close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రోజూ 40 వేల పరీక్షలు

కరోనా పాజిటివ్‌ వస్తే వెంటనే హోమ్‌ ఐసొలేషన్‌ కిట్‌
కలెక్టర్లకు ఆసుపత్రుల్లో తాత్కాలిక సిబ్బందిని నియమించే అధికారం
అవకతవకలకు పాల్పడే ప్రైవేటు ఆసుపత్రులపై కఠిన చర్యలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా మందులు, పీపీఈ కిట్లు, టెస్ట్‌ కిట్లు లక్షల సంఖ్యలో అందుబాటులోకి తేవాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. పరీక్షలో పాజిటివ్‌ వచ్చినట్లు తేలగానే వారికి వెంటనే హోమ్‌ ఐసొలేషన్‌ కిట్‌ ఇవ్వాలని ఆదేశించింది. 10 లక్షల హోమ్‌ ఐసొలేషన్‌ కిట్‌లు సిద్ధంగా ఉంచాలని సూచించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడైనా సిబ్బంది కొరత ఉంటే తాత్కాలిక పద్ధతిలో నియమించే అధికారం కలెక్టర్లకు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల ఆక్సిజన్‌ బెడ్లను సిద్ధంగా ఉంచాలని నిర్ణయించింది. రోగులకు చికిత్స అందించే విషయంలో అవకతవకలకు పాల్పడే ప్రైవేటు ఆసుపత్రుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేసింది. ప్రతి రోజు 40వేల వరకు పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన రూ.వందకోట్లకు అదనంగా మరో రూ.వంద కోట్లను విడుదల చేసేందుకు అనుమతించింది. కరోనా వ్యాప్తి తీరు- వైరస్‌ సోకిన వారికి అందుతున్న చికిత్స- ప్రభుత్వ వైద్యాన్ని మరింత పటిష్ఠం చేసే అంశాలపై రాష్ట్ర మంత్రిమండలి రెండున్నర గంటల పాటు విపులంగా చర్చించింది. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌, వివిధ విభాగాధిపతులను సమావేశానికి ఆహ్వానించి వివరాలు తెలుసుకొంది. ఎన్ని కేసులు వచ్చినా వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రిమండలి ప్రకటించింది. ఎక్కువ వ్యయం చేసి ప్రైవేటు ఆసుపత్రులకు పోవాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతులు, మందులు, నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని, వారిని ఉపయోగించుకోవాలని ప్రజలను కోరింది. మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, జిల్లాల్లో అవసరాలు తెలుసుకుంటారని, వెంటనే స్పందించి నిర్ణయం తీసుకుంటారని సీఎం తెలిపారు.
నియంత్రిత సాగు గొప్ప విప్లవానికి నాంది
ప్రభుత్వం సూచించిన మేరకు నియంత్రిత సాగు పద్ధతిలో ఈ సారి వానాకాలం పంటలు వేసిన రైతులను మంత్రిమండలి అభినందించింది. నియంత్రిత పద్ధతిలో సాగు విధానం వ్యవసాయ రంగంలో గొప్ప విప్లవానికి నాంది అని, ప్రభుత్వం చెప్పింది తమకోసమే అని రైతులు గ్రహించడం వారి చైతన్యానికి, పరివర్తనా శీలతకు నిదర్శనమని అభిప్రాయపడింది. దాదాపు రెండున్నర గంటలు చర్చించింది. నియంత్రిత పద్ధతి ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.13 కోట్ల ఎకరాల్లో పంటలు వేశారని, మరో 10-12 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉందని, 8.65 లక్షల ఎకరాల్లో వివిధ రకాల తోటలున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. గత వానాకాలంలో రాష్ట్రంలో కోటి 22 లక్షల ఎకరాల్లో సాగు జరిగితే, ఈ సారి కోటి 30 లక్షలకు పైగా ఎకరాల్లో సాగు జరుగుతున్నదని వారు వివరించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్న రైతుబంధు ద్వారా ఈ వానాకాలంలో ఒకేసారి పెద్ద మొత్తంలో రైతులకు నగదు సహాయం అందిందని,  కరోనా కష్టకాలంలో ఇది రైతులకు పెద్ద సహాయంగా ఉపయోగపడిందని మంత్రులు అన్నారు. కోటి 45 లక్షల ఎకరాలకు సంబంధించి, 57.62 లక్షల మంది రైతులకు, రూ.7,251  కోట్ల రూపాయలు అందించడం అసాధారణమని పేర్కొన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెంచాలని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వ్యవసాయ యంత్రాల గణన చేపట్టాలని, ఇంకా ఎన్ని అవసరమో గుర్తించాలని అధికారులను కోరారు. రైతు వేదికలకు స్థలం ఇచ్చినా, నిర్మాణానికి నిధులు ఇచ్చినా వారు సూచించిన వారి పేరును వేదికకు పెట్టాలని సీఎం ఆదేశించారు.
ఆహారశుద్ధి పరిశ్రమలు
వ్యవసాయం లాభసాటిగా మారడం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెంచడం లక్ష్యంగా రాష్ట్రంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు పెంచాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఇందుకోసం సమగ్ర విధానం తీసుకురావాలని నిర్ణయించింది. త్వరలోనే మంత్రులు, అధికారులు సమావేశమై విధాన రూపకల్పన చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆహారశుద్ధి ప్రత్యేక ఆర్థిక మండళ్లు (ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెజ్‌) పెట్టాలనే  సీఎం నిర్ణయాన్ని  అభినందించింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.