close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఏపీ అసెంబ్లీ రద్దుకు చంద్రబాబు సవాల్‌

ఎన్నికలకు వెళ్లి తేల్చుకుందాం
48 గంటల్లో తేల్చి చెప్పండి

ఈనాడు, అమరావతి: మూడు రాజధానుల నిర్ణయం సరైనదని భావిస్తే, దానికి ప్రజామోదం ఉందనుకుంటే అసెంబ్లీని రద్దు చేయండి.. అందరం కలిసి ఎన్నికలకు వెళ్దాం.. ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం.. అని సీఎం జగన్‌కు తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సవాల్‌ విసిరారు. ‘ప్రజలు మళ్లీ మిమ్మల్నే గెలిపిస్తే.. మేం మాట్లాడటం ఆపేస్తాం.. వారి నిర్ణయాన్ని శిరసావహిస్తాం. ఏ విషయమూ 48 గంటల్లో చెప్పండి’ అని డిమాండు చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి సోమవారం సాయంత్రం చంద్రబాబు వీడియో సమావేశం ద్వారా విలేకరులతో మాట్లాడారు.

ఎన్నికల ప్రణాళికను బైబిల్‌, భగవద్గీత, ఖురాన్‌గా భావిస్తున్నామనే వైకాపా.. 3 రాజధానుల విషయాన్ని అందులో ఎందుకు పెట్టలేదని ఆయన నిలదీశారు. ప్రజలకు చెప్పకుండా చేయడమంటే నమ్మకద్రోహమే అని ధ్వజమెత్తారు. ‘ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు ప్రజల ముందుకు వస్తా.. ధైర్యం ఉంటే తేల్చుకోండి’ అని స్పష్టం చేశారు. ఐదేళ్లకు ఓట్లేశారని.. 5 కోట్ల మంది జీవితాలతో ఆడుకునే హక్కు వైకాపాకు లేదని దుయ్యబట్టారు.

ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు
‘ప్రతిపక్షనేత హోదాలో జగన్‌ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేదన్నారు.. మరి ఇది ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం కాదా?’ అని చంద్రబాబు మండిపడ్డారు. ‘అప్పుడు చిన్న రాష్ట్రమన్నారు.. ఇప్పుడు పెద్ద రాష్ట్రమైపోయిందా? సమాధానం చెప్పండి’అని డిమాండు చేశారు. 2014 సెప్టెంబరు 4న ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ అసెంబ్లీలో అమరావతిపై చెప్పిన మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.

మా రాజీనామాలు నిమిషం పని...
‘మా పార్టీ శాసనసభ్యుల రాజీనామా ఒక్క నిమిషం పని.. సమస్య పరిష్కారం అవుతుందంటే చేస్తాం..’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్దామనే తన సవాల్‌ను స్వీకరిస్తారా? ప్రజలకు వెన్నుపోటు పొడుస్తారా? అని నిలదీశారు. రాజధాని మార్పు అనేది వైకాపా సొంత విషయం కాదని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు రాజధాని మార్పు అంశం ప్రస్తావించి ఉంటే.. ఎక్కడ చెప్పారో వెల్లడించాలన్నారు.

పకడ్బందీగానే చట్టం
రైతులకు ఇచ్చిన మాటలను తప్పడం ఏ ప్రభుత్వానికీ వీలు కాదని చంద్రబాబు పేర్కొన్నారు. వారికి రావాల్సిన ప్రయోజనాలన్నీ కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు. అమరావతిని కొనసాగిస్తే రూ.లక్ష కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్ల ఆదాయం వచ్చేదని వివరించారు. రాజధాని ఇక్కడ నుంచి పోతే రూ.లక్ష కోట్ల పరిహారమో? ఎంతో న్యాయస్థానంలో తేలుతుందని చెప్పారు. రాజధాని విషయంలో చట్టం పకడ్బందీగా ఉందని చంద్రబాబు వివరించారు. ‘పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఒకే రాజధాని అని ఉంది. రాష్ట్రపతి ప్రకటన మేరకు హైకోర్టు ఏర్పాటైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చి ప్రారంభించారు. 33 వేల ఎకరాలు ఇచ్చినప్పుడు 9 నగరాలు ఏర్పాటు చేస్తాం.. రాజధాని ఎలా ఉంటుందనేది చెప్పాకే ఒప్పందం కుదిరింది’ అని స్పష్టం చేశారు.

