close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఏం పిల్లడో.. ఎల్లిపోతివా

 ప్రజాకవి వంగపండు కన్నుమూత

పార్వతీపురం; పట్టణం, బెలగాం న్యూస్‌టుడే: ఆయన గొంతు విప్పితే జానపదం పరవళ్లు తొక్కుతుంది. గజ్జెకట్టి ఆడితే ప్రజాచైతన్యం గీతమై ఉర్రూతలూగిస్తుంది. కప్పలు.. పాములను తరిమికొడతాయి. లేళ్లు.. పులులను భయపెడతాయి, చిలకలు కత్తులు నూరుతాయి.. తూనీగలు తుపాకులు గురిపెడతాయి. ఉత్తరాంధ్ర ప్రజల గొంతుక వంగపండు ప్రసాదరావు (77) కన్నుమూశారు. ప్రజల బాధలకు బాణీలు కట్టి ఉద్యమబాట పట్టించిన ప్రజాకవి వంగపండు తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. కొన్నాళ్లుగా అస్వస్థులుగా ఉన్న ఆయన.. మంగళవారం తెల్లవారుజామున విజయనగరం జిల్లా పార్వతీపురంలో నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. జన నాట్యమండలి వ్యవస్థాపకుల్లో వంగపండు ఒకరు. 400కు పైగా పాటలను రాసి, స్వయంగా బాణీలు సమకూర్చారు.
ఉద్యోగం వేటలో విశాఖకు: వంగపండు స్వస్థలం పార్వతీపురం మండలం పెదబొండపల్లి. 1943లో జన్మించారు. తండ్రి బుర్రకథ కళాకారుడు. చిన్నతనం నుంచే వంగపండు జానపద బాణీలు, జనజీవితాన్ని ఒడిసిపట్టారు. ఐటీఐ చదివిన ఆయన ఉద్యోగానికి విశాఖ వచ్చి.. పోర్టులో పనికి కుదిరారు. రా.వి.శాస్త్రి, కాళీపట్నం రామారావు వంటి రచయితల నేతృత్వంలో శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాట సమావేశాలకు హాజరయ్యేవారు. అక్కడినుంచి వంగపండు సాహితీ ప్రస్థానం ప్రారంభమైంది.
శ్రీశ్రీయే చిందులేయగా..: ఒకసారి విశాఖలో విరసం సభలకు మహాకవి శ్రీశ్రీ హాజరయ్యారు. జగదాంబ కూడలి వద్ద వంగపండు రాసి పాడిన ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా’ పాటకు శ్రీశ్రీ కూడా చిందులేశారు. ఆయనే వంగపండును ప్రజాకవిగా పేర్కొన్నారు. కొన్నాళ్ల తర్వాత వంగపండు స్వచ్ఛంద ఉద్యోగవిరమణ చేసి, జననాట్యమండలిలో క్రియాశీలకంగా మారారు.
కుటుంబ నేపథ్యం: ప్రసాదరావు భార్య విజయలక్ష్మి. వీరికి నలుగురు సంతానం. కుమారులు పురుషోత్తం, దుష్యంతు, సారంగపాణి, కుమార్తె ఉష ఉన్నారు. వీరిలో ఉష రాష్ట్ర సాంస్కృతిక మండలి ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.
అధికార లాంఛనాలతో అంతిమ వీడ్కోలు: వంగపండు ప్రసాదరావు (77)కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మృతికి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌, ఉప ముఖ్యమంత్రి పి.పుష్పశ్రీవాణి, మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు తదితరులు సంతాపం ప్రకటించారు.


సీఎం కేసీఆర్‌ సంతాపం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు మరణంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ప్రజా సమస్యలు, ప్రజా ఉద్యమాలే ఇతివృత్తంగా పాటలు రాసి, పాడి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి జీవితాంతం పాటుపడ్డారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు తదితరులు కూడా సంతాపం తెలిపారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.