close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కరోనా మరణాలను ఇలా తగ్గిద్దాం

సరైన సమయంలో చికిత్సే కీలకం
తేలికపాటి మందులతోనే ప్రాణాలు నిలబెట్టొచ్చు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్‌ ఓపీ నిర్వహించాలి
రోగులూ.. సొంత వైద్యం వద్దు
చికిత్సలపై అవగాహన సదస్సులో నిపుణుల సూచనలు

ఈనాడు- హైదరాబాద్‌: కరోనా బాధితుల ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడూ పరిశీలిస్తూ.. సమయానుకూలంగా చికిత్సలు అందించడం ద్వారా మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు స్పష్టంచేశారు. బాధితుల్లో లక్షణాలను బట్టి ఏ దశలో, ఏ పరీక్షలు నిర్వహించాలనేది కూడా చికిత్సలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. వైరస్‌ తీవ్రతను నిరంతరం పరిశీలించడం ద్వారా.. తేలికపాటి ఔషధాలతోనే బాధితులు ప్రాణాపాయ స్థితికి చేరుకోకుండా అడ్డుకోవచ్చని తెలిపారు. కరోనా కట్టడిలో వైద్యులదే ప్రధాన భూమిక అని, వైద్యులు ధైర్యంగా నిలబడితే బాధితులకూ కొండంత అండ లభిస్తుందని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్సలు అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆయా వైద్యులకు కొవిడ్‌ చికిత్సలపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించింది. దృశ్య మాధ్యమంలో జరిగిన ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, వైద్యశాఖ కార్యదర్శి రిజ్వీ, వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, ప్రముఖ వైద్యనిపుణులు విజయ్‌ ఎల్దండి, ఎంవీరావు, సునీత, గంగాధర్‌, శంకర్‌, మహబూబ్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. కొవిడ్‌ చికిత్సలో అనుసరించాల్సిన విధి విధానాలపై అవగాహన కల్పించారు. వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కరోనా చికిత్సలకు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న పద్ధతులను తెలంగాణలోనూ అమలు చేస్తామని చెప్పారు. చికిత్సకు రాష్ట్రమంతటా ఒకే వైద్యవిధానం అమల్లో ఉండాలన్నారు. భయంతో ఎక్కువమంది మృతి చెందుతున్నారని, రోగుల్లో ధైర్యాన్ని నింపాలని సూచించారు. కరోనా చికిత్సలపై వైద్యులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్ణయించింది.

నిపుణుల సూచనల్లో ముఖ్యాంశాలివీ..
* ప్రస్తుతం బాధితుల్లో లక్షణాలు కనిపించగానే.. తమంతట తాముగా పరీక్షలు చేయించుకొని, సొంతంగా వైద్యం పొందుతున్నారు. ఇది సరి కాదు. లక్షణాలు కనిపించగానే అన్ని జబ్బుల మాదిరిగానే వైద్యులను సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకొని చికిత్స పొందాలి. ఇందుకోసం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా కొవిడ్‌ ఓపీ నిర్వహించాలి.
* వైద్యుని సలహా లేకుంటే సీటీ స్కాన్‌ అవసరంలేదు.
* రోగిని స్వల్ప, మధ్యస్థ, తీవ్రత, విషమం.. ఈ లక్షణాల ప్రాతిపదికన విభజించి చికిత్స చేయాలి. సీబీపీ, సీఆర్‌పీ వంటి కొన్ని చిన్నపాటి రక్త పరీక్షల ద్వారా వైరస్‌ ప్రభావాన్ని అంచనా వేయొచ్చు.
* పల్స్‌ఆక్సిమీటర్‌తో పరిశీలిస్తే ఆరోగ్య పరిస్థితి తెలిసిపోతుంది. రోగి శ్వాస తీసుకోవడం నిమిషానికి 30సార్లు కంటే ఎక్కువగా ఉంటే అత్యవసర చికిత్స అందించాలి.
* బాధితుల్లో రెండో వారంలో ‘సైటోకైన్స్‌’ ఉద్ధృతి ఎక్కువగా ఉంటే రక్తం గడ్డకట్టే ప్రమాదముంటుంది. దీని నివారణకు ‘స్టెరాయిడ్స్‌’ చికిత్స ఉపయుక్తంగా ఉంటుంది. వైరస్‌ వచ్చిన తొలిరోజుల్లో జ్వరం ఎక్కువగా ఉంటే కొందరు స్టెరాయిడ్స్‌ ఇస్తున్నారు. ఇది సరైంది కాదు.
* ఆక్సిజన్‌ స్థాయి తగ్గిన వారిని జాగ్రత్తగా గమనించాలి. రక్తంలో 94 శాతం కంటే తగ్గుతుంటే.. డెక్సామెథసోన్‌, లోమాలిక్యులర్‌ వెయిట్‌ హెపరిన్‌ వంటి ఔషధాలు వాడాలి.
* రెమిడిసివిర్‌, టోసిలిజుమాబ్‌ ఔషధాలు ప్రయోగాత్మకంగా ఇచ్చేవే. వాటి ఫలితాలు ఇంకా రుజువు కాలేదు. కాబట్టి అందుబాటులో ఉన్న ఔషధాలను సరైన సమయంలో ఇవ్వడం ద్వారానే అత్యధిక రోగులను రక్షించుకోవచ్చు. రోగి పరిస్థితి విషమించినప్పుడు యాంటీవైరల్‌ ఔషధాల ప్రభావం తక్కువే.
* గుండెజబ్బు ఉన్నవారిలో హైడ్రాక్సీక్లోరోక్విన్‌, అజిత్రోమైసిన్‌ ఔషధాలను కలిపి ఇవ్వడం అంత సురక్షితం కాదు. అజిత్రోమైసిన్‌ బదులుగా డాక్సిసైక్లిన్‌ ఇవ్వాలి.
* విటమిన్‌ సి మాత్రలను ఎక్కువ మోతాదులో వేసుకోవద్దు. దానివల్ల నష్టం జరుగుతుంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.