3 రాజధానులు.. ఎవరికి అనుకూలం?
ఇచ్ఛాపురంలో ఉండే వ్యక్తి కర్నూలులోని హైకోర్టుకు వెళ్లాలా? ఇది ప్రజలకు అనుకూలంగా ఉంటుందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. మంత్రాలయంలో ఉండే వ్యక్తి విశాఖలోని రాజధానికి వెళ్లాలా? విజయవాడ నుంచి కర్నూలు, విశాఖపట్నం ప్రాంతాలకు పోవాలా? అని మండిపడ్డారు. అధికారులు ఎక్కడ ఉంటారో తెలియదు.. రాజకీయ నాయకుడు ఎక్కడ ఇల్లు, కార్యాలయాలు పెట్టుకోవాలి? అని ప్రశ్నించారు. ‘జగన్‌మోహన్‌రెడ్డికి ఎంతమాత్రం పరిపూర్ణత ఉన్నా.. అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలి. లేదంటే తన తెలివి తక్కువ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి’ అని చంద్రబాబు కోరారు.

మానవత్వం మరచి
కరోనా విజృంభిస్తున్న వేళ మానవత్వం మరచి.. సమస్యలు సృష్టిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వెలిబుచ్చారు. కరోనా భయంతో ధర్మవరంలో దంపతుల ఆత్మహత్య, ఇంట్లో వాళ్లు రానీయడం లేదని విజయవాడలో ఆసుపత్రి పైనుంచి దూకి ఒకరు మరణించడం, పొక్లెయిన్లతో మృతదేహాల తరలింపు, చెత్త తరలించే వాహనాల్లో బాధితులను తీసుకెళ్లడం లాంటి సంఘటనలు కలచివేస్తున్నాయని చంద్రబాబు చెప్పారు.

యువత, పెద్దలు ఆలోచించాలి: 3 రాజధానుల నిర్ణయంతో ఎంత నష్టపోతారో.. ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో యువత, పెద్దలు, విజ్ఞులు ఆలోచించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇది రైతులు, ఐకాస, రాజకీయ పార్టీల సొంత సమస్య కాదని స్పష్టం చేశారు. నమ్మకద్రోహం చేసిన వారికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. న్యాయ పోరాటం చేయడం ఒక కోణమైతే.. ప్రజా కోర్టులో జగన్‌, వైకాపాను దోషులుగా నిలబెట్టే బాధ్యత తీసుకోవాలన్నారు.


ఈ మాటలన్నారా? లేదా?

రాజధాని అమరావతిలోనే కొనసాగుతుందని వైకాపా ఎన్నికల ప్రణాళిక కమిటీ ఛైర్మన్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సహా పలువురు నేతలు చెప్పిన వైనాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. అందరి మాటలను చదివి వినిపిస్తూ.. ‘అందరినీ అడుగుతున్నా.. ఆ రోజు ఈ మాటలు చెప్పారా? లేదా?’ అని నిలదీశారు. విశాఖపట్నంలో భూకబ్జాలు, భూదందాలు చేయాలనుకుంటున్నారా? అని ఆగ్రహం వెలిబుచ్చారు. అప్పుడు రాజధానిని స్వాగతిస్తున్నామన్న ధర్మాన ప్రసాదరావు.. ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారు? అని నిలదీశారు.


