సరిహద్దును ఏకపక్షంగా మార్చాలన్న చైనా ఉద్దేశానికి ఇది దర్పణం పడుతోంది. ఎల్‌ఏసీ వెంబడి బలగాలను వెనక్కి తీసుకోవడం పూర్తయిందని చైనా రాయబారి ప్రకటించి, తదుపరి ఉపసంహరణలేవీ ఉండబోవన్న సంకేతాన్ని ఇవ్వడమూ ఆ దేశ వైఖరిని తేటతెల్లం చేస్తోంది. గత మూడు వారాల్లో పాంగాంగ్‌ వద్ద బలగాలను చైనా పెంచింది. అక్సాయ్‌చిన్‌లో పలు సరకు సరఫరా శిబిరాలను క్రియాశీలం చేసింది. స్వల్ప సమయంలోనే సైనిక చర్య కోసం బలగాలను తరలించేలా ఏర్పాట్లు చేస్తోంది. వీటిని భారత సైన్యం తేలిగ్గా తీసుకోవడంలేదు. ఫింగర్‌ కాంప్లెక్స్‌ వద్ద ఉపసంహరణ చేపడితేనే ప్రతిష్టంభన పరిష్కారమవుతుందని చైనాకు స్పష్టంచేసింది. ఆగస్టు 1న చైనా సైనిక దినోత్సవం. ఏటా ఈ రోజున చుషుల్‌ ప్రాంతంలో భారత్‌-చైనా సరిహద్దు సిబ్బంది సమావేశం (బీపీఎం) జరుగుతుంది. ఈ దఫా అది చోటుచేసుకోలేదు. భారత సైన్యంలోని తూర్పు విభాగం తరఫున లాంఛనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కానుకలు ఇచ్చి పుచ్చుకోలేదు.


ఏమిటీ ఫింగర్లు?

పాంగాంగ్‌ సరస్సు ఒడ్డున 8 పర్వత ఆకృతులు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కో వేలులా కనిపిస్తాయి. వీటిని ‘ఫింగర్‌ 1-8’గా పేర్కొంటారు. ఫింగర్‌ 8 వరకూ ఎల్‌ఏసీ విస్తరించిందని భారత్‌ వాదిస్తోంది. చైనా మాత్రం ఫింగర్‌ 4 వద్ద అది ఉందని చెబుతోంది. భారత సైన్యం ఫింగర్‌ 4 నుంచి ఫింగర్‌ 8 మధ్య ప్రాంతంలోనూ గస్తీ నిర్వహించేది. అయితే ఏప్రిల్‌ నుంచి ఫింగర్‌ 4ని దాటి ముందుకు వెళ్లేందుకు భారత దళాలను డ్రాగన్‌ అనుమతించడంలేదు. పైగా ఫింగర్‌ 4- 8 మధ్య ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించింది. సైనిక ఉపసంహరణకు నిర్ణయం తీసుకున్నాక స్వల్పంగానే ఇక్కడ తన సైన్యాన్ని చైనా వెనక్కి తీసుకుంది. అయితే ఫింగర్‌ 4 నుంచి ఫింగర్‌ 8 మధ్య ఉన్న ప్రాంతాల నుంచి డ్రాగన్‌ దళాలు వెనక్కి మళ్లాల్సిందేనని భారత్‌ పట్టుబడుతోంది.


భారత సేన సై

చైనా వైఖరి నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి భారత సైన్యం సన్నద్ధమవుతోంది. లద్దాఖ్‌ ప్రాంతంలోని సరిహద్దు ప్రాంతంలో నిత్యావసర వస్తువులు, సాధనాలను భారీగా నిల్వ చేసుకుంటోంది. అక్కడ చైనాకు దీటుగానే తన బలగాల సంఖ్య ఉండేలా చూసుకుంటోంది. సైనికులకు శీతల దుస్తులు, బూట్లనూ సరఫరా చేసింది. తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలో కొన్ని చోట్ల 16వేల అడుగుల కన్నా ఎత్తయిన ప్రదేశాలు ఉన్నాయి. అక్కడి సైనికులు శత్రువులతోపాటు ప్రతికూల వాతావరణంతోనూ పోరాటం చేయాల్సి ఉంటుంది.


దెప్సాంగ్‌పైనా..

ఉత్తర లద్దాఖ్‌లోని దెప్సాంగ్‌-డీబీవో సెక్టార్‌లో కొత్తగా ఘర్షణలను లేవనెత్తేందుకు చైనా ప్రయత్నిస్తోంది. దీంతో చర్చల అజెండాలోకి ఈ అంశాన్నీ భారత్‌ చేర్చింది. ఇక్కడ చైనా భారీగా బలగాలను మోహరించింది. వాహనాల సాయంతో భారత భూభాగాన్ని తరచూ అతిక్రమిస్తోంది. తన నిఘా సామర్థ్యాన్ని మెరుగుపరచుకుంది. భారత గస్తీ బృందాల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తోంది. కాలినడకన పహారా కాస్తున్న మన సైనికులను వాహనాల సాయంతో అడ్డుకుంటోంది.


కీలక చర్చలు

బలగాల ఉపసంహరణ, ఉద్రిక్తతల తగ్గింపుపై భారత్‌, చైనాల సీనియర్‌ సైనిక కమాండర్లు ఆదివారం మరోవిడత సమావేశమయ్యారు. ఇరు దేశాల నడుమ ఈ స్థాయి చర్చలు జరగడం గత రెండు నెలల్లో ఇది ఐదోసారి. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా భూభాగంలోని మోల్దోలో ఉదయం 11 గంటలకు ఈ చర్చలు మొదలయ్యాయి. తాజా చర్చల్లో ‘ఫింగర్‌ ప్రాంతాల’ నుంచి చైనా బలగాలు పూర్తిస్థాయిలో వైదొలగాల్సిందేనని భారత్‌ గట్టిగా డిమాండ్‌ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత ప్రతినిధి బృందానికి లెఫ్టినెంట్‌ జనరల్‌ హరీందర్‌ సింగ్‌, చైనా పక్షానికి దక్షిణ షిన్‌జియాంగ్‌ సైనిక ప్రాంత కమాండర్‌ మేజర్‌ జనరల్‌ లియు లిన్‌ నేతృత్వం వహించారు. శనివారం రాత్రే ఈ చర్చలకు చైనా సమ్మతి చెప్పడం గమనార్హం.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.