వైకాపా నేతలు... మాటలు

వైకాపా ఎన్నికల ప్రణాళిక కమిటీ ఛైర్మన్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు:  ఎట్టి పరిస్థితుల్లో అమరావతిలోనే రాజధాని ఉంటుంది. లేనిపోని ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందాలని కొందరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే రాజధాని. అది కొనసాగుతుంది. ఇక్కడే ఉంటుంది. దీన్నే మంచి నగర స్థాయికి తెస్తాం. అన్ని వసతులు కల్పించేలా చూస్తాం. దాన్ని ఎన్నికల ప్రణాళికలో తప్పకుండా పెడతాం.
ఇప్పటి పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ: ‘ఎవరైతే భూకబ్జాలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలకు పాల్పడతారో వారికి రాజధాని మార్పు కావాలి. మాకు కాదు. రాజధాని అమరావతిలోనే ఉంటుంది’
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (16.12.2018): ‘వైకాపా అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిని మరో ప్రాంతానికి తరలించం.. అక్కడే పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం’
ధర్మాన ప్రసాదరావు (13.11.2014): గుంటూరు జిల్లాలో రాజధాని ఏర్పాటును స్వాగతిస్తున్నాం.. రాజధానిని వైకాపా అడ్డుకుంటుంది అనడంలో వాస్తవం లేదు’
ఆర్‌కే రోజా, నగరి ఎమ్మెల్యే: ‘రాజధాని కట్టగల సమర్థుడు జగన్‌ కాబట్టే అమరావతిలో ఇల్లు కట్టుకున్నారు’
వసంత కృష్ణప్రసాద్‌, ఎమ్మెల్యే, మైలవరం: ‘రాజధాని ఇక్కడే ఉంటుంది. అందుకే మా నాయకుడు సొంత నివాసం, పార్టీ, క్యాంపు కార్యాలయం నిర్మించుకున్నారు. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అమరావతిని రాజధానిగా గుర్తించాం. రాజధాని తరలిపోతే శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకొంటాం’


* ‘అధ్యక్షా? విజయవాడలో రాజధాని ఏర్పాటును మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాం.. కారణమేమంటే.. మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయింది. ఈ చిన్న రాష్ట్రంలో ఒక ప్రాంతానికి.. ఒక ప్రాంతానికి మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. రాజధానిని ఎక్కడన్నా పెట్టుకోండి. కానీ అలా పెట్టే చోట కనీసం 30 వేల ఎకరాలైనా ఉండాలని మేం మొదట్నుంచి చెబుతున్నాం’

- జగన్‌మోహన్‌రెడ్డి


తెదేపా ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలి
చంద్రబాబుకు మంత్రి బొత్స సవాల్‌

‘ఇప్పుడు ఎన్నికలు కావాలని చంద్రబాబు కోరుతున్నారు. ఆయనతో పాటు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరితో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలి. ఆయనకు నమ్మకం ఉంటే మేం విసురుతున్న ఈ సవాల్‌ను స్వీకరించాలి. దీనికి 48 గంటల్లో సమాధానం చెప్పాలి...’ అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. చంద్రబాబు నిర్వహించిన విలేకరుల సమావేశం చూస్తే ఆయనకు మతిస్థిమితం లేదని రుజువు అయిందన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘గ్రాఫిక్స్‌ రాజధాని పేరిట ప్రజలను మోసం చేశారు. తన బినామీలకు ధరలు పెంచేందుకు జోన్లు విభజించారు. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల ప్రజలు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు కాదా?..’ అని ప్రశ్నించారు. 16 నెలల కిందట ఇదే ప్రజలు అసలైన తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు.

మూడు రాజధానుల్లో అమరావతి
‘జగన్‌ రాజధాని విషయంలో మాట తప్పారని అంటున్న చంద్రబాబు ఆరు నెలలుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. జగన్‌ మాత్రం తాడేపల్లిలో ఉంటున్నారు. మూడు రాజధానులను చంద్రబాబు వ్యతిరేకించి చరిత్రహీనులుగా మిగిలిపోయారు. ఉత్తరాంధ్రలో కాలుపెట్టే హక్కు ఆయనకు లేదు. రాయలసీమకు న్యాయ రాజధాని కూడా వద్దని సొంత ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు. ఆయన మూడు రాజధానులను వ్యతిరేకిస్తుండగా, అందులో అమరావతి కూడా ఉంది..’ అని బొత్స పేర్కొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.